Hyderabad GHMC Election Results: జీహెచ్ఎంసీ (GHMC) ఎన్నికలకు సంబంధించి తెలగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అర్ధరాత్రి ఎన్నికల సంఘం జారీచేసిన ఉత్తర్వులను నిలిపివేసింది. బ్యాలెట్ పేపర్‌పై స్వస్తిక్ గుర్తు ఉన్న ఓట్లను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. స్వస్తిక్ మినహా ఇతర ఎలాంటి ముద్రలు ఉన్నా.. చెల్లని ఓట్లుగా పరిగణించాలని ఆదేశాలు జారీచేసింది. పోలింగ్ సమయంలో ఓటర్లకు స్వస్తిక్ ముద్రకు బదులు పొరపాటున పోలింగ్ కేంద్రం సంఖ్య తెలిపే ముద్రల్ని ఇచ్చామని.. ఎన్నికల సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో పలువురు ఉద్యోగులు ఈసీ దృష్టికి తీసుకువచ్చారు. ఐతే అలాంటి ఓట్లనూ పరిగణలోకి తీసుకోవాలని ఎన్నికల అధికారులు అర్ధరాత్రి ఆదేశిలిచ్చారు. ముద్ర మారినప్పటికీ ఓటర్ల ఎంపిక మారదని పేర్కొన్నారు.
అర్ధరాత్రి జారీచేసిన ఆ ఉత్తర్వులపై బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. స్వస్తిక్ మినహా ఏ ఇతర ముద్రలు కలిగి ఉన్న ఓట్లను పరిగణలోకి తీసుకోకూడదని విజ్ఞప్తి చేసింది. లంచ్ మోషన్ పిటిషన్‌పై విచారించిన కోర్టు.. ఎన్నికల కమిషనర్ పార్థసారధి జారీచేసిన ఉత్తర్వులకు బ్రేకులు వేసింది. ఏయే పోలింగ్ స్టేషన్లలో ఇలా జరిగిందో.. పూర్తి వివరాలు అందజేయాలని స్పష్టంచేసింది. ఐతే స్వస్తిక్ కాకుండా ఇతర ముద్రలు, టిక్ మార్క్ ఉన్న ఓట్లను ప్రత్యేకంగా లెక్కించాలని స్పష్టం చేసింది హైకోర్టు. గెలుపు ఓటములు డిసైడ్ చేసే ఓట్లుంటే మాత్రం.. ఆయా స్థానాల్లో ప్రత్యేక ఆదేశాలు ఇస్తామని తెలిపింది. ఆ లోపు ఎన్నికల అధికారులు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీచేసింది హైకోర్టు. ప్రస్తుతం ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న 150 డివిజన్లలో కౌంటింగ్ కొనసాగుతోంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. అన్ని డివిజన్లలో కలిపి 1926 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఇందులో బీజేపీ లీడింగ్‌లో ప్రదర్శిస్తోంది. ఎవరూ ఊహించని విధంగా కమలానికి ఓట్లు పోలయ్యాయి. ఉదయం 10.25 నిమిషాల సమయానికి.. బీజేపీ 76, టీఆర్ఎస్ 33, ఎంఐఎం 16 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానంలో మాత్రమే ఆధిక్యంలో ఉంది.
కాగా, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 46.59 శాతం పోలింగ్ నమోదయిన విషయం తెలిసిందే. 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 45.29 శాతం ఓట్లు పోలయ్యాయి. గతం కంటే ఈసారి కాస్త ఎక్కువ పోలింగ్ నమోదయింది. గత ఎన్నికలతో పోల్చితే ఈసారి 1.31 శాతం అధికంగా పోలింగ్ నమోదయింది. మొత్తం 150 డివిజన్లలో కంచన్‌బాగ్‌లో అత్యధిక పోలింగ్ నమోదయింది. అక్కడ 70.39శాతం పోలింగ్ నమోదయినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఇక అత్యల్పంగా యూసఫ్‌గూడలో 32.99 శాతం పోలింగ్ నమోదయింది. ప్రస్తుతం 150 డివిజన్లలో ఓట్లు లెక్కింపు కొనసాగుతోంది.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.