news18-telugu
Updated: November 22, 2020, 8:07 PM IST
తలసాని శ్రీనివాస్ యాదవ్, ముంతాజ్ అహ్మద్ ఖాన్
జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ.. టీఆర్ఎస్, ఎంఐఎం మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. బీజేపీతో పాటు మజ్లిస్ పార్టీ కూడా టీఆర్ఎస్ను టార్గెట్ చేసుకుంది. ఈ క్రమంలోనే చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము తలచుకుంటే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రెండు నెలల్లోనే కూల్చేస్తామని హెచ్చరించారు. ఆయన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు భగ్గుమన్నారు. ఎంఐఎం నేతలు ఒళ్లు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడాలని వార్నింగ్ ఇచ్చారు. మీరెంత? మీ పార్టీ ఎంత? మీరా.. మా ప్రభుత్వాన్ని పడగొట్టేది..అంటూ విరుచుకుపడ్డారు. టీఆర్ఎస్ను విమర్శించిన ముంతాజ్ అహ్మద్ ఖాన్‌పై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే షకీల్ నిప్పులు చెరిగారు.
కేటీఆర్ బచ్చానో.. బడానో.. ఆయన రోడ్‌షోకు వస్తున్న జనాన్ని చూసి తెలుసుకోండి. పాతబస్తీ అభివృద్ధి కోసం కేటీఆర్ చుట్టూ తిరిగినప్పుడు ఎంఐఎం నేతలకు తెలియలేదా? రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినంత మాత్రాన ఎంఐఎం ట్రాప్‌లో పడిపోం. అసెంబ్లీలో ఎవరి బలం ఏంటో ప్రజలకు తెలుసు. ఏడు సీట్లు ఉన్న ఎంఐఎం ప్రభుత్వాన్ని పడగొడతామనడం హాస్యాస్పదం.
- తలసాని శ్రీనివాస్ యాదవ్, మంత్రి
ముంతాజ్ ఖాన్ ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. హైదరాబాద్‌ని అభివృద్ధి చేసిన ఘనత కేటీఆర్‌కు దక్కుతుంది. ఎంఐఎం.. బీజేపీకి బీ-టీమ్. కాంగ్రెస్‌ను దెబ్బతీయడానికి బీజేపీతో మజ్లిస్ పార్టీ జతకట్టింది. తెలంగాణలో కూడా అదే ప్లాన్‌లో ఉన్నారు. మీ తాత, ముత్తాతలు వచ్చినా టీఆర్ఎస్ను ఏమీ చేయలేరు.
- షకీల్, టీఆర్ఎస్ ఎమ్మెల్యే
కాగా, ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం మీడియాతో మాట్లాడిన చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్.. కేటీఆర్‌పై విమర్శలు చేశారు. కేటీఆర్ నిన్నమొన్న వచ్చి చిలుక అంటూ సెటైర్లు వేశారు. మజ్లిస్ పార్టీ ఎంతో మందిని చూసిందని.. ఆయన మొన్నే రాజకీయాల్లోకి వచ్చాడని అన్నారు. రాజకీయం మా ఇంటి గుమాస్తాతో సమానమని ముంతాజ్ అహ్మద్ ఖాన్ చెప్పారు. అంతేకాదు తాము తలచుకుంటే కేసీఆర్ ప్రభుత్వాన్ని రెండు నెలల్లోనే పడగొడతామని హెచ్చరించారు. ఒకరిని గద్దెపై కూర్చోబెట్టడం తెలుసు.. గద్దె దింపడమూ తెలుసని స్పష్టం చేశారు.
ఇటీవల మీడియాతో మాట్లాడిన మంత్రి కేటీఆర్.. ఎంఐఎంతో పొత్తు ప్రసక్తే లేదని, ఒంటరిగానే 150 సీట్లలో పోటీచేస్తున్నామని చెప్పిన విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో 5చోట్ల ఎంఐఎంను ఓడించామని, ఈసారి 10 చోట్లకుపైగా ఎంఐఎంను ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు. మేయర్ పదవిని ఎంఐఎంకు ఇవ్వడానికి మాకేమైనా పిచ్చా అని అన్నారు. బల్దియా మీద మరోసారి గులాబీ జెండా ఎగురవేస్తామని స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్.ఎంఐఎం, టీఆర్ఎస్ పార్టీలు చాలా కాలంగా మిత్రపక్షంగా ఉంటూ వస్తున్నాయి. ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలను అసెంబ్లీ వేదికగా మజ్లిస్ ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. సీఎం కేసీఆర్‌పై పలు సందర్భాల్లో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ప్రశంసలు కురిపించారు. ఎంఐఎం, టీఆర్ఎస్ ఒక్కటేనని.. టీఆర్ఎస్కు ఓటేస్తే ఎంఐఎంకు వేసినట్లేనని బీజేపీ చాలాసార్లు ప్రచారం చేసింది. కానీ ఇవాళ టీఆర్ఎస్పై మజ్లిస్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
Published by:
Shiva Kumar Addula
First published:
November 22, 2020, 8:04 PM IST