GOA AND UTTARAKHAND ASSSEMBLY ELECTIONS POLLING TODAY AND UP SECOND PHASE POLLING PVN
Polling : గోవా,ఉత్తరాఖండ్ లో నేడే పోలింగ్..యూపీలో రెండో దశ..రైతులు,ముస్లింల ఓట్లే కీలకం
ప్రతీకాత్మక చిత్రం
5 State assembly elections : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్లో భాగంగా ఇవాళ ఉత్తరాఖండ్, గోవా రాష్ట్రాల్లో ఓటింగ్ జరగనుంది. వీటితో పాటు ఉత్తర్‌ప్రదేశ్‌లో రెండో విడత పోలింగ్ జరగనుంది. దీంతో ఎన్నికల సంఘం భద్రతను కట్టుదిట్టం చేసింది.
5 State assembly elections : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్లో భాగంగా ఇవాళ ఉత్తరాఖండ్, గోవా రాష్ట్రాల్లో ఓటింగ్ జరగనుంది. వీటితో పాటు ఉత్తర్‌ప్రదేశ్‌లో రెండో విడత పోలింగ్ జరగనుంది. దీంతో ఎన్నికల సంఘం భద్రతను కట్టుదిట్టం చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా బలగాలను మోహరించింది. ఉత్తరాఖండ్, గోవా రాష్ట్రాల్లో ఒక్క విడతలోనే పోలింగ్ జరగనుంది. ఉత్తరాఖండ్‌లో...మొత్తం 13 జిల్లాల్లోని 70 నియోజకవర్గాలకు ఒకే దశలో ఇవాళ పోలింగ్ జరుగనుంది. ఉత్తరాఖండ్‌లో 632 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించేందుకు 81 లక్షల మంది ఓటర్లు సిద్ధంగా ఉన్నారు. 2000లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇది ఐదవ అసెంబ్లీ ఎన్నికలు కావడం గమనార్హం. రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని 70 అసెంబ్లీ స్థానాలకు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇదిలా ఉండగా, రాష్ట్రంలో తొలిసారిగా మొత్తం 101 మహిళా పోలింగ్ బూత్‌లను 'సఖి' పోలింగ్ బూత్ లను ఏర్పాటు చేశారు. ఈ బూత్ లలో పోలింగ్ అధికారులందరూ మహిళలే ఉంటారని, పోలింగ్ ప్రక్రియలో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు ఇలా చేశామని ప్రధాన ఎన్నికల అధికారి (CEO) సౌజన్య తెలిపారు. వికలాంగులు నిర్వహించేందుకు ఆరు పోలింగ్ బూత్‌లను కూడా ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. అటువంటి బూత్‌లలో ప్రిసైడింగ్ అధికారులు, పోలింగ్ సిబ్బందికి భిన్నమైన సామర్థ్యం ఉంటుంది.
ఇక,ఈ ఎన్నికల్లో గెలిచి మరోసారి అధికారంలోకి రావాలని పుష్కర్ సింగ్ ధామి నేతృత్వంలోని భాజపా యోచిస్తోంది. మరోవైపు సీనియర్ నేత హరీశ్ రావత్ నేతృత్వంలోని కాంగ్రెస్.. అధికారం తమదేనని ధీమాగా ఉంది. ఆమ్ఆద్మీ కూడా ఈసారి ఉత్తరాఖండ్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తరాఖండ్‌లో మొత్తం 70 సీట్లకు గాను బీజేపీ 57 గెలుచుకోగా, కాంగ్రెస్ కేవలం 11 సీట్లు గెలుచుకుంది. రెండు సీట్లు స్వతంత్రులకు దక్కాయి. ఈసారి, ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్రంలోని మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి తన అభ్యర్థులను బరిలోకి దింపుతోంది.
గోవాలో... మొత్తం 40 నియోజకవర్గాలకు సోమవారం ఒక్క విడతలోనే పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో వివిధ పార్టీలకు చెందిన 301 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎలాగైనా మరోసారి పీఠం దక్కించుకోవాలని యోచిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ ఈసారి గోవాను వదులుకోకూడదని నిర్ణయించుకుంది. ఇక, మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎమ్సీ, కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ఆద్మీ కూడా ఈ ఎన్నికల బరిలో నిలిచాయి. శివసేన-ఎన్సీపీ కూటమి కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.
ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో కీలకమైన ఉత్తర్‌ప్రదేశ్‌లో సోమవారం రెండో విడత పోలింగ్ జరగనుంది. 9 జిల్లాల్లోని 55 అసెంబ్లీ స్థానాలకు సోమవారం పోలింగ్ జరగనుంది. 586 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. రెండో దశ జరిగే స్థానాల్లో ముస్లింలదే హవా. సహారన్‌పుర్, రాంపుర్ తదితర జిల్లాల్లో ముస్లింల జనాభా చాలా ఎక్కువ. సాధారణంగా ఇక్కడ సమాజ్‌వాదీ పార్టీకి గట్టి పట్టుంది. ముస్లింలతో పాటు చెరకు రైతుల ఓట్లు కీలకం. చెరకు బకాయిల అంశం ఎన్నికలపై ప్రభావం చూపనుంది. ఈ నేపథ్యంలో మొదటిదశ పోలింగ్‌తో పోలిస్తే బీజేపీ గట్టి పోటీ ఎదుర్కోక తప్పదన్న విశ్లేషణలు ఉన్నాయి. గతంలో ఈ ప్రాంతంలో ముస్లిం, జాట్, దళిత ఓటర్ల కూటమి ఫార్ములా విజయవంతమైన సందర్భాలు ఉన్నాయి. అందుకే ఈసారి ఎస్పీ.. ఆర్ఎల్డీ, మహాన్దళ్తో పొత్తు పెట్టుకుంది. ఈ కూర్పు కారణంగా జాట్ ఓట్లపై ఆర్ఎల్డీ ఆధిపత్యం సాధించే అవకాశం ఉంది. బదాయూ, సంభల్ జిల్లాల్లో ములాయం సింగ్ యాదవ్ కుటుంబ ప్రభావం ఎక్కువే. రెండో దశ ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో దళితులు 20 శాతంగా ఉన్నారు. వీరి ఓట్లు ఎటువైపు పడతాయనే అంశంపై పార్టీల విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ 55 స్థానాల్లో భాజపా 38 గెలుచుకుంది. సమాజ్‌వాదీ 15 సీట్లు గెలుచుకోగా.. కాంగ్రెస్ రెండు స్థానాలకు పరిమితమైంది. సమాజ్‌వాదీ గెలుపొందిన 15 స్థానాల్లో 10 మంది ముస్లింలే కావడం గమనార్హం.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.