GOVERNOR TAMILISAI KEY REMARKS ON KAUSHIK REDDY MLC POST AND NEEDS SOME TIME TO REVIEW THE FILE VB
Kaushik Reddy: కౌశిక్ రెడ్డి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఆమోదం పొందలేకపోవడానికి కారణం ఇదేనా.. గవర్నర్ ఏమన్నారంటే..
కౌశిక్ రెడ్డి (ఫైల్)
Kaushik Reddy: కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీపై తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కౌశిక్ ను ఎమ్మెల్సీ పదవికి నామినేట్ చేయడంపై ఆమె అసంతృప్తిని వ్యక్తం చేశారు. సమాజ సేవ, ఇతర రంగాల్లో విశేష కృషి చేసిన వారినే గవర్నర్ కోటాలో నామినేట్ చేయాలని ఆమె అన్నారు. ప్రభుత్వం తమకు పంపిన ప్రతిపాదనలపై ఆలోచించాల్సి ఉందని... ఆలోచించిన తర్వాత తుది నిర్ణయం ప్రకటిస్తానని చెప్పారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
హుజురాబాద్(Huzurabad) నియోజకవర్గం ఉప ఎన్నికల పుణ్యమా అని ఎక్కవగా ప్రజలకు తెలియని నాయకులు కూడా ఇప్పుడు వెలుగులోకి వస్తున్నారు. అంతక ముందు ఎంతోకొంత సాదాసీదాగా పాపులారిటీ ఉన్న నాయకులకు సైతం కొత్తగా ఆఫర్లు వచ్చి పడుతున్నాయి. అయితే ఇదిలా ఉండగా.. ఈ ఉప ఎన్నికతో హాట్ టాపిక్‌గా మారిన రాజకీయ నేత పాడి కౌషిక్ రెడ్డి ( Kaushik Reddy) ఇటీవల కాంగ్రెస్(Congress)నుంచి టీఆర్ఎస్లో(TRS) చేరిన విషయం తెలిసిందే. టీఆర్ఎస్ తరపున హుజురాబాద్ టికెట్ ఆశించి పార్టీలో చేరిన కౌషిక్ రెడ్డికి ఆ పార్టీ అధినేత కేసీఆర్(KCR) ఎమ్మెల్సీ(MLC) పదవిని ఆఫర్ చేశారు. యూత్ లీడర్ (Youth Leader) గా మంచి పట్టు ఉన్నవ్యక్తిగా కౌశిక్ రెడ్డికి పేరుంది. దీంతో కేసీఆర్ ఈ నిర్ణయానికి వచ్చారు. టీఆర్ఎస్ లో చేరిన కొద్ది రోజులకే కేబినెట్ సమావేశంలో ఈ మేరకు తీర్మానం కూడా చేశారు.
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. ఆగస్టు ఒకటవ తేదీన జరిగిన తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో గవర్నర్ నామినేటెడ్ కోటాలో కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీగా సిఫార్సు చేస్తూ కేబినెట్ నిర్ణయించింది. 40 రోజులకు పైగా కావస్తున్నా దానిపై ఎలాంటి చర్చ జరగలేదు. సాహిత్యం, సైన్స్, కళలు, సహకార ఉద్యమం, సామాజిక సేవ తదితర రంగాల్లో అనుభవమున్న వారిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేసే అధికారం రాష్ట్ర మంత్రిమండలికి ఉంటుంది. రాజేందర్ ను దెబ్బ తీసేందుకు కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇవ్వాలని నిర్ణయించారు. దీని పైన కౌశిక్ రెడ్డితో పాటుగా ఆయన సన్నిహితులు - అనుచరులు పైకి ధీమాగా ఉన్నా.. ఎందుకు నోటఫికేషన్ జారీ కాలేదనే అంశం పైన ఆందోళనలో ఉన్నారు. కేబినెట్ తీర్మానించిన ఫైల్ ను ఒక్కసారి గవర్నర్ కు పంపిస్తే.. ఆఫైల్ ను ఎక్కువ రోజులు పెండింగ్ లో ఉండటానికి అవకాశం ఉండదు.
కానీ కౌశిక్ రెడ్డి నియామకానికి సంబంధించి మాత్రం నిర్ణయం వెలువడలేదు. ఇదే విషయం పైన టీఆర్ఎస్ నుంచి ఎటువంటి అధికారిక సమాచారం లేదు. అంతా బాగానే ఉన్నా కొత్తగా గవర్నర్ తమిళిసై ఆ ఫైల్ ను హోల్డ్ లో పెట్టినట్లు తెలుస్తోంది. తెలంగాణ గవర్నర్ గా రెండేళ్లు పూర్తి చేసుకున్న తమిళసై మీడియా రాజ్‌భవన్‌లో బుధవారం మీడియా ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఆ సమయంలో కౌశిక్ రెడ్డి ఫైల్ గురించి కీలక అంశం బయట పెట్టారు. కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ గా నియామక ఫైల్ తన వద్దే ఉందని... తనకు నిర్ణయం తీసుకోవటానికి మరి కొంత సమయం కావాలని వ్యాఖ్యానించారు. సామాజిక సేవకులకు, ఇతర రంగాల్లో విశేష కృషి చేసిన వారినే ఎమ్మెల్సీకి నామినేట్ చేయడం సరైనదని గవర్నర్ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం పంపిన ప్రతిపాదనపై ఆలోచించాల్సి ఉందని, కౌషిక్ రెడ్డి విషయంలో ఆలోచించి నిర్ణయం ప్రకటిస్తానని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలిపారు.
ఇక ప్రజాకవి గోరేటి వెంకన్న కూడా గవర్నర్ కోటాలోనే ఎమ్మెల్సీ అయ్యారు. ఆయనను ఎమ్మెల్సీగా ప్రతిపాదిస్తూ ఫైల్ పంపిన మరుసటి రోజే గవర్నర్ తమిళి సై ఆమోదించారు. రాజకీయ నేతగా ఉన్న కౌషిక్ రెడ్డి ఏ రంగంలోనూ విశేష కృషి చేయలేదు కాబట్టి ఆయనకు గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీ పదవి లేనట్టేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా.. కొంతమంది దీనిపై వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. కౌశిక్ పైన ఉన్న కేసుల కారణంగానే ఆయన నియమకానికి ఇంకా అనుమతి రాలేదనే వాదన వినిపిస్తోంది.
2018 ఎన్నికల్లో హుజురాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసిన కౌశిక్‌రెడ్డిపై ఇల్లంతకుంట, సుబేదారి పోలీస్స్టేషన్లలో కేసులు పెట్టారు. అంతే కాకుండా వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసులు నమోదయ్యాయి. ఈ విధంగా నమోదైన కేసుల విషయంగా గవర్నర్ కు ఫిర్యాదులు అందాయని.. దానితో నివేదిక కోరారని చెబుతున్నారు. వీటిపై సమగ్ర సమాచారం తెలుసుకున్న తర్వాతనే అతడతిని ఎమ్మెల్సీగా ఆమోదించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.