news18-telugu
Updated: November 18, 2020, 8:26 AM IST
ప్రతీకాత్మక చిత్రం
జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. పలువురు నేతలు కాంగ్రెస్‌ను వీడి ఇతర పార్టీల్లో చేరడంతో.. కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం తలలు పట్టుకుంటుంది. ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. , తాజాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో ఇద్దరు నేతలు కూడా పార్టీని వీడారు. శేరిలింగంపల్లి మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్, నియోజవర్గ ఇంచార్జ్ రవికుమార్ యాదవ్‌లు కాంగ్రెస్ పార్టీకి, పదవులకు రాజీనామా చేశారు. వీరిద్దరు కూడా బీజేపీలో చేరనున్నారు. ఇక, గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి శేరిలింగపల్లి అసెంబ్లీ టికెట్‌ను బిక్షపతి యాదవ్ ఆశించారు. అయితే కాంగ్రెస్-టీడీపీ పొత్తులో భాగంగా ఆ స్థానాన్ని టీడీపీ అభ్యర్థికి కేటాయించారు. తనకు టికెట్ దక్కకపోవడంతో భిక్షపతి అసంతృప్తితో ఉన్నారు. ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ పార్టీకి షాక్ ఇస్తూ.. బీజేపీలో చేరనున్నారు.
ఇప్పటికే కాంగ్రెస్ ముఖ్యనేత రేవంత్‌రెడ్డి అనుచరుడు కొప్పుల నర్సింహారెడ్డి పార్టీని వీడి బీజేపీలో చేరారు. ఆయనకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు. అదే బాటలో జీహెచ్ఎంసీ మాజీ మేయర్, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు బండ కార్తీకరెడ్డి ప్రయాణించారు. కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పిన ఆమె నేడు బీజేపీలో చేరనున్నారు.
వీరు మాత్రమే కాకుండా మరికొందరు కాంగ్రెస్ నేతలు పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ పరిస్థితులు గ్రేటర్ కాంగ్రెస్‌తో పాటు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వానికి సవాలుగా మారాయి.మరోవైపు దుబ్బాక ఉప ఎన్నిక విజయంతో జోష్‌లో ఉన్న బీజేపీ.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోంది. ఇందుకోసం ఇతర పార్టీలకు చెందిన నేతలను పార్టీలో చేర్చుకుంటుంది. అయితే బీజేపీ ఆకర్ష్ ప్రభావం.. కాంగ్రెస్ పార్టీపై అధికంగా ఉంది.
Published by:
Sumanth Kanukula
First published:
November 18, 2020, 8:26 AM IST