news18-telugu
Updated: November 20, 2020, 7:13 AM IST
కేసీఆర్‌తో కేటీఆర్(ఫైల్ ఫోటో)
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ఎన్నికల వేళ.. హైదరాబాద్ మహానగరంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. గెలుపుపై అధికార పార్టీ టీఆర్ఎస్ ధీమాగా ఉంది. దుబ్బాక ఫలితాలే రిపీట్ అవుతాయని బీజేపీ ఢంకా భజాయిస్తోంది. తామూ రేస్‌లో ఉన్నామని ఎంఐఎం, కాంగ్రెస్ చెబుతున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు కొంత మంది అభ్యర్థులను ప్రకటించాయి. నామినేషన్ దాఖలుకు ఇవాళే ఆఖరు రోజు కావడంతో.. 12 గంటల కల్లా మిగిలిన అభ్యర్థులను ఖరారు చేసే అవకాశముంది. ఇలాంటి కీలక సమయంలో టీఆర్ఎస్కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. కొందరు సిట్టింగ్‌లకు టికెట్లు ఇవ్వకపోవడంతో.. వారు పార్టీని వీడుతున్నారు. బీజేపీలోకి జంప్ అవుతున్నారు.
గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించిన బీజేపీ.. కాంగ్రెస్, టీఆర్ఎస్లోని అసంతృప్త నేతలకు గాలం వేస్తోంది. ఇప్పటికే పలువురు నేతలు ఆ పార్టీలో చేరారు. టీఆర్ఎస్ నుంచి టికెట్ రాకపోవడంతో మైలార్‌దేవ్‌పల్లి సిట్టింగ్ కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి బీజేపీలో చేరారు. తాజాగా మరో కార్పొరేటర్ కూడా కాషాయ పార్టీలో చేరారు. గురువారం వెంగళరావునగర్ కార్పొరేటర్ కిలారి మనోహర్.. కేంద్రహోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. వెంగళరావునగర్ నుంచి ఆయనకే బీజేపీ టికెట్ ఇవ్వనుంది. టికెట్ రాని మరికొందరు కూడా బీజేపీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది.
కాగా, నవంబరు 17న జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్‌తో పాటు నోటిఫికేషన్ కూడా విడుదలైన విషయం తెలిసిందే. డిసెంబరు 1న పోలింగ్ జరుగుతుంది. 4న ఫలితాలను వెల్లిస్తారు. నవంబరు 18 నుంచి 20 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 21న నామినేషన్లు పరిశీలిస్తారరు. నామినేషన్ల ఉపసంహరణకు నవంబరు 22 వరకు గడువు ఉంటుంది. ఇక అవసరమైన ప్రాంతాల్లో డిసెంబరు 3న రిపోలింగ్ నిర్వహిస్తారు. కరోనా నేపథ్యంలో బ్యాలెట్ పద్దతిలోనే ఎన్నికలను నిర్వహించనున్నారు.
Published by:
Shiva Kumar Addula
First published:
November 20, 2020, 7:06 AM IST