ఏపీలో నవచరిత్రకు నాంది.. కొత్త అధ్యాయాన్ని ప్రారంభించిన సీఎం జగన్

గ్రామ, వార్డు సచివాలయాల్లో లక్షా 33 వేల పోస్టుల భర్తీ కోసం వచ్చే నెల మొదటి వారంలో పరీక్షలు నిర్వహించనుంది. అక్టోబర్ 2 నాటికి గ్రామ సచివాలయాలు ప్రారంభమైతే ఇక ప్రభుత్వ సేవలు ప్రజల చెంతకు రానున్నాయి.

news18-telugu
Updated: August 15, 2019, 9:52 PM IST
ఏపీలో నవచరిత్రకు నాంది.. కొత్త అధ్యాయాన్ని ప్రారంభించిన సీఎం జగన్
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
  • Share this:
ఏపీలో గ్రామ స్వరాజ్యం దిశగా మరో ముందడుగు పడింది. ప్రభుత్వ సేవలు గ్రామ సీమల్లోని ప్రజలకు మరింత చేరువయ్యేందుకు వీలుగా ప్రభుత్వం రూపొందించిన గ్రామ వాలంటీర్ల వ్యవస్ధ ఇవాళ్టి నుంచి అందుబాటులోకి వచ్చింది. గ్రామ ప్రాంతాల్లో ప్రతీ 50 ఇళ్లకు, పట్టణ ప్రాంతాల్లో 50 నుంచి 100 ఇళ్లకు ఒకరు చొప్పున, గిరిజన ప్రాంతాల్లో 35 ఇళ్లకు ఒకరు చొప్పున గ్రామ వాలంటీర్లను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. దాదాపు 2.67 లక్షల వాలంటీర్లకు నెలకు రూ.5 వేల చొప్పున ప్రభుత్వం వేతనంగా చెల్లించనుంది.  ఏపీలో ఆగస్టు 15 నాటికి గ్రామ వాలంటీర్ల వ్యవస్ధను అందుబాటులోకి తెస్తామన్న జగన్ సర్కార్ మాట నిలబెట్టుకుంది. రెండు నెలలుగా అధికారులను ఆగమేఘాల మీద పరుగులు పెట్టించిన ప్రభుత్వం ఈ క్రమంలో చెప్పిన సమయానికి రెండున్నర లక్షలకు పైగా వాలంటీర్లను నియమించింది. గతంలో ఎన్నడూ లేనంత భారీ స్ధాయిలో అతి తక్కువ సమయంలో నియమించిన రికార్డు కూడా ప్రభుత్వం సాధించింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ సేవలు మెరుగుపడాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన వాలంటీర్ల వ్యవస్ధకు ఇవాళ విజయవాడలోని ఓ ప్రైవేటు కన్వెన్షన్ సెంటర్లో ముఖ్యమంత్రి జగన్ తగిన లక్ష్యాలను నిర్దేశించారు. నేను విన్నాను- నేను విన్నాను అన్న తన నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత వాలంటీర్లపైనే ఉందని జగన్ ఈ సందర్భంగా గుర్తుచేశారు.

స్వాతంత్ర్యం వచ్చి 73 ఏళ్ల తర్వాత కూడా ప్రజలు కష్టాలు పడుతున్నారు. పాదయాత్ర వెంబడి ప్రజలు నాతో తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఆ దిశగా ఆలోచించి గ్రామ వాలంటీర్లు, సచివాలయ వ్యవస్ధకు శ్రీకారం చుట్టాం. ప్రభుత్వాలపై ప్రజల్లో నమ్మకం, విశ్వాసం కలిగించాలి. లంచాలు, పక్షపాతం, వివక్ష లేని వ్యవస్ధ కోసం అడుగులేస్తున్నాం. వాలంటీర్లు కులాలు, మతాలు, వర్గాలు, రాజకీయాలు చూడకూడదు. ఆశయాలున్న యువత ద్వారానే వ్యవస్ధలో మార్పులు తీసుకురాగలం. అధికారంలోకి వచ్చి 3 నెలలు కాకముందే 4 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పిస్తున్నాం. ప్రతీ పథకం వాలంటీర్ల ద్వారానే అమలవుతుంది. లబ్దిదారుల గుర్తింపు, పథకాల డోర్ డెలివరీ, యాభై కుటుంబాల బాధ్యత తీసుకోవడం ఇవే వాలంటీర్ల ప్రాథమిక విధులు.
సీఎం జగన్


ఇకపై ప్రతీనెలా ఏదో ఒక పథకం ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. ఈ ఆర్ధిక సంవత్సరంలోనే మేనిఫెస్టోలో ఇచ్చిన 80 శాతం హామీలు అమలు చేస్తామన్నారు. మిగిలిన 20 శాతం హామీలు వచ్చే ఆర్ధిక సంవత్సరంలో అమలు చేస్తామన్నారు. అక్టోబర్ 15న రైతు భరోసా, జనవరి 26న అమ్మ ఒడి పథకాలను ప్రవేశపెడతామని సీఎం జగన్ వెల్లడించారు. వాలంటీర్ల వ్యవస్ధ రాకతో సంక్షేమ పథకాల అమలు వేగం పుంజుకుటుందని జగన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఏ లబ్దిదారుడికైనా, ఏ కారణం చేతనైనా సంక్షేమ పథకాలు అందని పరిస్ధితి రాకూడదని జగన్ అధికారులకు సూచించారు.

“ గ్రామ వాలంటీర్ల వ్యవస్ధలో అవినీతికి తావుండకూడదు. వాలంటీర్లకు ఆ ఆలోచన రాకూడదు. అందుకే ప్రతీ వాలంటీర్ కూ 5 వేల రూపాయల గౌరవ వేతనం ఇస్తున్నాం. డబ్బు చెడ్డది. ఎవరినైనా చెడగొట్టే కార్యక్రమం చేస్తుంది. వాలంటీర్లు బాగా పనిచేస్తే మీరు సహజంగానే నాయకులుగా ఎదుగుతారు. గ్రామ వాలంటీర్ వస్తే చేతులెత్తి నమస్కరించేలా పనితీరు ఉండాలి.ఎవరు ఏ ప్రశ్నలు వేసినా ఓపిగ్గా సమాధానాలు ఇవ్వండి. వాలంటీర్లకు సమాచారం ఇవ్వడానికి, సందేహాలు తీర్చడానికి వ్యవస్ధను ప్రవేశపెడుతున్నాం. ఏ సమస్యనైనా ప్రజలు నివేదించడానికి 1092 కాల్ సెంటర్ అందుబాటులోకి తెస్తున్నాం. నేరుగా నా ఆఫీసుకే ఫోన్ కాల్ వస్తుంది. విచారణ జరుగుతుంది. నేను నమ్ముకున్న గ్రామ వాలంటీర్లు తప్పు చేశారనే మాట రాకూడదు.” గ్రామ వాలంటీర్ల వ్యవస్ధ ప్రారంభోత్సవంలో సీఎం జగన్గ్రామ వాలంటీర్ల రాకతో ఇకపై రేషన్, ఆరోగ్య శ్రీ సహా ప్రతీ ప్రభుత్వ పథకాన్నీ ప్రజలకు చేరువ చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశంగా ఉంది. ఇందుకోసం అతి త్వరలో గ్రామ సచివాలయాల ఏర్పాటు కూడా పూర్తి చేసి పూర్తి స్దాయిలో అన్ని సేవలను ఇకపై వాటికి అనుసంధానం చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. గ్రామ, వార్డు సచివాలయాల్లో లక్షా 33 వేల పోస్టుల భర్తీ కోసం వచ్చే నెల మొదటి వారంలో పరీక్షలు నిర్వహించనుంది. అక్టోబర్ 2 నాటికి గ్రామ సచివాలయాలు ప్రారంభమైతే ఇక ప్రభుత్వ సేవలు ప్రజల చెంతకు రానున్నాయి.

(సయ్యద్ అహ్మద్, అమరావతి కరస్పాండెంట్, న్యూస్‌18)
First published: August 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...