టీఆర్ఎస్ కీలక నేతతో బీజేపీ పెద్దల భేటీ.. కేసీఆర్‌కు మరో షాక్ తప్పదా?

Swamy Goud: గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే పలువురు టీఆర్ఎస్ నేతలు ఆ పార్టీలో చేరారు. టీఆర్ఎస్‌ నుంచి టికెట్ రాకపోవడంతో మైలార్‌దేవ్‌పల్లి కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి, వెంగళరావునగర్ కార్పొరేటర్ కిలారి మనోహర్ బీజేపీలో చేరారు. కాంగ్రెస్ నుంచి పలువురు నేతలు బీజేపీ గూటికి చేరారు.

news18-telugu
Updated: November 21, 2020, 7:19 PM IST
టీఆర్ఎస్ కీలక నేతతో బీజేపీ పెద్దల భేటీ.. కేసీఆర్‌కు మరో షాక్ తప్పదా?
స్వామి గౌడ్
  • Share this:
జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. దుబ్బాక విజయంతో ఊపుమీదున్న బీజేపీ.. ఈ ఎన్నికల్లో దూకుడు ప్రదర్శిస్తోంది. టీఆర్ఎస్, కాంగ్రెస్‌లోని అసంతృప్తులకు గాలం వేస్తూ.. పార్టీని బలోపేతం చేస్తోంది. ఈ క్రమంలో టీఆర్ఎస్‌లోని మరో కీలక నేతపై దృష్టిసారించారు బీజేపీ రాష్ట్ర పెద్దలు. శాసన మండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్‌ను పార్టీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. శనివారం సాయంత్రం తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా స్వామిగౌడ్‌ను పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది.

ఐతే బీజేపీలోకి వెళ్తున్నారన్న ప్రచారంపై స్వామిగౌడ్ స్పష్టత ఇవ్వలేదు. టీఆర్ఎస్‌లోనే ఉంటానని గానీ.. బీజేపీలోకి వెళ్తున్నానని గానీ చెప్పలేదు. ఇది స్నేహపూర్తక కలయిక అని.. మిత్రులతో కూడా మాట్లాడవద్దా.. అని మీడియాను ఎదురు ప్రశ్నించారు స్వామిగౌడ్. ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా తెలియజేస్తానని వెల్లడించారు. అటు లక్ష్మణ్ కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. ఇది స్నేహపూర్వక భేటీ మాత్రమేనని..రాజకీయాలు కూడా చర్చించామని చెప్పారు. ఒకవేళ స్వామిగౌడ్ బీజేపీలో చేరితే మీడియాకు చెబుతామని తెలిపారు లక్ష్మణ్. కాగా, కొంతకాలంగా టీఆర్ఎస్ పార్టీపట్ల స్వామిగౌడ్ అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే.

గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే పలువురు టీఆర్ఎస్ నేతలు ఆ పార్టీలో చేరారు. టీఆర్ఎస్‌ నుంచి టికెట్ రాకపోవడంతో మైలార్‌దేవ్‌పల్లి కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి, వెంగళరావునగర్ కార్పొరేటర్ కిలారి మనోహర్ బీజేపీలో చేరారు. కాంగ్రెస్ నుంచి పలువురు నేతలు బీజేపీ గూటికి చేరారు. మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డితో పాటు పలువురు నగర నాయకులు హస్తం పార్టీకి గుడ్‌బై చెప్పి.. కాషాయ కండువా కప్పుకున్నారు. కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ కూడా త్వరలోనే బీజేపీ తీర్థంపుచ్చుకోబోతున్నట్లు వెల్లడించారు.

కాగా, నవంబరు 17న జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్‌తో పాటు నోటిఫికేషన్ కూడా విడుదలైన విషయం తెలిసిందే. నవంబరు 18 నుంచి 20 వరకు నామినేషన్లు స్వీకరించారు. గ్రేటర్ పరిధిలోని 150 డివిజన్లకు గాను 2600 నామినేషన్లు దాఖలయ్యాయి. 21న నామినేషన్లు పరిశీలించారు. నామినేషన్ల ఉపసంహరణకు నవంబరు 22 వరకు గడువు ఉంటుంది. డిసెంబరు 1న పోలింగ్ జరుగుతుంది. 4న ఫలితాలను వెల్లిస్తారు. ఇక అవసరమైన ప్రాంతాల్లో డిసెంబరు 3న రిపోలింగ్ నిర్వహిస్తారు. కరోనా నేపథ్యంలో బ్యాలెట్ పద్దతిలోనే ఎన్నికలను నిర్వహించనున్నారు.
Published by: Shiva Kumar Addula
First published: November 21, 2020, 7:16 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading