గుంటూరు జిల్లా లోని పల్నాడు లో ముఖ్యమైన నియోజకవర్గం గురజాల ఒకప్పటి ఈ కాంగ్రెస్ కంచుకోట లో దశాబ్ద కాలంగా టీడీపీ పాగా వేసింది. 2014 అధికారం దక్కిన నాటి నుండి అభివృద్ధి లో ముందంజ లో ఉన్నప్పటికీ అధికార పార్టీ ఫై వచ్చిన అవినీతి ఆరోపణలు ప్రతికూలంగా మారాయి, ఈ ఆరోపణలకు తోడు వైస్సార్సీపీ జిల్లాలోనే రాజకీయంగా బలమైన కుటుంబం నుండి అభ్యర్థి ని రంగంలోకి దించటం కొత్త గా వచ్చిన జనసేన పార్టీ తన ఉనికిని బలంగా చాటుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో గురజాల నియోజకవర్గంలో ఉత్కంఠ పోరు ఖాయమనే సంకేతాలు వెలువడుతున్నాయి. 2019 ఎన్నికల్లో అధికార పార్టీ తన పట్టు నిలుకోబోతుందా లేక ప్రతిపక్ష వైసీపీ ఈ స్థానంలో బోణీ చేస్తుందా అనేది ఉత్కంఠ రేపుతోంది.

గురజాల టీడీపీ అభ్యర్థి యరపతినేని
1952 లో ఏర్పాటైన గురజాల అసెంబ్లీ నియోజకవర్గం లో మొత్తం 12 సార్లు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించగా అత్యధికంగా 5 సార్లు కాంగ్రెస్, 4 సార్లు తెలుగుదేశం, 2 సార్లు సిపిఐ
ఒక సారి స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. 1985 లో తొలిసారి టీడీపీ గురజాలలో విజయం సాధించింది. ఆ తరువాత 1994 లో రెండో సారి నెగ్గింది. అనంతరం 1999, 2004 ఎన్నికలలో కాంగ్రెస్ నుండి జంగా కృష్ణ మూర్తి విజయం సాధించారు. అయితే 2009లో మాత్రం టీడీపీ తరపున యరపతి నేని శ్రీనివాసరావు విజయం సాధించి నియోజకవర్గంలో టీడీపీ సత్తా చాటారు.

వైసీపీ అభ్యర్థిగా కాసు మహేష్ రెడ్డి
ఇక 2014 లో సైతం వైసీపీ నుండి పోటీచేసిన జంగా కృష్ణమూర్తిపై 7187 ఓట్ల మెజార్టీతో వరుసగా రెండోసారి గెలిచి యరపతినేని గురజాలపై తనపట్టు నిరూపించుకున్నారు. వరుసగా రెండుసార్లు గెలిచిన యరపతినేని నియోజకవర్గ అభివృద్ధి పైనే ఎక్కువగా దృష్టి సారించారు. ముఖ్యంగా కృష్ణాపుష్కరాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించినట్లు స్థానికుల్లో అభిప్రాయం నెలకొంది. అంతే కాకుండా ౩౦౦౦ మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారనే అంశం యరపతినేని పట్ల సానుకూల అంశంగా మారింది.
అయితే ఎమ్మెల్యే యరపతినేని గతంలో ఇచ్చిన హామీలను నెరవేరలేదనే విమర్శ ప్రధానంగా వినిపిస్తోంది. బుగ్గ వాగు డ్యామ్ నీటి సామర్ధ్యం 3 టీఎంసీల నుంచి 5 టీఎంసీలకు పెంచి రెండుపంటలు కు నీరందిస్తామనే హామీవ్వగా, అది నెరవేర్చలేక పోయారనే విమర్శ ఉంది. అలాగే గుత్తికొండబిలం శివాలయాన్ని పర్యాటకప్రాంతంగా మారుస్తామన్న హామీని నిలబెట్టుకోలేక పోవడం కూడా ప్రధాన విమర్శగా ఉంది.

జనసేన అభ్యర్థిగా చింతలపూడి
అలాగే నియోజకవర్గంలో నెరవేరని హామీలతో పాటు అవినీతి ఆరోపణలు అధికారపార్టీని ఇరుకున పెడుతున్నాయి. ముఖ్యంగా నియోజకవర్గంపై పట్టు కోసం ఇతర పార్టీలకు చెందిన కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించారనే ఆరోపణ ఉంది. అలాగే ఎమ్మెల్యే యరపతినేని అనచరులు అధికారం అడ్డుపెట్టుకొని పలువురు వ్యాపారులను నుంచి వసూళ్లకు పాల్పడ్డారనే విమర్శ కూడా ఉంది. అంతే కాదు మైనింగ్ మాఫియా ఆగడాల వ్యవహారంలోనూ సాక్షాత్తూ హై కోర్టు నుంచి మొట్టికాయలు వేయించుకోవడం నియోజకవర్గంలో టీడీపీకి ప్రతికూలాంశంగా మారింది.
ఇక గురజాలలో వైసీపీ తరుపున ఈ సారి కాసు మహేష్ రెడ్డి పోటీలో ఉన్నారు. మాజీ సీఎం కాసు బ్రహ్మానందరెడ్డి కుటుంబానికి చెందిన వారు కావడం, కాసు కుటుంబానికి రాష్ట్ర రాజకీయాలలో మంచిపేరు ఉండటం, మాజీ ఎమ్మెల్యే జంగా లాంటి సీనియర్ బీసీ నాయకులతో కలిసి పనిచేస్తుండటం, మంచి చరిష్మా ఉన్న మురళీధర్ రెడ్డి లాంటి నాయకులు వైసీపీలో చేరటం సానుకూలాంశాలుగా చెప్పవచ్చు. అలాగే కాసు మహేష్ రెడ్డి నియోజకవర్గంలో ప్రచారంలో బలంగా దూసుకెళ్లడంతో వైసీపీ ఈ సారి ఎన్నికల్లో తన విజయావకాశాలను మెరుగుపరుచుకుంది.
అలాగే జనసేన నుంచి ఎన్నారై చింతలపూడి శ్రీనివాసరావు బరిలో ఉన్నారు. చింతలపూడి ట్రస్ట్ తరపున మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ ఉచిత మందులు పంపిణీ చేస్తూ ప్రజలకు అందుబాటు లో ఉన్నారు. ఎలాంటి క్యాడర్ లేని గురజాల నియోజకవర్గం లో జనసేన తరపున రైతుగర్జన సభను దిగ్విజయంగా నిర్వహించారు. దీంతో గురజాల నియోజకవర్గంలో జనసేనకు పట్టు ఉంది అని సంకేతాలు వెలువడ్డాయి. గురజాల నియోజకవర్గం లో జనసేనకు మరో సానుకూలాంశం కాపు ఓటుబ్యాంకు అధికంగా ఉండటం కూడా కారణంగా చెప్పవచ్చు.
మొత్తంగా చూసుకుంటే గురజాల నియోజకవర్గంలో 2019 ఎన్నికలలో ఎలాగైనా గెలవాలని వైసీపీ... తన హవా ను నిలుపుకొని హ్యాట్రిక్ కొట్టాలని టీడీపీ.... సంచలనం సృష్టించాలని జనసేన బరిలో హోరాహోరీగా తలపబడుతున్నాయి. మరి త్రిముఖ పోరులో ఎవరు నెగ్గుతారో వేచిచూద్దాం .
రఘు అన్నా, గుంటూరు, న్యూస్ 18 తెలుగు ప్రతినిధి