GHMC ఎన్నికలు TRS vs BJPగా మారబోతున్నాయా? మరి కాంగ్రెస్ పరిస్థితి ఏంటి?
ప్రతీకాత్మక చిత్రం
ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ లో గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. వలసలు, వరుస ఓటములు ఆ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. బీజేపీ నేతలు కాంగ్రెస్ లోని ముఖ్య నేతలకు గాలం వేస్తుండడం ఆ పార్టీకి నిద్ర పట్టకుండా చేస్తోంది.
దుబ్బాక ఎన్నికల అనంతరం మరో సారి తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. జీహెచ్ఎంసీ ఎన్నికలు సమీపిస్తున్నా కొద్దీ రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. తెలంగాణలోని ప్రధాన రాజకీయ పార్టీలు టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీకి ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. దుబ్బాకలో ఓటమి అనంతరం ఎలాగైనా ఈ ఎన్నికల్లో విజయం సాధించాలని అధికార టీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. తద్వారా తమ బలం తగ్గలేదని చాటేందుకు వ్యూహాలు రచిస్తోంది. దుబ్బాకలో గెలుపుతో జోష్ లో ఉన్న బీజేపీ గ్రేటర్ లోనూ ఘన విజయం సాధిస్తామని చెబుతోంది. ఇందు కోసం ఆ పార్టీ ప్రచారాన్ని ప్రారంభించింది. జీహెచ్ఎంసీలో అభివృద్ధి కోసం తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ నేతలు ఓటర్లను కోరుతున్నారు. ఇతర పార్టీల్లోని ముఖ్య నేతలు, అసంతృప్తులను తమ వైపు తిప్పుకునేందుకు బీజేపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామేనని చెబుతున్నారు. ఎన్నికలను బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ అన్న వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. దుబ్బాకలోనూ ఇలాంటి వాతవరణం ఏర్పడడం తమకు కలిసొచ్చిందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన వెంటనే అభ్యర్థులను ప్రకటించాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నట్లు సమాచారం.
అయితే ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ లో గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. వలసలు, వరుస ఓటములు ఆ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. బీజేపీ నేతలు కాంగ్రెస్ లోని ముఖ్య నేతలకు గాలం వేస్తుండడం ఆ పార్టీకి నిద్ర పట్టకుండా చేస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ కు చెందిన హైదరాబాద్ కీలక నేత, మాజీ మేయర్ బండా కార్తికా రెడ్డి కాషాయ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ముఖ్య అనుచరుడు, ఎల్బీ నగర్ కు చెందిన కాంగ్రెస్ కీలక నేత కొప్పుల నర్సింహారెడ్డి సైతం బీజేపీలో చేరిపోయారు.
ఈ పరిణామాలతో కాంగ్రెస్ పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. జీహెచ్ఎంసీలో మరో సారి ఘోర పరాజయం ఎదురైతే ఆ పార్టీ భవిష్యత్ ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉంది. దీంతో ఎలాగైనా గ్రేటర్ లో మంచి ఓట్లు సాధించాలని ఆ పార్టీ నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. హుజూర్ నగర్, దుబ్బాక ఉప ఎన్నికల మాదిరి ఫలితాలు పునరావృతం అయితే తమకు మనుగడకే ప్రమాదమని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డికి జీహెచ్ఎంసీ ఎన్నికల బాధ్యతలను అప్పగించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే గ్రేటర్ ఎన్నికలకు ముందే పీసీసీ చీఫ్ ను మారుస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.