news18-telugu
Updated: November 29, 2020, 12:02 PM IST
ప్రతీకాత్మక చిత్రం
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం గతంలో ఎన్నడు లేని విధంగా సాగుతుంది. ప్రచారం సమయం తక్కువగానే ఉన్నప్పటికీ ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన ముఖ్య నేతలు ఆరోపణలు, ప్రత్యారోపణలతో మాటల తుటాలు పేలుస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ, ఎంఐఎం, టీఆర్ఎస్ నేతలు మధ్య విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. దుబ్బాక ఉప ఎన్నిక విజయంతో జోష్‌లో ఉన్న బీజేపీ ఎలాగైనా ఈసారి గ్రేటర్ పీఠాన్ని దక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. మరోవైపు మేయర్ పీఠం చేజారిపోకుండా చూసుకోవాలని టీఆర్ఎస్ భావిస్తోంది. పాతబస్తీలో ఎప్పటిలాగే తమ పట్టును నిలుపుకోవాలని ఎంఐఎం శ్రమిస్తోంది. ఈ క్రమంలోనే మూడు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అయితే గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో విదేశాలకు చెందిన అగ్రనేతల పేర్లు ప్రస్తావనకు రావడం చర్చనీయాశంగా మారుతోంది.
ప్రచారంలో భాగంగా ప్రత్యర్థులపై విమర్శలు చేసే సందర్భంలో పలువురు నేతలు భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటుగా విదేశీ నాయకుల పేర్లను ప్రస్తావిస్తున్నారు. ఇలా ప్రస్తావించిన పేర్లలో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పేర్లు ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం ఎన్నికల ప్రచారంలో భాగంగా పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. గ్రేటర్లో బీజేపీ తరఫున ప్రచారం చేయడం కోసం ఆ పార్టీకి చెందిన ఢిల్లీ స్థాయి నాయకులు వస్తున్నారని, ఇంకా అంతర్జాతీయ నాయకులు కూడా వస్తరేమోనని ఆయన ఎద్దేవా చేశారు. బీజేపీకి డోనాల్డ్ ట్రంప్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.. కాబట్టి ఆయనను కూడా గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి పిలుస్తారేమోనని కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
మరోవైపు భారత్ బయోటెక్ సందర్శనకు రావడాన్ని టీఆర్ఎస్ నేతలు రాజకీయం చేయవద్దని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కోరారు. టీఆర్ఎస్కు తామే ఎక్కువని.. ప్రధాని మోదీ అవసరం లేదన్నారు. టీఆర్ఎస్ నేతలు అవసరమనుకుంటే చైనా, పాక్ ప్రధానుల్ని పిలుచుకోవచ్చన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని తరిమికొడతామని మండిపడ్డారు.
Hyderabad Elections: GHMC ఎన్నికలపై న్యూస్18 పేరుతో ఫేక్ సర్వే... నమ్మకండి
Vijayashanti: కరోనా కంటే కేసీఆర్ కుటుంబం ప్రమాదకరమైనది.. కేసీఆర్‌పై విజయశాంతి ఫైర్
తాజాగా ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ.. బీజేపీపై విమర్శలు చేశారు. ఇవి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల మాదిరిగా లేవని.. చూస్తుంటే ప్రధానిని ఎన్నుకోవడానికి జరుగుతున్న ఎన్నికల్లాగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. బీజేపీకి ప్రచారం చేయాల్సిన వారిలో ఒక ట్రంప్ మాత్రమే మిగిలిపోయారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఇక, నేటితో జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం ముగియనున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 1వ తేదీన పోలింగ్ జరగనుండగా, 4వ తేదీన ఓట్ల లెక్కింపు చేపడతారు.
Published by:
Sumanth Kanukula
First published:
November 29, 2020, 11:58 AM IST