అవినీతిలో టాప్‌లో నిలిచిన ఏపీలో జిల్లా... భారీగా ఫిర్యాదులు..

అవినీతిపై ఫిర్యాదు చేయండి, బాధ్యులైన యంత్రాంగం భరతం పడతామని కొత్తగా ‘14400’ కాల్‌సెంటర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

news18-telugu
Updated: December 1, 2019, 10:48 PM IST
అవినీతిలో టాప్‌లో నిలిచిన ఏపీలో జిల్లా... భారీగా ఫిర్యాదులు..
అవినీతిపై ఫిర్యాదులకు 14400 కాల్ సెంటర్
  • Share this:
ప్రభుత్వ శాఖల్లో లంచాలకు తావు లేకుండా పారదర్శకంగా సేవలు అందించటానికి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అహ్మదాబాద్‌ ఐఐఎంతో ఒప్పందం చేసుకుంది. ఒకవైపు ఆ బృందం ప్రభుత్వ శాఖల్లో అవినీతికి ఆస్కారం ఎక్కడ ఉంది...? దాన్ని ఎలా నివారించవచ్చో ప్రభుత్వానికి సిఫార్సులు చేయటానికి అధ్యయనం చేస్తోంది. మరోవైపు ప్రజలు నేరుగా ప్రభుత్వ కార్యాలయాల్లో చోటుచేసుకునే అవినీతిపై ఫిర్యాదు చేయండి, బాధ్యులైన యంత్రాంగం భరతం పడతామని కొత్తగా ‘14400’ కాల్‌సెంటర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కాల్‌సెంటర్‌కు అవినీతి ఉద్యోగులపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఉద్యోగులు పాల్పడే అవినీతిపై రాష్ట్రంలో అత్యధికంగా ఫిర్యాదులు అందుతున్న జిల్లాల్లో గుంటూరు ఒకటి. గత మూడు రోజుల్లో జిల్లాలో ఆయా శాఖల్లో ఉద్యోగులు పీడిస్తున్న లంచాలపై 170 కాల్స్‌ రావటమే దీనికి నిదర్శనం. రెవెన్యూ, విద్యుత్‌, పురపాలకశాఖల సేవలపై ఈ ఫిర్యాదులు ఎక్కువ వచ్చినట్లు తెలిసింది. కాల్‌సెంటర్‌కు అందుతున్న ఫిర్యాదులను జిల్లాల వారీగా పంపి వాటిపై చర్యల నివేదిక కోరుతోంది.

గుంటూరు జిల్లా నుంచి వెళ్లిన ఫిర్యాదుల్లో 70 శాతం ఒక్క రెవెన్యూశాఖలో అవినీతిపైనే ఉన్నాయని గుర్తించారు. ఆ తర్వాత విద్యుత్తు, పురపాలకశాఖలు ఉన్నాయి. పంచాయతీరాజ్‌, జలవనరులు, వ్యవసాయ, పోలీసుశాఖల్లో అవినీతిపైనా ఫిర్యాదులు వచ్చాయని అధికారవర్గాలు తెలిపాయి. నివేదిక ఆధారంగా నిర్థరించుకోడానికి అవినీతి నిరోధక శాఖ సన్నద్ధమవుతోంది. రెవెన్యూశాఖలో భూ మార్పిడి, పాస్‌ పుస్తకాలు ఇవ్వటానికి పెద్ద ఎత్తున లంచాలు పీడిస్తున్నారంటూ ఆరోపణలు వచ్చాయి. అడంగల్‌లో పేర్లు ఎక్కించటానికి, భూముల సర్వే నిర్వహణకు, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు ఇవ్వటానికి, ఇళ్ల క్రమబద్ధీకరణకు సంబంధించిన ఎన్‌ఓసీలు ఇవ్వటానికి, ఫ్యామిలీ, కులము, పొజిషన్‌ సర్టిఫికెట్లకు లంచాలు లేనిదే దస్త్రం కదలటం లేదని ఫిర్యాదులు అందాయి.

గుంటూరు రూరల్‌, తాడికొండ, అమరావతి, తుళ్లూరు, మంగళగిరి, తెనాలి, బాపట్ల, రేపల్లె, చిలకలూరిపేట, సత్తెనపల్లి, పిడురాళ్ల, మాచర్ల, వినుకొండ ప్రాంతాల నుంచి కాల్స్‌ బాగా అందినట్లు తేల్చారు. ఈ మండలాల నుంచి మొత్తం 120 మంది ఫోన్లు చేసి ఆయా సేవలు లంచాలు ఇవ్వని కారణంగా తాము సకాలంలో అందుకోలేకపోయామని చెప్పారు. వీరు ఏ పనుల నిమిత్తం తహసీల్దార్‌ కార్యాలయాలకు వెళ్లారు.? లంచం డిమాండ్‌ చేసిన అధికారి పేరు ఏమిటి.? ఈ లంచానికి సంబంధించి వారి వద్ద ఏమైనా వాయిస్‌ రికార్డులు లేదా రాతపూర్వక సమాచారం ఉందా అనే కోణంలో బాధితులను పిలిచి అధికారులు మాట్లాడుతున్నారు.

విద్యుత్తుశాఖ కార్యాలయంలో కొత్త గృహ కనెక్షన్లు, ఇళ్లమీదగా వెళ్లే లైన్లు మార్పిడి, స్తంభాల మార్పిడి వంటి పనులకు పెద్ద ఎత్తున లంచాలు అడుగుతున్నట్లు గుంటూరు నగరంతో పాటు తెనాలి, నరసరావుపేట, మాచర్ల, పిడుగురాళ్ల, పొన్నూరు, రేపల్లె, మంగళగిరి, బాపట్ల ప్రాంతాల నుంచి కాల్స్‌ వచ్చాయి.  పురపాలకశాఖలో సేవలకు జిల్లాలోని 13 పురపాలక సంఘాల నుంచి ఫిర్యాదులు అందటం విశేషం. టాప్‌ కనెక్షన్లు ఇవ్వటానికి, డోరు నంబరు కేటాయించటానికి, పన్నులు వేయటానికి, భవనాల అనుమతులకు, స్వయం ఉపాధి పథకాలకు లబ్దిదారులను ఎంపిక చేయటానికి,  కొత్త పింఛన్ల మంజూరుకు పెద్దఎత్తున లంచాలు ఆశిస్తున్నారని, అవి ఇవ్వకపోతే సేవలు జాప్యం చేస్తున్నారని ఇప్పటకే పలువురు బాధితులు ఏసీబీ అధికారులను కలిసి లంచావతారుల వివరాలు అందజేసినట్లు తెలిసింది.



గుంటూరు నగరపాలక సంస్థలో ప్రణాళిక విభాగంపై ఫిర్యాదులు బాగా వచ్చాయని తెలుస్తోంది. ఓ ఉద్యోగి ఇటీవల రెండు ప్లాట్లు కొనుగోలు చేశారని, మరో అధికారి ఓ బిల్డర్‌కు అన్నీతానై సలహాలిస్తూ నగరపాలక విధులను విస్మరిస్తున్నారని ఫిర్యాదు అందింది. అదేవిధంగా ఇద్దరు బిల్‌కలెక్టర్లు, ఒక ఆర్వో ఆదాయానికి మించి కూడబెట్టారని ఫిర్యాదులు అందాయని తెలిసింది. ఓ ఉద్యోగి బదిలీపై బయటకు వెళ్లి మళ్లీ ఇక్కడకు రావటం వెనక అతను లంచాలకు ఇక్కడ బాగా అలవాటుపడటమేనని ఫిర్యాదు వెళ్లింది.  కొన్ని శాఖల్లో కొందరు అధికారులు లంచాలు అడగరు.. పనులు మాత్రం సకాలంలో చేయరని మరికొన్ని ఫిర్యాదులు అందాయి. ఈ పనులను పెండింగ్‌ పెట్టడానికి కారణాలను ఏసీబీ అధికారులు తెలుసుకుంటున్నారు.
First published: December 1, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>