news18-telugu
Updated: December 1, 2020, 7:25 PM IST
ఓటర్లు లేక జీహెచ్ఎంసీ పోలింగ్ కేంద్రంలో నిద్రపోతున్న సిబ్బంది
హైదరాబాద్.. చాలా ప్రశాంతమైన నగరం. ఎంతో మంది విద్యావంతులు ఉన్న మహానగరం. ఐటీ హబ్‌గా ప్రఖ్యాతిగాంచిన విశ్వనగరం. ఇవన్నీ వింటుంటే మన హైదరాబాద్ చాలా గ్రేట్ అని అనిపిస్తుంది. కానీ ఎన్నికల విషయానికి వచ్చే సరికి.. లేజీ సిటీగా పేరు సంపాదించింది. ఓటు వేసేందుకు నగరవాసులు ముందుకు రావడం లేదు. ఇవాళ జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అత్యల్ప పోలింగ్ నమోదయింది. 40శాతం కూడా దాటలేదు. ఉదయం నుంచీ సాయంత్రం వరకూ.. ఎక్కడా క్యూలైన్లు కనిపించలేదు. పోలింగ్ కేంద్రాలన్నీ నిర్మానుష్యంగా కనిపించాయి. ప్రజలు దయచేసి ఇళ్ల నుంచి వచ్చి ఓటేయాలని.. ప్రజా ప్రతినిధులు, అధికారులు, మీడియా విజ్ఞప్తి చేసినప్పటికీ.. ఎవరూ ముందుకు రాలేదు. ఓటు వేసేందుకు అనాసక్తి చూపించారు.
ఐతే కరోనా భయం వల్లే ఓటు వేసేందుకు రాలేదని చాలా మంది భావిస్తున్నారు. కానీ ఇందులో నిజమెంత? వరద సాయం కోసం మీ-సేవలకు పోటెత్తిన జనానికి కరోనా భయం లేదు. పండగవేళ గంపులు గుంపులుగా పూజలు చేసినప్పుడు కరోనాను పట్టించుకోలేదు. ఓటుకు నోటు పంచినప్పుడు క్యూలైన్లో కరోనా మాటే వినిపించలేదు. వైన్‌షాప్‌ల వద్ద జనాల్లో కరోనా ఊసే లేదు. మరి ఓటేయడానికి మాత్రం కరోనా కారణమంటూ.. చాలా మంది కాకమ్మ కబుర్లు చెబుతున్నారు. హైదరాబాద్ మహానగరంలో నమోదైన పోలింగ్ సరళిని చూసి యావత్ దేశం కూడా అవాక్కయిని పరిస్థితి. ఎందుకంటే.. ఇవాళ జమ్మూకాశ్మీర్‌లోనూ ఎన్నికలు జరిగాయి. జిల్లాభివృద్ధి మండలి (డీడీసీ) ఎన్నికల రెండో విడత పోలింగ్ జరిగింది. అక్కడి కంటే మన వద్ద తక్కువ పోలింగ్ నమోదయింది. కల్లోల కాశ్మీర్ కంటే ప్రశాంతమైన హైదరాబాద్‌లో పోలింగ్ దారుణంగా పడిపోయింది.
ఇప్పుడే కాదు.. గతంలోనూ ఇలానే జరిగింది. ఏ ఎన్నికలు జరిగినా హైదరాబాద్ వాసులు మాత్రం ఓటేసేందుకు రావడం లేదు. సెలవును ఎంజాయ్ చేస్తున్నారు తప్ప.. ఓటువేయాలన్న స్పృహ లేకుండాపోయింది. హైదరాబాద్‌లో గతంలో నమోదైన పోలింగ్ వివరాలు ఇవే..
2009 జీహెచ్ఎంసీ ఎన్నికలో 42.04 శాతం
2009 సార్వత్రిక ఎన్నికల్లో 58 శాతం
2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 45.29 శాతం
2018 అసెంబ్లీ ఎన్నికల్లో 50.86 శాతం2019 లోక్‌సభ ఎన్నికల్లో 39.46 శాతం
Published by:
Shiva Kumar Addula
First published:
December 1, 2020, 6:41 PM IST