గ్రేటర్ ఎన్నికల వేళ మాటల తూటాలు పేలుతున్న సంగతి తెలిసిందే. కొన్ని సందర్భాల్లో పలువురు నేతలు ప్రత్యర్థి పార్టీలపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక సూచనలు చేసింది. తాము నోటిఫికేషన్లో పొందుపరిచిన ఎన్నికల ప్రవర్తనా నియమావళికి వ్యతిరేకంగా కొందరు రాజకీయ నాయకులు వ్యక్తిగత విమర్శలకు పాల్పడుతున్నట్టు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా గుర్తించామని ఎస్ఈసీ తెలిపింది. ఎన్నికల ప్రచారంలో అభ్యర్థుల వ్యక్తిగత విషయాలపై మాట్లాడొద్దని సూచించారు. ఇటువంటి విమర్శలు గొలుసు కట్టు తీరులో ప్రతిచర్యను ప్రేరేపిస్తాయని చెప్పారు. ఎన్నికల నిర్వహణకు అడ్డుపడతాయిని.. ఎన్నికలు ప్రశాంత వాతావరణం కొనసాగాలి అని అన్నారు.
పార్టీలపై నిరాధార విమర్శలు చేయరాదని స్పష్టం చేసింది. ప్రచారం సందర్భంగా రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, కార్యకర్తలు కొవిడ్ నిబంధనలు పాటించాలని ఎస్ఈసీ సూచించింది. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కోరింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘిస్తే దానిని ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణిస్తుందని చెప్పారు. నిబంధనలను ఉల్లంఘించొద్దని ఆదేశిస్తూ ఎస్ఈసీ కార్యదర్శి అశోక్‌కుమార్ ఉత్తర్వులు జారీచేశారు.
మరోవైపు జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థుల తరఫున ఆయా పార్టీల ముఖ్య నాయకులు ప్రచారం నిర్వహిస్తున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థుల తరఫున మంత్రులు కేటీఆర్‌తో సహా పలువురు మంత్రులు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రచారంలో పాల్గొంటున్నారు. మరోవైపు బీజేపీ అభ్యర్థుల తరఫున రాష్ట్ర నాయకత్వంతో పాటు బీజేపీ జాతీయ నాయకులు కూడా ప్రచారం నిర్వహించడానికి హైదరాబాద్ బాట పట్టారు. ఇక, ఎంఐఎం అభ్యర్థులు తరఫున ఆ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ప్రచారం నిర్వహిస్తున్నారు.
కాంగ్రెస్ నంచి ఇప్పటికే పలువురు నేతలు ఇతర పార్టీల్లో చేరడంతో ఆ పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మల్కాజ్గిరి ఎంపీ రేవంత్‌రెడ్డితో పాటు కొందరు ముఖ్య నేతలు మాత్రమే ఎన్నికల ప్రచారంలో కనిపిస్తున్నారు. టీడీపీ అభ్యర్థులు తరఫున ఆ పార్టీ తెలంగాణ విభాగానికి చెందిన నాయకులు ప్రచారం చేపట్టారు. ఇక, డిసెంటర్ 1న జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనుండగా, 4వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.