news18-telugu
Updated: November 20, 2020, 3:23 PM IST
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్(ఫైల్ పొటో)
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ, జనసేన పొత్తుపై ఇంకా క్లారిటీ రాలేదు. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం బీజేపీ ముఖ్యనేతలు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, లక్ష్మణ్ కలిసి నాదెండ్ల మనోహర్ నివాసంలో పవన్ కళ్యాణ్‌తో సమావేశమయ్యారు. ఈ భేటీ తరువాత రెండు పార్టీలకు సంబంధించిన పొత్తు తరువాత ఏదైనా ప్రకటన ఉంటుందా అనే అంశం ఆసక్తికరంగా మారింది. అయితే ఇప్పటికే గ్రేటర్ పరిధిలోని 129 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన 21 స్థానాల్లోనూ తమ అభ్యర్థులు పోటీ చేస్తారని ఆ పార్టీ చెబుతోంది. అయితే జనసేన మాత్రం మిగిలిన స్థానాలకు తమకు ఇవ్వాలని బీజేపీని కోరుతున్నట్టు సమాచారం.
మరోవైపు జీహెచ్ఎంసీ ఎన్నికలు తమకు చాలా కీలకమని.. దుబ్బాక ఎన్నికల్లో బీజేపీ గెలుపు తరువాత జరుగుతున్న ఈ ఎన్నికల్లో తమకు ఎక్కువ సీట్లు వస్తే తెలంగాణలో పార్టీ మరింత బలపడుతుందని బీజేపీ భావిస్తోంది. ఇదే విషయాన్ని జనసేన దృష్టికి తీసుకెళ్లిన బీజేపీ నేతలు.. ఆ పార్టీ పోటీ చేయకుండా తమకు మద్దతుగా ప్రచారం చేయాలని కోరుతున్నట్టు తెలుస్తోంది. బీజేపీ బలం మరింతగా పెరిగితే భవిష్యత్తులో జనసేనతో కలిసి మిగతా ఎన్నికల్లో ముందుకు సాగే విషయానికి ప్రాధాన్యత ఇస్తామని ఈ భేటీలో బీజేపీ నేతలు పవన్ కళ్యాణ్‌కు వివరించినట్టు తెలుస్తోంది.
మరోవైపు జనసేనతో పొత్తు విషయంలో బీజేపీ వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోంది. జీహెచ్ఎంసీలో ఈసారి తమ గెలుపు అవకాశాలు బాగా మెరుగయ్యాయనే భావనలో ఉన్న బీజేపీ.. పొత్తు కారణంగా ఇతర పార్టీలకు అవకాశం ఇవ్వొద్దనే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ కారణంగానే జనసేనతో పొత్తు ప్రతిపాదన ఏదీ లేదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నిన్న వ్యాఖ్యానించినట్టు సమాచారం. అయితే గ్రేటర్ జనసేన శ్రేణులు దూరం కాకుండా ఉండేందుకు పవన్ కళ్యాణ్‌తో చర్చలు జరపాలని ఆ పార్టీ నేతలు నిర్ణయించుకున్నట్టు సమాచారం. నామినేషన్ల స్వీకరణకు కూడా గడువు ముగిసిపోవడంతో.. ఇప్పుడు జనసేనతో బీజేపీ పొత్తు దాదాపుగా లేనట్టే అనే ఊహాగానాలు ఉన్నాయి. అయితే ఏపీలో బీజేపీతో పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ చరిష్మాను గ్రేటర్ ఎన్నికల్లోనూ తమ ప్రచారం కోసం ఉపయోగించుకోవాలని బీజేపీ యోచిస్తున్నట్టు సమాచారం. మొత్తానికి గ్రేటర్ పరిధిలో జనసేనకు బీజేపీ కొన్ని సీట్లు ఇస్తుందా లేకుంటే ప్రచారం మాత్రమే చేయాలని కోరుతుందా అన్నది మరికాసేపట్లో తేలిపోయే అవకాశం ఉంది.
Published by:
Kishore Akkaladevi
First published:
November 20, 2020, 3:17 PM IST