Ghulam Nabi Azad: కాంగ్రెస్‌పై సీనియర్ నేత ఆజాద్ సంచలన వ్యాఖ్యలు

72 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా పరిస్థితి దిగజారిందని గులాం నబీ ఆజాద్ అన్నారు. గాంధీ ఫ్యామిలీని తప్పుబట్టడం లేదని.. పార్టీని వెంటనే సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

news18-telugu
Updated: November 22, 2020, 10:59 PM IST
Ghulam Nabi Azad: కాంగ్రెస్‌పై సీనియర్ నేత ఆజాద్ సంచలన వ్యాఖ్యలు
గులాంనబీ ఆజాద్
  • Share this:
గత కొన్నేళ్లుగా కాంగ్రెస్ పార్టీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. లోక్‌సభ ఎన్నికలే కాదు.. రాష్ట్రాల్లోనూ ప్రభావం చూపించలేక చతికిలపడుతోంది. ఇటీవల బీహార్‌లో జరిగిన ఎన్నికల్లో కూడా ఇదే పరిస్థితి. ఆ పార్టీతో పొత్తు వల్లే ఆర్జేడీ అధికారానికి దూరమైందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరి కాంగ్రెస్‌కు అసలు ఏమైంది? నాయకత్వ లోపమా? కేడర్ నిర్లక్ష్యమా? అంతర్గత విభేదాలా? ఎందుకింత దారుణంగా తయారైంది. ఈ ప్రశ్నలకు కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. 72 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా పార్టీ పరిస్థితి దిగజారిందని ఆయన అన్నారు. తాను గాంధీ ఫ్యామిలీని తప్పుబట్టడం లేదని.. పార్టీని సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

''72 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా కాంగ్రెస్ పరిస్థితి దిగజారింది. రెండు పర్యాయాలుగా లోక్‌సభలో పూర్తి స్థాయి ప్రతిపక్ష హోదాను కూడా పొందలేకపోయింది. కానీ అనూహ్యంగా లద్దాఖ్ హిల్ కౌన్సిల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 9 సీట్లు వచ్చాయి. అలాంటి సానుకూల ఫలితాల తాము ఊహించలేదు.'' అని ఆజాద్ అన్నారు.''గాంధీ కుంటుబానికి నేను క్లీన్ చిట్ ఇస్తున్నా. ఇప్పటి కోవిడ్ 19 పరిస్థితుల్లో వారు ఇంతకంటే ఎక్కువ ఏమి చేయలేరు. ఇంతకు ముందటి డిమాండ్లలో ఎటువంటి మార్పులేదు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ తిరిగి ప్రత్యామ్నాయ అధికార శక్తి కావాలనుకుంటే వెంటనే సంస్థాగత ఎన్నికలు జరిపించాల్సి ఉంటుంది.'' అని ఆజాద్ పేర్కొన్నారు.''కాంగ్రెస్ పార్టీ నిర్మాణం పూర్తిగా కుప్పకూలింది. పార్టీని మళ్లీ పునర్‌ నిర్మించాలి. ఆ తర్వాతే సరైన నాయకుడిని ఎన్నుకోవాలి. అప్పుడు పార్టీ బాగుపడుతుంది. కానీ ఊరికే నాయకుడిని మార్చి.. బీహార్, యూపీ, మధ్యప్రదేశ్‌లో గెలుస్తామంటే ప్రయోజనం ఉండదు. వ్యవస్థను మార్చినప్పుడే అది సాధ్యపడుతుంది.'' అని ఆయన అన్నారు.


''మా పార్టీ ఐనా.. ఏ పార్టీ ఐనా వ్యక్తి పూజ అనేది మంచిది కాదు. పార్టీ పతనానికి అదే ముఖ్య కారణం. ఈ సంస్క‌ృతికి అన్ని స్థాయిల్లోనూ దూరంగా ఉండాలి. రాజకీయాలు తపస్సులాంటివి. సుఖాలు, డబ్బు కోసమే రాజకీయాలకు వచ్చిన వారిని చూస్తుంటే సిగ్గనిపిస్తుంది.'' అని అన్నారు ఆజాద్.''మా పార్టీలో రెబల్స్ లేరు. తిరుగుబాటు అంటే ఒకరి స్థానంలోకి మరొకరు రావడం. పార్టీ అధ్యక్షుడి స్థానానికి ఇంకే అభ్యర్థీ లేరు. ఇది తిరుగుబాటు కాదు. సంస్కరణల గురించి చెబుతున్నా.'' అని ఆజాద్ పేర్కొన్నారు.


'ఓటములతో పార్టీ ఆందోళన చెందుతోందనడం వాస్తవం. ముఖ్యంగా బీహార్ ఎన్నికలు, లోక్‌సభ ఉపఎన్నికల్లో ఓటమి పార్టీని తీవ్రంగా కలవరపెడుతోంది. దీనికి పార్టీ అధిష్ఠానం మాత్రం కారణం కాదు. నాయకత్వం అద్భుతంగా ఉంది. అందుకే నేను నాయకత్వాన్ని నిందించను. పార్టీని ప్రేమించి, పార్టీ కోసం శ్రమించేవారు కరువవ్వడం వల్లే పార్టీ బలహీనపడిందని నా భావన. దీనికి తోడు పోటీలో నిలబడే నేతలకు, కింది స్థాయి నాయకులకు మధ్య సంబంధాలు దెబ్బతినడం కూడా మా ఓటమికి కారణమం'. అని ఆజాత్ తెలిపారు.


''పార్టీ తరపున ఎన్నికల టికెట్ పొందిన నేతలు ప్రజల్లో ఉండడం లేదు. టికెట్ పొందిన వెంటనే 5 స్టార్ హోటల్ బుక్ చేసుకుంటున్నారు. అక్కడే కూర్చుంటున్నారు. అలా అయితే ఎలా గెలుస్తారు? కాంగ్రెస్ మళ్లీ గాడిలో పడాలంటే నేతలు 5 స్టార్ కల్చర్ వదిలేసి.. ప్రజలతో మమేకం అవ్వాలి. వారికి అండగా ఉన్నామన్న నమ్మకం కలిగించాలి. పార్టీ నేతల్లో అదే కరువైంది. అందుకే పార్టీ వరుసగా ఓటములను చవిచూస్తోంది.'' అని అన్నారు.


కాగా, కాంగ్రెస్ సీనియర్ కపిల్ సిబల్ ఇటీవలే పార్టీ నాయకత్వం సరిగ్గా వ్యవహరించడం లేదని అన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో అయినా పునః సమీక్ష అవసరమని లేఖ రాయడం చర్చనీయామయింది. ఈ క్రమంలోనే ఆజాద్ చేసిన తాజా వ్యాఖ్యలు కాంగ్రెస్‌ పార్టీలో మళ్లీ దుమారం రేపుతున్నాయి. దీనిపై కాంగ్రెస్ హైకమాండ్ ఎలా స్పందిస్తుందన్న దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
Published by: Shiva Kumar Addula
First published: November 22, 2020, 10:51 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading