GROUNDREOPRT ELECTION BIG FIGHT IN VIZIANAGARAM ASHOK GAJAPATI RAJU FAMILY SB
#Groundreport:విజయనగరంలో విజయం వరించేనా? రాజుల కుటుంబం రాణించేనా ?
అశోక్ గజపతి రాజు
విజయనగరంలో విస్తృతంగా ప్రచారం చేస్తూ తన కుమార్తెకు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. నగరంలో ప్రజాసమస్యలతో పాటు అన్ని అంశాలపై తనకు అవగాహన ఉందని, తన కుమార్తె ఎమ్మెల్యేగా ఉన్నా... ఆమెను వెనుక ఉండి నడిపిస్తానని అశోక్ చెప్తున్నారు.
సయ్యద్ అహ్మద్, న్యూస్ 18 తెలుగు, సీనియర్ కరస్పాండెంట్
విజయనగరం జిల్లాలో ప్రత్యేకత కలిగిన గజపతి రాజుల కుటుంబం నుంచి ఈసారి ఇద్దరు పోటీలో ఉండటం ఆసక్తి రేపుతోంది. గతంలో విజయనగరం అసెంబ్లీ సీటు నుంచి పలుసార్లు గెలిచిన అశోక్ గజపతిరాజు గత ఎన్నికల్లో ఎంపీగానూ గెలిచి కేంద్రమంత్రిగా పనిచేశారు. ఈసారి ఆయన గతంలో ప్రాతినిధ్యం వహించిన విజయనగరం అసెంబ్లీ సీటు నుంచి ఆయన కుమార్తె ఆదితి గజపతిరాజు పోటీపడుతున్నారు. అశోక్ విషయంలో అభ్యంతరాలేవీ లేకపోయినా ఆదితి గెలుపుపైనే ఈసారి ఉత్కంఠ నెలకొంది.
నిజాయితీపరుడన్న పేరు, రాజకీయాల్లో ఉన్నా రాజకీయం తెలియని రాజవంశీకుడిగా ఉన్న ప్రతిష్ట అశోక్ గజపతిరాజుకు విజయనగరం జిల్లాలో వరుస విజయాలు కట్టబెడుతూ వస్తున్నాయి, గజపతిరాజుల వంశానికి చెందిన అశోక్ గజపతిరాజు ఎంపీగా మరోసారి పోటీపడుతుండగా, ఆయన కుమార్తె ఆదితి తొలిసారి విజయనగరం సీటు నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. విజయనగరం ఎంపీ స్ధానంలో అశోక్, అసెంబ్లీ స్ధానంలో ఆదితి టీడీపీ అభ్యర్ధులుగా పోటీ పడుతున్నారు. గత ఎన్నికల్లో విజయనగరం ఎంపీ సీటు నుంచి పోటీ చేసిన అశోక్ గజపతిరాజును ఓటర్లు భారీ మెజార్టీతో గెలిపించారు. దీంతో మరోసారి అశోక్... అదే సీటు నుంచి అదృష్టం పరీక్షించుకుంటున్నారు.
వయసు మీద పడుతుండటం, వచ్చే ఎన్నికల నాటికి రాజకీయాల నుంచి విరమించుకోవాలన్న ఆలోచన నేపథ్యంలో తన కుమార్తె ఆదితిని రంగంలోకి దింపారు అశోక్ గజపతిరాజు. ఉన్నత విద్యావంతురాలు అయినప్పటికీ ఆదితికి రాజకీయాలు పూర్తిగా కొత్త. రాజకీయాల్లో అనుభవమున్న గతపతిరాజుల కుటుంబం నుంచి వచ్చినా... మాస్ రాజకీయాలకు దూరంగా ఉండటం, అశోక్ కూతురుకు మైనస్ కానుంది. ఇక్కడ వైసీపీ నుంచి పోటీ చేస్తున్న కోలగట్ల వీరభద్రస్వామికి గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవముంది. దీంతోపాటు 2004లో కోలగట్ల... ఇండిపెండెంట్ గా పోటీ చేసి అశోక్ గజపతిరాజుకు తొలిసారి ఓటమి రుచి చూపించారు. ఈ అనుభవాల నేపథ్యంలో విజయనగరం ఎమ్మెల్యేగా ఆదితితో పోలిస్తే వీరభద్రస్వామికే ఓటర్ల మొగ్గు కనిపిస్తోంది. పరిస్ధితిని గమనించిన అశోక్ గజపతిరాజు.. విజయనగరంలో విస్తృతంగా ప్రచారం చేస్తూ తన కుమార్తెకు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. నగరంలో ప్రజాసమస్యలతో పాటు అన్ని అంశాలపై తనకు అవగాహన ఉందని, తన కుమార్తె ఎమ్మెల్యేగా ఉన్నా... ఆమెను వెనుక ఉండి నడిపిస్తానని అశోక్ చెప్తున్నారు.
వచ్చే ఎన్నికల నాటికి తాను రాజకీయాల నుంచి విరమించుకోవాల్సి వస్తే అప్పటికల్లా తన కుమార్తెకు కనీస రాజకీయ అనుభవం కావాలని ఆయన ఆలోచిస్తున్నారు. కానీ క్షేత్రస్ధాయిలో పరిస్ధితులు మరోలా ఉన్నట్లు తెలుస్తోంది. రాజకీయాలతో పాటు ప్రజాసమస్యలపై అంతగా అనుభవం లేని ఆదితికి బదులుగా వీరభద్రస్వామికి అవకాశం ఇస్తే మంచిదన్న భావన స్ధానికంగా వ్యక్తమవుతోంది. కానీ అశోక్ గజపతిరాజుకు ఉన్న మంచిపేరుతో పాటు ఇతర అంశాలు బలంగా పనిచేస్తే మాత్రం చివరి నిమిషంలో సమీకరణాలు మారే అవకాశాలూ లేకపోలేదు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.