GHMC Elections: ఏపీ నుంచి బ్యాలెట్ బాక్సులు వెనక్కి

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌క‌టించిన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు తెలంగాణ‌లోని వివిధ జిల్లాల నుండి 30వేల బ్యాలెట్ బాక్సుల‌ను పంపారు. అక్కడ ఎన్నికలు వాయిదా పడడంతో వాటిని వెనక్కి రప్పిస్తున్నారు.

news18-telugu
Updated: October 8, 2020, 7:16 PM IST
GHMC Elections: ఏపీ నుంచి బ్యాలెట్ బాక్సులు వెనక్కి
ఏపీ నుంచి వెనక్కి రప్పించిన బ్యాలెట్ బాక్సులు
  • Share this:
జీహెచ్ఎంసీ సాధార‌ణ ఎన్నిక‌ల‌కు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్‌ను బ్యాలెట్ బాక్సుల ద్వారా నిర్వ‌హించాల‌ని స్టేట్ ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ నిర్ణ‌యించ‌డంతో 30 వేల బ్యాలెట్ బాక్సులు అవ‌స‌ర‌మ‌వుతాయ‌ని అంచ‌నా వేశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌క‌టించిన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు తెలంగాణ‌లోని వివిధ జిల్లాల నుండి 30వేల బ్యాలెట్ బాక్సుల‌ను పంపిన‌ట్లు తెలిపారు. అయితే అక్క‌డ ఎన్నిక‌లు వాయిదా ప‌డ‌డంతో జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల‌కు వినియోగించడానికి తిరిగి ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి 30వేల బ్యాలెట్ బాక్సుల‌ను తెప్పిస్తున్న‌ట్లు జీహెచ్ఎంసీ అద‌న‌పు క‌మిష‌న‌ర్ (స్పోర్ట్స్‌) ఎన్‌.యాద‌గిరిరావు తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల ఏర్పాట్ల‌లో భాగంగా బ్యాలెట్ బాక్స్‌ల నోడ‌ల్ అధికారిగా ఎన్‌.యాద‌గిరిరావు ను జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ డి.ఎస్‌.లోకేష్ కుమార్ నియ‌మించారు. గురువారం నాటికి 17,366 బ్యాలెట్ బాక్స్‌లు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని 7 జిల్లాల నుంచి అందిన‌ట్లు తెలిపారు. మిగిలిన 12,366 బ్యాలెట్ బాక్సుల‌ను కూడా ఏపిలోని వివిధ జిల్లాల నుంచి తెప్పిస్తున్న‌ట్లు తెలిపారు. బ్యాలెట్ బాక్స్‌ల‌ను విక్ట‌రీ ప్లే గ్రౌండ్‌లోని గ‌దుల‌లో భ‌ద్ర‌ప‌రుస్తున్న‌ట్లు తెలిపారు. అలాగే పోలీసు సెక్యూరిటిని ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపారు. ఇప్ప‌టి వ‌ర‌కు విశాఖప‌ట్నం జిల్లా నుంచి 7,111, చిత్తూరు జిల్లా నుంచి 5,458, అనంత‌పురం నుంచి 357, ప్ర‌కాశం నుంచి 841, నెల్లూరు నుంచి 1300, తూర్పుగోదావ‌రి నుంచి 449, క‌డ‌ప నుంచి 1850 బ్యాలెట్ బాక్స్‌లు వ‌చ్చిన‌ట్లు తెలిపారు.

కరోనా నేపథ్యంలో ఈసారి ఎన్నికలను బ్యాలెట్ విధానంలోనే నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాజకీయ పార్టీలతో ఎన్నికల సంఘం చర్చలు జరిపింది. రాష్ట్రంలో గుర్తింపు పొందిన, న‌మోదైన‌ 50 పార్టీల్లో 26 పార్టీలు త‌మ అభిప్రాయాల‌ను ఎన్నికల సంఘానికి తెలిపాయి. ఈవీఎంల ద్వారా ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని 3 పార్టీలు మాత్రమే కోరాయి. అందులో బీజేపీ కూడా ఉంది. మరో 13 పార్టీలు మాత్రం బ్యాలెట్ విధానానికి జైకొట్టాయి. ఈవీఎంల ద్వారా కరోనా వ్యాప్తి చెందే ప్రమాదముందని.. బ్యాలెట్ పద్దతిలోనే ఎన్నికలు నిర్వహించడం శ్రేయస్కరమని చెప్పాయి. ఇక మిగిలిన పార్టీలు మాత్రం ఏదైనా ఓకేనని తెలిపాయి. ఈ నేపథ్యంలో మెజారిటీ పార్టీ అభిప్రాయం మేరకు.. బ్యాలెట్ పద్దతిలోనే ఎన్నికలను నిర్వహిస్తామని ఎన్నికల సంఘం ప్రకటించింది.

జీహెచ్‌ఎంసీ ప్రస్తుత పాలకమండలి పదవీకాలం 2021 ఫిబ్రవరి 10వ తేదీతో పూర్తవుతున్నది. ఆ లోపు ఎన్నికలను నిర్వహించి.. కొత్త పాలకమండలిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల నిర్వహణకు తెలంగాణ రాష్ర్ట ఎన్నిక‌ల సంఘం చ‌ర్య‌లను మొదలుపెట్టింది. కరోనా నేపథ్యంలో ఈసారి ఎన్నికల్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకోబోతున్నారు. గతంలో 120 0మంది ఓటర్లకు ఒక పోలింగ్‌ కేంద్రం ఏర్పాటుచేయగా, ఈసారి 800 మంది ఓటర్లకు ఒకటి చొప్పున పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఈసారి పోలింగ్‌ కేంద్రాల సంఖ్య 10 వేలకు చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

జీహెచ్‌ఎంసీ ఎన్నికలు నవంబర్‌లో జరగొచ్చని, అందుకు సిద్ధంగా ఉండాలని టీఆర్ఎస్ కార్యకర్తలకు మున్సిపల్ మంత్రి కేటీఆర్ దిశానిర్దేశం చేసినట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే, తాను అలాంటి కామెంట్స్ చేయలేదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనేది ఎన్నికల సంఘం చూసుకుంటుందని, ఎస్ఈసీ నిర్ణయానికి అనుగుణంగా నడుచుకుంటామని చెప్పారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: October 8, 2020, 6:52 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading