GHMC Elections: హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్ బహిరంగ సభ.. కేంద్రంపై ఇక యుద్ధమే..

GHMC Elections: హైదరాబాద్‌లో జరగనున్న బహిరంగ సభకు బీఎస్ఎన్ఎల్, ఎల్‌ఐసీతో పాటు 20 సంఘాల నేతలు హాజరుకానున్నారు.

news18-telugu
Updated: November 21, 2020, 4:55 PM IST
GHMC Elections: హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్ బహిరంగ సభ.. కేంద్రంపై ఇక యుద్ధమే..
సీఎం కేసీఆర్
  • Share this:
జీహెచ్ఎంసీ ఎన్నికలు హైదరాబాద్‌లో సెగలు రేపుతున్నాయి. చలికాలంలోనూ నగర వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. దుబ్బాక గెలుపుతో సరికొత్త జోష్‌లో ఉన్న బీజేపీ.. గ్రేటర్ ఎన్నికలపై ప్రత్యేక దృష్టసారించింది. ఇక ఎప్పుడూ కాంగ్రెస్‌పై విమర్శించే సీఎం కేసీఆర్ ఇప్పుడు రూట్ మార్చి.. బీజేపీని టార్గెట్ చేసుకున్నారు. కేంద్రంలో అధికారంలో ఉండి.. తెలగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదని మండిపడుతున్నారు. బీజేపీ గెలిస్తే హైదరాబాద్ అల్లకల్లోలం అవుతుందని.. ప్రశాంతమైన హైదరాబాద్ కావాలంటే.. టీఆర్ఎస్‌నే గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు కేసీఆర్. బీజేపీ, టీఆర్ఎస్ మాటల తూటాలు.. వరద సాయంపై ప్రజల ఆగ్రహ జ్వాలల నేపథ్యంలో.. ఈసారి జీహెచ్ఎంసీ ఎన్నికలు మరింత రసవత్తరంగా మారాయి.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున మంత్రి కేటీఆర్ అన్నీ తానై పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. ప్రచారంలో ఆయనే స్పెషల్ అట్రాక్షన్‌గా ఉన్నారు. ఐతే ఎన్నికల ప్రచారం ఆఖరులో సీఎం కేసీఆర్ బహిరంగ సభకు హాజరుకాబోతున్నారు. ఎల్‌బీస్టేడియం వేదికగా నవంబరు 28న మధ్యాహ్నం 12 గంటలకు బహిరంగ సభకు హాజరై ప్రసంగించనున్నారు. ఈ సభకు బీఎస్ఎన్ఎల్, ఎల్‌ఐసీతో పాటు 20 సంఘాల నేతలు హాజరుకానున్నారు. మోదీ సర్కాన్.. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముకుంటోందని కొంత కాలంగా సీఎం కేసీఆర్ విమర్శలు కురిపిస్తున్న నేపథ్యంలో.. ఆ సభలో ఏం మాట్లాడతారన్న దానిపై అంతటా ఆసక్తి నెలకొంది.

జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఇటీవల టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సీఎం కేసీఆర్.. కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ ప్రజా, రైతు, కార్మిక వ్యతిరేక విధానాలపై దేశవ్యాప్త పోరాటానికి టీఆర్ఎస్ సన్నద్ధమవుతోందని.. ప్రజలను చైతన్యపరచేందుకు హైదరాబాద్‌ నుంచే యుద్ధం ప్రకటిస్తామని స్పష్టం చేశారు. భాజపా కాంగ్రెస్‌ దొందూ దొందేనని..ఈ రెండు మూస పార్టీల నుంచి దేశానికి విముక్తి కావాలని.. దేశం నూతన మార్గం పట్టాలని ఆయన అన్నారు.

దేశంలోని ఇతర ప్రతిపక్షాలన్నింటినీ ఒక్క తాటిపై నిలిపేందుకు టీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తోందని కేసీఆర్‌ వెల్లడించారు. పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కేరళ సీఎం విజయన్‌, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌, ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌, డీఎంకే నేత స్టాలిన్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, మహారాష్ట్ర, పంజాబ్‌, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రులు అఖిలేశ్‌ యాదవ్‌, శరద్‌పవార్‌, ప్రకాశ్‌సింగ్‌ బాదల్‌, కుమారస్వామితో పాటు సీపీఐ, సీపీఎం నాయకులతో మాట్లాడానని తెలిపారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీలు, ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి పనిచేయాలని నిర్ణయించామన్న ఆయన.. కలిసి వచ్చే నేతలతో కలిసి డిసెంబరు రెండో వారంలో హైదరాబాద్‌లో సమావేశం నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

కాగా, నవంబరు 17న జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్‌తో పాటు నోటిఫికేషన్ కూడా విడుదలైన విషయం తెలిసిందే. నవంబరు 18 నుంచి 20 వరకు నామినేషన్లు స్వీకరించారు. గ్రేటర్ పరిధిలోని 150 డివిజన్లకు గాను 2600 నామినేషన్లు దాఖలయ్యాయి. 21న నామినేషన్లు పరిశీలించారు. నామినేషన్ల ఉపసంహరణకు నవంబరు 22 వరకు గడువు ఉంటుంది. డిసెంబరు 1న పోలింగ్ జరుగుతుంది. 4న ఫలితాలను వెల్లిస్తారు. ఇక అవసరమైన ప్రాంతాల్లో డిసెంబరు 3న రిపోలింగ్ నిర్వహిస్తారు. కరోనా నేపథ్యంలో బ్యాలెట్ పద్దతిలోనే ఎన్నికలను నిర్వహించనున్నారు.
Published by: Shiva Kumar Addula
First published: November 21, 2020, 4:54 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading