• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • GHMC ELECTIONS CONGRESS LEADERS PROTEST AT QUTHBULLAPUR POLICE LATHICHARGE SK

GHMC Elections: కాంగ్రెస్ నేతలపై పోలీసుల లాఠీచార్జ్.. రేవంత్ రెడ్డి ఆగ్రహం

GHMC Elections: కాంగ్రెస్ నేతలపై పోలీసుల లాఠీచార్జ్.. రేవంత్ రెడ్డి ఆగ్రహం

పోలీసులపై రేవంత్ రెడ్డి ఆగ్రహం

జీహెచ్ఎంసీ కార్యాలయం ఎదుట ఆందోళన చేసినందుకు.. మాజీ ఎమ్మల్యే శ్రీశైలంగౌడ్‌ను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఐతే పోలీసుల తీరుపై ఎంపీ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. టీఆర్ఎస్ నేతలకు ఎన్నికల అధికారులు, పోలీసులు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Share this:
    గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) ఎన్నికల నేపథ్యంలో నగర రాజకీయాలు వేడెక్కాయి. నామినేషన్ల ప్రక్రియ ఇప్పటికే ముగియడంతో ప్రచార పర్వం ఊపందుకుంది. ఐతే శనివారం కుత్బుల్లాపూర్ డివిజన్‌లోని గాజులరామారంలో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ నేతలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. ఈ ఘటనలో పలు వాహనాలు కూడా ధ్వంసంమయ్యాయి. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం... గాజులరామారంలో కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ సోదరుడు కూన శ్రీనివాస్ గౌడ్ నామినేషన్ దాఖలు చేశారు. ఐతే శనివారం నామినేషన్లను పరిశీలించిన రిటర్నింగ్ అధికారులు.. శ్రీనివాస్ నామినేషన్‌ను తిరస్కరించారు.

    శ్రీనివాస్ గౌడ్ నామినేషన్ తిరస్కరణకు గురయిందన్న విషయం తెలిసి.. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు భారీగా జీహెచ్ఎంసీ కార్యాలయానికి చేరుకున్నారు. అన్యాయంగా ఆయన నామినేషన్‌ను తిరస్కరించారని ఆందోళనకు దిగారు. మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి, కూన శ్రీశైలం గౌడ్, ఇతర కాంగ్రెస్ కార్యకర్తలు ఆఫీసు ఎదుట బైఠాయించారు. అనంతరం జీహెచ్ఎంసీ కార్యాలయంలోకి దూసుకొచ్చేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరినా వినకపోవడంతో.. వారిపై లాఠీచార్జ్ చేశారు. ఈ క్రమంలో ఇరువర్గా మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.

    ఈ ఘటనలో ఎస్సై మన్మథకు గాయాలయ్యాయి. కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్న క్రమంలో ఓ మహిళలకు సైతం గాయాలయ్యాయి. డీసీఎం నుంచి కిందపడడంతో ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. జీహెచ్ఎంసీ కార్యాలయం ఎదుట ఆందోళన చేసినందుకు.. మాజీ ఎమ్మల్యే శ్రీశైలంగౌడ్‌ను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఐతే పోలీసుల తీరుపై ఎంపీ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. టీఆర్ఎస్ నేతలకు ఎన్నికల అధికారులు, పోలీసులు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ప్రజలు బుద్ధి చెబుతారని విమర్శిచారు.

    కాగా, నవంబరు 17న జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్‌తో పాటు నోటిఫికేషన్ కూడా విడుదలైన విషయం తెలిసిందే. డిసెంబరు 1న పోలింగ్ జరుగుతుంది. 4న ఫలితాలను వెల్లిస్తారు. నవంబరు 18 నుంచి 20 వరకు నామినేషన్లు స్వీకరించారు. 21న నామినేషన్లు పరిశీలించారు. నామినేషన్ల ఉపసంహరణకు నవంబరు 22 వరకు గడువు ఉంటుంది. ఇక అవసరమైన ప్రాంతాల్లో డిసెంబరు 3న రిపోలింగ్ నిర్వహిస్తారు. కరోనా నేపథ్యంలో బ్యాలెట్ పద్దతిలోనే ఎన్నికలను నిర్వహించనున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published: