గత అసెంబ్లీ ఎన్నికల్లో నల్లగొండ లోక్‌సభ పరిధిలో టీఆర్ఎస్ మెజారిటీ సీట్లను కైవసం చేసుకుని అదే ఊపులో లోక్‌సభ సీటును గెలుచుకునే లక్ష్యంతో ముందుకెళుతోంది ఆ పార్టీ . అటు కాంగ్రెస్ కూడా తన ఓటుబ్యాంకును నిలుపుకుని విజయం సాధించేందుకు కసరత్తు చేస్తోంది. ఈ స్థానానికి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పోటీ చేస్తుండటంతో రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. టీఆర్ఎస్ తరపున వేమిరెడ్డి నరసింహారెడ్డి రంగంలోకి దిగారు. దీంతో ఈ ఎన్నికల్లో కూడా నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గానికి హోరాహోరీ పోరు తప్పేలా లేదు.టీఆర్ఎస్ కొత్త అభ్యర్థికి... ఇప్పటికే ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్ నాయకుడికి మధ్య జరగనున్న పోరు ఆసక్తి రేపుతుంది.
ఇంకోవైపు జిల్లా పార్లమెంట్ ఎన్నికల చరిత్రలో రెండోసారి సీపీఎం మహిళా అభ్యర్థిని బరిలోకి దింపుతోంది. ఇప్పటిదాకా ఏ పార్టీ తమ తరఫున పోటీ చేయడానికి మహిళలకు అవకాశం ఇవ్వలేదు.ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో కానీ, తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన ఒక పార్లమెంట్ ఎన్నికల్లో కానీ అత్యధిక పర్యాయాలు గెలిచిన రికార్డు కాంగ్రెస్ పేరిటే ఉంది. గత సార్వత్రిక (2014) ఎన్నికల్లో ఆ పార్టీ 1.93లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది. అప్పటి అసెంబ్లీ ఎన్నికల్లోనూ సూర్యాపేట మినహా మిగిలిన ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ అభ్యర్థులే విజయం సాధించారు. 1999లో ఒకసారి టీడీపీ తరఫున, 2009, 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గుత్తా సుఖేందర్‌రెడ్డి ఎంపీగా గెలిచారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక కేసీఆర్ పిలుపు మేరకు ఆయన టీఆర్ఎస్లో చేరారు.
ఇదిలా ఉంటే 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ లోక్‌సభ పరిధిలోని శాసనసభ స్థానాల్లో లెక్కలు మారిపోయాయి. కాంగ్రెస్ అడ్రస్ గల్లంతైంది. ఇక్కడి ఏడు నియోజకవర్గాల్లో ఆరుచోట్ల టీఆర్ఎస్ అభ్యర్థులే గెలిచారు. హుజూర్‌నగర్‌లో కాంగ్రెస్ నుంచి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాత్రమే గెలవగా.. నల్లగొండ, దేవరకొండ, నాగార్జునసాగర్, మిర్యాలగూడ, కోదాడ, సూర్యాపేటలో టీఆర్ఎస్ జెండా ఎగరేసింది. ఈ పరిస్థితి మొత్తం రాజకీయ వాతావరణాన్నే మార్చేసింది. ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని చూసి ఓటు వేసే పరిస్థితి లేదన్న చర్చ ప్రస్తుతం జరుగుతోంది. పైగా ఆరు నియోజకవర్గాల్లో గెలిచిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రి జగదీశ్‌రెడ్డి, ప్రస్తుత నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి.. వీరంతా ఏకమై కొత్త అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహారెడ్డిని గెలిపించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇక కాంగ్రెస్ తరపున ఉత్తమ్ కుమార్‌రెడ్డి నియోజకవర్గం మినహా మిగిలినచోట్ల పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపే వారే కరువయ్యారు. మొన్నటి ఎన్నికలో నియోజకవర్గంలో 2,16,807 ఓట్లు ఉండగా, 1,82,388 పోలయ్యాయి. అందులో నల్లగొండ కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి 75,094 ఓట్లు రాగా, టీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాల్‌రెడ్డి 98,792 ఓట్లు పొంది.. 23,698 మెజారిటీతో గెలిచారు.దీంతో ఈసారి నల్గొండ పార్లమెంట్ సెగ్మంట్లో హోరాహోరి పోటీ కనిపిస్తోంది అంతేకాకుండా టీఆర్ఎస్ ఇప్పటివరకు నల్లగొండ లోక్‌సభ సీటును గెలుచుకోకపోవడంతో ఈసారి ఎలాగైనా గెలుచుకోవాలన్న పట్టుదలతో పార్టీ నాయకత్వం ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలను తిరగరాయడానికి సన్నాహాలు చేస్తోంది కారు పార్టీ.
2014 లోక్‌సభ ఎన్నికల్లో ఓట్ల తీరు
గుత్తా సుఖేందర్‌రెడ్డి (కాంగ్రెస్): 4,72,093
తేరా చిన్నపరెడ్డి (టీడీపీ): 2,78,937
పల్లా రాజేశ్వర్‌రెడ్డి (టీఆర్ఎస్): 2,60,677
(బాలకృష్ణ.ఎమ్,సీనియర్ కరెస్పాండెంట్, న్యూస్18)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, Lok Sabha Election 2019, Nalgonda S29p13, Telangana Lok Sabha Elections 2019, Trs, Uttam Kumar Reddy