news18-telugu
Updated: November 27, 2020, 3:16 PM IST
రాజాసింగ్ (ఫైల్ ఫోటో)
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఎన్నికల ప్రచారంలో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజాసింగ్ శుక్రవారం ఉదయం కేపీహెచ్బీ కాలనీ నుంచి రోడ్ షో ప్రారంభించారు. బాలాజీ నగర్ డివిజన్లో ఆయన రోడ్ షో జరుగుతున్న సమయంలో.. అదే దారిలో టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా వచ్చారు. దీంతో ఇరు పార్టీల నాయకులు పోటాపోటీగా నినాదాలు చేశారు. బీజేపీ నాయకులు వెనక్కి వెళ్లాలంటూ టీఆర్ఎస్ శ్రేణులు నినాదాలు చేశారు. అయితే తామేందుకు వెళ్లాలంటూ.. బీజేపీ శ్రేణులు పోటాపోటీగా నినాదాలు చేయడం ప్రారంభించారు. దీంతో ఆ ప్రాంతం ఇరువర్గాల నేతల నినాదాలతో మారుమోగింది. దీంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను శాంతింపజేశారు. ఈ ఘటనపై బీజేపీ నాయకులు స్పందిస్తూ.. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నేతలను వెనక్కి వెళ్లాలని టీఆర్ఎస్ శ్రేణులు నినాదాలు చేయడం సరికాదని అన్నారు.
ఇక, బాలాజీ నగర్ డివిజన్లో ప్రచారంలో భాగంగా రాజాసింగ్ మాట్లాడుతూ.. గ్రేటర్ పీఠం దక్కించుకునేందుకు బీజేపీకి అవకాశం ఇవ్వాలని కోరారు. తాము అధికారం చేపడితే అభివృద్ది చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు. పీవీ నరసింహారావు, ఎన్టీఆర్ ఘాట్లపై ఎంఐఎం నేత అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై చర్యలు ఎందుకు తీసుకోరని ప్రశ్నించారు. ఎంఐఎం మతం పేరుతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తుందని మండిపడ్డారు.
గ్రేటర్ పోరులో బీజేపీ నేతల జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర నాయకులతో పాటుగా ఆ పార్టీ జాతీయ నాయకులు హైదరాబాద్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక, గ్రేటర్ ఎన్నికల్లో ముఖ్యంగా బీజేపీ, టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. విమర్శలు, ప్రతి విమర్శలతో గ్రేటర్ రాజకీయ వేడెక్కింది. పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో అన్ని పార్టీలు తమ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేస్తున్నారు. కాగా, డిసెంబర్ 1న జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ జరగనుండగా, 4వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది.
Published by:
Sumanth Kanukula
First published:
November 27, 2020, 3:16 PM IST