Andhra Pradesh: వాలంటీర్లకు ఉగాది రోజు ఇచ్చే నగదు పురస్కారం ఎంతో తెలుసా? ఎవరిని ఎలా సత్కరిస్తారు?

Andhra Pradesh: వాలంటీర్లకు ఉగాది రోజు ఇచ్చే నగదు పురస్కారం ఎంతో తెలుసా? ఎవరిని ఎలా సత్కరిస్తారు?

వాలంటీర్లు (ఫైల్ ఫొటో)

యాప్‌ల వినియోగం, మూడు రోజుల్లోగా పెన్షన్ల పంపిణీ, హాజరు శాతం, నవరత్నాల అమల్లో భాగస్వామ్యం, కొవిడ్‌ -19 సర్వే ఆధారంగా వాలంటీర్లకు సతర్కారాలు ఉంటాయి.. వారిని మూడు కేటగిరీలుగా విభజించి ప్రోత్సాహకాలు అందించనున్నారు.

  • Share this:
    జీతాలు పెంచాలంటూ ఇటీవల రోడ్డెక్కిన వాలంటీర్లను ఘనంగా సత్కరించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. దీనిపై గతంలోనే సీఎం జగన్ స్పష్టమైన హామీ ఇచ్చారు. అయితే వారిని ఎలా సత్కరించాలి? ఎవరెవరిని సత్కరించాలి అన్నదానిపై సీఎం అధికారులు సూచనలు చేశారు. జగనన్న తోడు, వైయస్​ఆర్ ఆసరా, చేయూత, ఉపాధి హామీ వాలంటీర్లకు సత్కారం తదితర అంశాలపై సీఎం జగన్‌ అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో వాలంటీర్లను సత్కరించే కార్యక్రమంపై అధికారులకు సీఎం కొన్ని సూచనలు చేశారు.

    వాలంటీర్ల పని తీరును బట్టి.. మూడు కేటగిరీలు ఎంపిక చేయాలని సీఎం నిర్ణయించారు. తొలి కేటగిరీలో ఏడాదిపాటు నిరంతరంగా సేవలు అందించిన వారందరి పేర్లు పరిశీలించాలన్నారు. రెండో కేటగిరిలో ప్రతి మండలంలో, లేదా పట్టణాలో ఐదుగురు చొప్పున ఎంపిక చేయాలన్నారు. మూడో కేటగిరిలో ప్రతి నియోజకవర్గంలో ఐదుగురు చొప్పున వాలంటీర్లను గుర్తించి సన్మానం చేయాలన్నారు.

    ఏడాదిపైగా సేవలు అందించిన వారికి సేవామిత్రతో పాటు బ్యాడ్జీ ఇవ్వడం.. 10 వేల రూపాయల నగదు పురస్కారం అందించాలని నిర్ణయించారు. రెండో కేటగిరిలో ఉన్నవారికి సేవారత్నతో పాటు, స్పెషల్‌ బ్యాడ్జ్ ఇచ్చి.. 20 వేల రూపాయలు నగదు బహుమతి అందిస్తారు. మూడో కేటగిరిలో వారికి సేవా వజ్రాల పేరుతో స్పెషల్‌ బ్యాడ్జ్‌ తో పాటు ఒక మెడల్ ఇచ్చి.. 30 వేల రూపాయల చొప్పున నగదు పురస్కారాలు అందిస్తారు. ఈ పురస్కారాల ఎంపికకు అర్హతలను అధికారులు నిర్దేశించారు. పక్షపాతం చూపకుండా, అవినీతి చేయకుండా సేవా దృక్పథాన్ని పెంచే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టినట్లు సీఎం జగన్ స్పష్టం చేశారు.

    ఈ కేటగిరిలకు ఎంపిక చేసే విధానంలో ముఖ్యంగా యాప్‌ల వినియోగం, మూడు రోజుల్లోగా పెన్షన్ల పంపిణీ, హాజరు శాతం, నవరత్నాల అమల్లో భాగస్వామ్యం, కొవిడ్‌ -19 సర్వే తదితర అంశాలను ప్రాతిపదికగా తీసుకోనున్నారు. ఉగాది నుంచి వాలంటీర్ల పురస్కారాల కార్యక్రమం నిర్వహించాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలోని 3 ప్రాంతాల్లో మూడుచోట్ల కార్యక్రమాలకు సీఎం జగన్ హాజరుకానున్నట్టు తెలుస్తోంది.

    వాలంటీర్ల పురస్కారాలకు తోడు ఉపాధి హామీ, వైయస్​ఆర్ ఆసరా, చేయూత, జగనన్న తోడు వంటి కీలక అంశాలపై ముఖ్యమంత్రి సమీక్ష జరిపారు. ఆసరా, చేయూతల కింద 66,702 రిటైల్‌ షాపులు పెట్టుకునేందుకు ఆప్షన్‌ ఇచ్చినట్లు అధికారులు జగన్‌కు వెల్లడించారు. అందులో ఇప్పటికే 98 శాతం మంది షాపులు ఏర్పాటు చేసుకున్నారని వివరించారు. ప్రఖ్యాత సంస్థల పార్టనర్షిప్‌తో ఈ ఉపాధి మార్గాలను కల్పిస్తున్నామని చెప్పారు. కేవలం రిటైల్‌ షాపులు కాకుండా చిరు వ్యాపారాలు, టెక్స్‌టైల్స్, హాండీక్రాఫ్ట్స్, ఫుడ్‌ ప్రొడక్ట్స్, జ్యుయలరీ, కెమికల్‌ తదితర వ్యాపారాలను ఆప్షన్‌గా పెట్టుకున్నరన్నారు. వీలైనంత త్వరగా ఆప్షన్ పెట్టుకున్న వారికి తోడుగా నిలవాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. బ్యాంకర్లు, అధికారులు సమన్వయంతో వేగంగా ముందుకు వెళ్లాలని సీఎం సూచించారు.
    Published by:Nagesh Paina
    First published:

    అగ్ర కథనాలు