ఆంధ్రప్రదేశ్ శాసనసభ ను రద్దు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ఏపీ శాసనసభను రద్దు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. దీంతో 14వ శాసనసభను రద్దు చేస్తూ గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల ఫలితాల అనంతరం మంత్రివర్గం చేసిన తీర్మానాన్ని ఆయన ఆమోదించారు. ఆ వెంటనే గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. 15వ శాసనసభ ఏర్పాటుకు గజిట్ నోటిఫికేషన్ ఆదివారం వెలువడే అవకాశం ఉంది. ఎన్నికల ఫలితాల అనంతరం నియోజకవర్గాల వారీగా గె లిచిన అభ్యర్థుల వివరాలను ఎన్నికల కమిషన్ ద్వారా అధికారికంగా గవర్నర్కు నివేదించాల్సి ఉంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల జాబితాను ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది నేడు గవర్నర్ను కలిసి అందించనున్నారు.
శనివారం హైదరాబాద్ చేరుకున్న వైసీపీ అధినేత, కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసి ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించారు. అంతకుముందు జగన్ గవర్నర్ నరసింహన్తో రాజభవన్లో సమావేశమయ్యారు. మరోవైపు, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా వైసీపీ నేతలు గవర్నర్ను కలిసి కోరారు. మొత్తంమీద ఏపీలో కొత్త ప్రభుత్వానికి ఏర్పాట్లు చకచక సాగిపోతున్నాయి. ఈ నెల 30న జగన్ ప్రమాణ స్వీకారానికి కూడా విజయవాడలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.
Published by:Sulthana Begum Shaik
First published:May 26, 2019, 07:56 IST