news18-telugu
Updated: November 16, 2020, 9:16 PM IST
ప్రతీకాత్మక చిత్రం
దుబ్బాక ఎన్నికల్లో దారుణ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న కాంగ్రెస్ పార్టీకి.. జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ మరో బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే పలువురు నేతలు హస్తం పార్టీని వీడగా.. తాజాగా హైదరాబాద్ కీలక నేత, మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనున్నారు. కాంగ్రెస్‌ను వీడి గురువారం ఆమె బీజేపీ గూటికి చేరబోతున్నారు. సోమవారం బీజేపీ నేతలు, పార్టీ కార్యకర్తలతో చర్చల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు బండ కార్తీక.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఆమె టికెట్ ఆశించారు. కానీ హైకమాండ్‌కు పట్టించుకోలేదు. అప్పటి నుంచీ పార్టీ పట్ల అసంతృప్తితో ఉన్నారు కార్తీక. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఐతే దుబ్బాకలో బీజేపీ గెలవడం.. అదే సమయంలో జీహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో.. కాషాయ గూటికి చేరుతున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేయాలని భావిస్తున్న బీజేపీ నేతలు.. అందులో భాగంగా ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపింది. కీలక నేతలను పార్టీలోకి తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే బండ కార్తీకకు సికిందరాబాద్ టికెట్ ఇస్తామని బీజేపీ భరోసానిచ్చింది. కాగా, 2009 నుంచి 2012 వరకు బండ కార్తీక హైదరాబాద్ మేయర్ పదవిలో ఉన్న విషయం తెలిసిందే.

బండ కార్తీక
ఇప్పటికే దుబ్బాకలో దారుణంగా ఓడిపోయి..నిరాశలో ఉంది కాంగ్రెస్. టీఆర్ఎస్, బీజేపీలకు కనీసం పోటీ కూడా ఇవ్వలేక చతికిలపడింది. ఆ ఎన్నికల్లో మూడో స్థానానికి పరిమితమవడంతో హస్తం శ్రేణులు డీలా పడ్డాయి. కనీసం జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనైనా సత్తా చాటి.. పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్న తరుణంలో.. బండ కార్తీక రెడ్డి నిర్ణయం షాక్‌కు గురి చేసింది. మరోవైపు బీజేపీ మాత్రం దుబ్బాక గెలుపు ఇచ్చిన ఉత్సాహంతో.. గ్రేటర్‌లోనూ దూసుకెళ్తున్నారు. ఇప్పటికే ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీని నియమించి వ్యూహాలకు పదును పెడుతోంది. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లోని అసంతృప్తులకు గాలం వేస్తూ.. పార్టీని బలోపేతం చేస్తోంది.
Published by:
Shiva Kumar Addula
First published:
November 16, 2020, 8:52 PM IST