news18-telugu
Updated: March 31, 2019, 2:48 PM IST
జీవిఎల్ నరసింహారావు (ఫైల్ ఫొటో)
బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై విరుచుకుపడ్డారు. ఎన్నికల ప్రచారంలో పవన్ కల్యాణ్ పెదబాబును, చినబాబును పల్తెత్తు మాట అనడం లేదని విమర్శించారు. చంద్రబాబుతో ప్యాకేజీ డీల్ కుదిరినందువల్లే పవన్ మంగళగిరి వైపు కనీసం కన్నెత్తి కూడా చూడట్లేదన్నారు. పవన్ కల్యాణ్ ప్యాకేజీ కల్యాణ్‌గా మారిపోయాడని విమర్శించారు. సినిమాల్లోనే గాక నిజ జీవితంలో పవన్ నటనకు తెరలేపారని, ఇకనైనా నాటకాలకు ఫుల్ స్టాప్ పెడితే మంచిదని హితవు పలికారు.
రాష్ట్రంలో చంద్రబాబును ప్రజలెవరూ పట్టించుకునే పరిస్థితి లేదని.. అందుకే ప్రచారం కోసం జాతీయ నేతలను తీసుకొస్తున్నారని విమర్శించారు. మాట్లాడితే గంటలు గంటలు ప్రసంగాలు ఇచ్చే చంద్రబాబు.. అసలు ఆయన ఏపీకి ఏం చేశారన్నది మాత్రం చెప్పడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను తన పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. ఏపీకి కియా కార్ల కంపెనీ వచ్చిందంటే అది కేంద్ర ప్రభుత్వం చలవే అని.. చంద్రబాబు అదేదో తానే తెచ్చానని ప్రచారం చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 300 పైచిలుకు సీట్లు దక్కించుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఎన్డీయే కూటమికి గతంలో కంటే ఎక్కువ సీట్లు వస్తాయన్నారు. చంద్రబాబు, రాహుల్ గాంధీ, మమతా వంటి వారికి ఓటమి భయం పట్టుకుందని.. అందుకే మోదీపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఓటమి భయంతోనే రాహుల్ కూడా రెండు స్థానాల్లో పోటీ చేయాలనుకుంటున్నాడని విమర్శించారు.
Published by:
Srinivas Mittapalli
First published:
March 31, 2019, 2:48 PM IST