Gujarat CM Resigned: గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ రాజీనామా.. ఆయన ఏం చెప్పారంటే..

విజయ్ రూపానీ(ఫైల్ ఫొటో)

గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రుపానీ (Vijay Rupani) తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను విజయ్ రూపానీ గవర్నర్‌కు పంపారు.

  • Share this:
    గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రుపానీ (Vijay Rupani) రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాజ్‌భవన్‌కు వెళ్లి.. గవర్నర్ ఆచార్య దేవరత‌కు అందజేశారు. వచ్చే ఏడాది గుజరాత్‌లో శాసనసభ ఎన్నికలు(Assembly elections) జరగాల్సి ఉండగా.. విజయ్ రుపానీ అనుహ్యంగా తన పదవికి రాజీనామా చేశారు. ఆయన గుజరాత్‌కు 16వ ముఖ్యమంత్రిగా పనిచేశారు. అయితే రూపానీ తన ముఖ్యమంత్రి పదవికి బీజేపీ అధిష్టానం నుంచి వచ్చిన ఆదేశాల మేరకే రాజీనామా చేసినట్టుగా తెలుస్తోంది. గుజరాత్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా(Gujarat CM Resigned) చేసిన తర్వాత విజయ్ రూపానీ మాట్లాడుతూ.. ‘నాలాంటి పార్టీ కార్యకర్తకు ముఖ్యమంత్రి పదవి బాధ్యతను ఇచ్చినందుకు భారతీయ జనతా పార్టీకి నా కృతజ్ఞతలు. ప్రధాని నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో రాష్ట్రాన్ని అభివృద్ది చేసే అవకాశం నాకు దక్కింది. అవును నేను రాజీనామా చేశాను. పార్టీ అప్పగించిన కొత్త బాధ్యతను నేను నిర్వర్తిస్తాను’అని చెప్పారు.

    గుజరాత్ అభివృద్ధి ప్రయాణం కొత్త నాయకత్వంలో ముందుకు సాగాలని, అందుకే తాను రాజీనామా చేశానని విజయ్ రూపానీ చెప్పారు. గత 5 సంవత్సరాలలో ఎన్నికలు, ఉప ఎన్నికల సమయంలో ప్రజల పూర్తి మద్దతు, సహకారం తనకు లభించింది అని ఆయన అన్నారు.ఇక, బీజేపీ ఇటీవల కర్ణాటక, ఉత్తరాఖండ్ సీఎంలను బీజేపీ మార్చిన సంగతి తెలిసిందే. ఇటీవలి కాలంలో ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకున్న మూడో బీజేపీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ.

    ఇక, విజయ్ రూపానీ 2006 నుంచి 2012 మధ్య కాలంలో రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. ఆ తర్వాత 2014లో రాజ్‌కోట్ వెస్ట్ శాసనసభ నియోజవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. కొన్ని నెలల పాటు గుజరాత్ బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగారు. 2016 ఆగస్టులో అప్పటి ముఖ్యమంత్రి ఆనందిబెన్ పటేల్ పదవికి రాజీనామా చేయడంతో.. విజయ్ రూపానీ ఆ బాధ్యతలు చేపట్టారు. 2017 అసెంబ్లీ ఎన్నికల బీజేపీ మరోమారు విజయం సాధించడంతో.. విజయ్ రూపానీ రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2016 ఆగస్టు నుంచి ఆయన ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతున్నారు. అయితే వచ్చే ఏడాది గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా ఆయన బీజేపీ ఆదేశాలతోనే రాజీనామా చేసినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన రాజ్‌కోట్ వెస్ట్ ఎమ్మెల్యేగా ఉన్నారు.
    Published by:Sumanth Kanukula
    First published: