news18-telugu
Updated: November 22, 2020, 4:09 PM IST
బీజేపీ కార్యాలయం (పాత ఫొటో)
జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీలో అంతర్గత విభేదాలు రచ్చకెక్కాయి. టికెట్ల కేటాయింపు పార్టీలో చిచ్చు పెట్టింది. ఆదివారం హైదరాబాద్‌లోని బీజేపీ హెడ్ ఆఫీసులో గన్‌ఫౌండ్రీకి చెందిన నేతలు కొట్టుకున్నారు. ఓంప్రకాశ్ వర్గీయులు, శైలేంద్ర యాదవ్ వర్గీయులు పరస్పరం తన్నుకున్నారు. చొక్కాలు చించుకొని... అసభ్య పదజాలంతో దూషించుకున్నారు. కుర్చీలను ధ్వంసం చేశారు. టీవీలు, కిటికీ అద్దాలను పగులగొట్టారు. ఇరువర్గాల ఘర్షణతో బీజేపీ ఆఫీస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు భారీగా మోహరించారు.
గన్‌ఫౌండ్రీ డివిజన్ నుంచి ఓం ప్రకాశ్, శైలేంద్ర యాదవ్ టికెట్ ఆశించారు. పార్టీ పెద్దలు మాత్రం ఓం ప్రకాశ్ భార్యకు టికెట్ కేటాయించారు. ఆదివారం బీ ఫామ్ తీసుకునేందుకు వారు పార్టీ ఆఫీసుకు వచ్చారు. ఐతే ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న తమకు టికెట్ ఇవ్వకుండా.. ఇటీవలే పార్టీలో చేరి వారికి టికెట్ ఇచ్చారని శైలేంద్ర యాదవ్ ఆరోపించారు. పార్టీ కోసం కష్టపడిని వారికి కాకుండా.. నిన్న మొన్న వచ్చి వారికి ఎలా ఇస్తారని మండిపడ్డారు. తాము రాజాసింగ్ వర్గం కాడంతో టికెట్ ఇవ్వలేదని పార్టీ పెద్దలపై శైలేంద్ర యాదవ్ విమర్శించారు. హైకమాండ్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఆఫీసులో ఫర్నిచర్‌ను శైలేంద్ వర్గీయులు ధ్వంసం చేశారు.
రాజాసింగ్ వర్గానికి కావాలనే టికెట్లు ఇవ్వలేదని.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌పై ఆరోపణలు చేశారు. వీరిద్దరు టికెట్లను అమ్ముకుంటూ.. కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా అయితే జీహెచ్ఎంసీలో బీజేపీ గెలుపు అసాధ్యమని ధ్వజమెత్తారు. ఐతే తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, లక్ష్మణ్, కిషన్ రెడ్డితో పాటు పలువురు ముఖ్య నేతలంతా కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ పర్యటనలో బిజీగా ఉన్నారు. వారు పార్టీ ఆఫీసులో లేని సమయంలో ఈ ఘటన జరిగింది. మరి దీనిపై వారు ఎలా స్పందిస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది.
గ్రేటర్ ఎన్నికల వేళ బీజేపీలోకి వలసలు పెరిగినందున.. టికెట్ల కేటాయింపు విషయంలో.. లొల్లి జరుగుతోంది. టికెట్ ఆశించి భంగపడ్డ నేతలంతా రాష్ట్ర అధిష్టానంపై మండిపడుతున్నారు. టీడీపీ నుంచి వచ్చిన వారికి టికెట్లు అమ్ముకుంటున్నారని.. ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడుతున్న వారికి అన్యాయం చేస్తున్నారని విరుచుకుపడుతున్నారు. మొన్న కూకట్ పల్లి కార్యాలయంలో.. నిన్న కుత్బుల్లాపూర్ కార్యాలయంలోనూ.. ఇలాంటి ఘటనలే చోటు చేసుకున్నాయి. పార్టీ కార్యకర్తలు ఫర్నిచర్ ధ్వంసం చేసి రచ్చ చేశారు. బీజేపీలో నెలకొన్న ఈ టికెట్ల రచ్చ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
Published by:
Shiva Kumar Addula
First published:
November 22, 2020, 3:23 PM IST