news18-telugu
Updated: November 27, 2020, 2:42 PM IST
ప్రతీకాత్మక చిత్రం
గ్రేటర్ ఎన్నికల ప్రచారం మరింత హీటెక్కింది. నేతల ప్రసంగాలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు.. హైదరాబాద్లో సెగలు రేపుతున్నాయి. కొన్ని రోజులుగా పాతబస్తీ ప్రచారంలో మాటల తూటాలు పేల్చుతున్న ఎంఐఎం...అదే దూకుడును కొనసాగిస్తోంది. ఎన్నికల సంఘం హెచ్చరిస్తున్నా పట్టించుకోకుండా ఆ పార్టీ ఎమ్మెల్యేలు నోటికి పనిచెబుతున్నారు. తాజాగా ఎంఐఎం పార్టీకి చెందిన బహదూర్ పూరా ఎమ్మెల్యే మౌజమ్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాతబస్తీలో ఎవరూ కరెంట్, నల్లా బిల్లులు కూట్టకూడదని ప్రజకు సూచించారు. తమను బిల్లు కట్టాలని అడిగే ధైర్యం ఎవరికీ లేదని ఆయన స్పష్టం చేశారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా బహదూర్పూర్లో మాట్లాడిన మౌజమ్ ఖాన్.. తమను ఎవరూ బిల్లు కట్టాలని అడగరని, అది ఎంఐఎం గొప్పతనమని అన్నారు. బిల్లులు కట్టే అవసరం లేకుండా ఉండాలంటే.. ఎంఐఎం అభ్యర్థులకే ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. నిన్న మొన్నటి వరకు బీజేపీపైనే విరుచుకుపడిన మజ్లిస్ పార్టీ.. ఇప్పుడు టీఆర్ఎస్ను కూడా టార్గెట్ చేస్తోంది. తాము తలచుకుంటే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రెండు నెలల్లో పడగొడతామని చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ హెచ్చరించిన విషయం తెలిసిందే. తాము ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నామని.. కేటీఆర్ ఇప్పుడిప్పుడే చిలుక పలుకులు పలికే ప్రయత్నం చేస్తున్నామని విమర్శించారు.
ఇక అక్బరుద్దీన్ ఓవైసీ అయితే.. ఎన్టీఆర్, పీవీ ఘాట్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అక్రమ కట్టడాల పేరుతో పేద ప్రజలను టీఆర్ఎస్ వేధిస్తోందని.. దుమ్ముంటే హుస్సేన్ సార్ కట్టపై కట్టిన ఎన్టీఆర్, పీవీ ఘాట్లను కూల్చాలని ఆయన డిమాండ్ చేశారు. బీజేపీపైనా ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. బీజేపీ అలలు ఎంత ఎగిసిపడినా.. అవి పాతబస్తీని తాకలేవని అన్నారు. మూసీ నది దాటి పాతబస్తీలోకి ఏ పార్టీ రాలేదని స్పష్టం చేశారు. చివరకు ప్రధాని మోదీ వచ్చి పోటీ చేసినా.. పాతబస్తీలో గెలిచే అవకాశం లేదని అసదుద్దీన్ ఓవైసీ కూడా మాటల తూటాలను పేల్చారు.
కాగా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 150 డివిజన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. నవంబరు 17న జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్తో పాటు నోటిఫికేషన్ కూడా విడుదలైన విషయం తెలిసిందే. డిసెంబరు 1న పోలింగ్ జరుగుతుంది. 4న ఫలితాలను వెల్లిస్తారు. ఇక అవసరమైన ప్రాంతాల్లో డిసెంబరు 3న రిపోలింగ్ నిర్వహిస్తారు. కరోనా నేపథ్యంలో బ్యాలెట్ పద్దతిలోనే ఎన్నికలను నిర్వహించనున్నారు.
Published by:
Shiva Kumar Addula
First published:
November 27, 2020, 2:35 PM IST