నరసింహావతారం ముగిసింది. పురాణాల్లో చూస్తే నృసింహావతారం కొంతసేపే ఉంటుంది. అయితే, ఈఎస్ఎల్ నరసింహన్ అవతారం మాత్రం తెలుగు రాష్ట్రాల్లో తొమ్మిదేళ్ల పాటు కొనసాగింది. ఓ రకంగా తెలంగాణ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ శకం ముగిసింది. తెలంగాణ గవర్నర్ నరసింహన్, ఆయన సతీమణి బెంగళూరు వెళ్లారు. గవర్నర్ దంపతులకు సీఎం కేసీఆర్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పలువురు నేతలు బేగంపేట విమానాశ్రయంలో ఘనంగా వీడ్కోలు పలికారు. ప్రతి ఒక్కరినీ ఆత్మీయంగా హత్తుకుని వారికి వీడ్కోలు పలికారు గవర్నర్ నరసింహన్. ఈ సందర్భంగా ఆయన కొంత ఉద్వేగానికి గురయ్యారు. నరసింహన్ సతీమణి విమలా నరసింహన్ కూడా అందరినీ పలకరించి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఆమె కూడా ఉద్వేగానికి లోనయ్యారు. నరసింహన్కు బేగంపేట విమానాశ్రయంలో వీడ్కోలు పలికే ముందు ప్రగతిభవన్లో వారిని ఘనంగా సత్కరించారు సీఎం కేసీఆర్ దంపతులు. నరసింహన్, ఆయన సతీమణి విమలా నరసింహన్కు ఘనంగా శాలువాలతో సత్కరించి, వారికి వీణ, నెమలి ప్రతిమలను అందజేశారు.