GHMC ELECTIONS COUNTING UPDATES BJP BAGS TWO SEATS WON IN CHAITANYAPURI AND CHAMPAPET DIVISIONS BA
GHMC Election Results 2020: జీహెచ్ఎంసీలో బోణీ కొట్టిన బీజేపీ.. రెండు చోట్ల గెలుపు
ప్రతీకాత్మక చిత్రం
Hyderabad Municipal Elections 2020: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బోణీ కొట్టింది. ఆ పార్టీ అభ్యర్థులు రెండు చోట్ల గెలుపొందారు. చైతన్యపురి, చంపాపేట డివిజన్లలో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో (Greater Hyderabad Municipal Elections 2020) భారతీయ జనతా పార్టీ బోణీ కొట్టింది. ఆ పార్టీ అభ్యర్థులు రెండు చోట్ల గెలుపొందారు. చైతన్యపురి, చంపాపేట డివిజన్లలో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. చైతన్య పురిలో మొత్తం 9 మంది పోటీ చేశారు. బీజేపీ, టీడీపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్, డీబీపీ, జనసేనతో పాటు మరో ముగ్గురు ఇండిపెండెంట్లు బరిలో నిలిచారు. బీజేపీ అభ్యర్థి రంగా వెంకట నరసింహారావును ప్రజలు గెలిపించారు. చైతన్యపురి డివిజన్ జనరల్ సీటు. ఇక్కడ 43110 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషులు 22759, మహిళలు 20348, ట్రాన్స్ జెండర్ 60 మంది ఉన్నారు. 2016లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ గెలిచింది. 2016లో టీఆర్ఎస్ అభ్యర్థి విఠల్ రెడ్డి పోటీ చేసి గెలిచారు. మరోసారి ఆయన పోటీ చేసినా, ఇక్కడ బీజేపీ విజయం సాధించింది. ఇక చంపాపేట డివిజన్లో కూడా బీజేపీ అభ్యర్థి మధుసూదన్ రెడ్డి గెలుపొందారు. ఇక్కడ కూడా టీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్, ప్రస్తుత అభ్యర్థి సామ రమణారెడ్డి మీద విజయం సాధించారు. చంపాపేట కూడా జనరల్ సీటు. ఇక్కడ 48,978 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 25,957 మంది పురుషులు, 23,011 మంది మహిళలు, 62 మంది ట్రాన్స్ జెండర్ ఉన్నారు. 2016లో ఇక్కడ టీఆర్ఎస్ గెలుపొందింది.
రెండు చోట్ల గెలుపొందిన బీజేపీ మరికొన్ని డివిజన్లలో ముందుంజలో ఉంది.
హబ్సిగూడ 500 ఓట్ల ఆధిక్యత
రామంతాపూర్ 1000 ఓట్ల ఆధిక్యత
లింగోజిగూడ 1692 ఓట్ల ఆధిక్యత
బేగంబజార్ 3600 ఓట్ల ఆధిక్యత
మల్కాజ్గిరి 1300 ఓట్ల ఆధిక్యత
మూసాపేట్ 463 ఓట్ల ఆధిక్యత
ముసారాంబాగ్ 2,200 ఓట్ల ఆధిక్యత
మోండా మార్కెట్ 3 వేల ఓట్ల ఆధిక్యత
సైదాబాద్‌లో 200 ఓట్ల ఆధిక్యత
పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో బీజేపీ ఆధిక్యం చూపింది. మొత్తం 1926 పోస్టల్ బ్యాలెట్లు పోల్ అయ్యాయి. వాటిలో 40 శాతానికి పైగా చెల్లలేదు. ఆ మిగిలిన వాటిలో కూడా బీజేపీ అభ్యర్థులకే ఎక్కవ ఓట్లు పడ్డాయి. అయతే, బ్యాలెట్ బాక్సులు ఓపెన్ చేసిన తర్వాత మొదటి రౌండ్లో బీజేపీ వెనుకబడింది. టీఆర్ఎస్ పార్టీ ఆధిక్యం చూపింది. ఎంఐఎం మొదటి విజయాన్ని నమోదు చేసింది. మాజీ మేయర్ మాజిద్ హుస్సేన్ మెహిదీపట్నంలో గెలుపొందారు.
ఇక గోషామహల్ నియోజకవర్గంలోని జాంబాగ్ డివిజన్ ఓట్ల లెక్కింపుపై బీజేపీ అభ్యంతరం తెలిపింది. బూత్ నెంబర్ 8లో 471 ఓట్లు పోల్ అయినట్టు ఎన్నికల అధికారులు చెప్పారని, అయితే, అందులో కేవలం 257 మాత్రమే ఉన్నాయని, మిగిలిన ఓట్లు ఏమయ్యాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, ఇది ఎన్నికల ఓట్ల లెక్కింపులో జరిగిన పొరపాటు అని, తక్కువ ఓట్లు పోల్ అయినా, పొరపాటున ఎక్కువ ఓట్లు పోల్ అయినట్టు లెక్కించామని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. ఓట్లు ఎక్కడా గల్లంతు కాలేదని చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి రాజీనామా చేయాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు డిమాండ్ చేశారు. అధికారి పార్టీలతో కుమ్మక్కై ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచేందుకు ప్రయత్నించారని సంచలన ఆరోపణలు చేశారు. తుది పోలింగ్ శాతాన్ని ఆ రోజే ఎందుు ప్రకటించలేదు? కొన్ని డివిజన్లలో 95శాతం పోలింగ్ ఎలా నమోయింది? పెన్నుతో టిక్ పెట్టినా ఓట్లను కౌంట్ చేయాలని ఇలా ఆదేశిస్తారు? అని ఎన్నికల అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విటర్ వేదికగా రాష్ట్ర ఎన్నికల సంఘంపై మండిపడ్డారు బండి సంజయ్. ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలని లేదంటే రాష్ట్ర ప్రభుత్వం బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.