news18-telugu
Updated: November 19, 2020, 9:00 AM IST
బండి సంజయ్(ఫైల్ ఫోటో)
జీహెచ్ఎంసీ (గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్) ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. ఈసారి గ్రేటర్ ఎన్నికల్లో రూ.10వేల వరద సాయంపైనే రచ్చ జరుగుతోంది. వరద సాయం పంపిణీకి ఎన్నికల సంఘం బ్రేకులు వేయడంతో.. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ లేఖ రాయడం వల్లే వరద సాయం నిలిచిపోయిందని.. పేదల నోటికాడి కూడును బీజేపీ లాగేసిందని సీఎం కేసీఆర్ విరుచుకుడ్డారు. బండి సంజయ్ లేఖ రాసి.. వరద సాయం నిలిపివేశారని ధ్వజమెత్తారు. ఆయన పేరిట ఈసీకి రాసిన ఓ లేఖను మీడియాకు విడుదల చేశారు.
ఇప్పుడా లేఖపై రచ్చ రచ్చ జరుగుతోంది. తాను ఎలాంటి లేఖలను ఎన్నికల సంఘానికి రాయలేదని బండి సంజయ్ స్పష్టం చేశారు. పాతబస్తీ భాగ్యలక్ష్మీ ఆలయలో ప్రమాణం చేసి చెబుతానని..సీఎం కేసీఆర్ ప్రమాణం చేస్తారా? అని సవాల్ విసిరారు. వరద సాయం చేయలేక తెలంగాణ ప్రభుత్వమే చేతులెత్తేసి.. తమపై అభాండాలు వేస్తోందని విరుచుకుపడ్డారు బండి సంజయ్. తన సంతకాన్ని ఫోర్జరీ చేసి.. తప్పుడు లేఖను సృష్టించారని.. ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఫేక్ లెటర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన సంతకాన్ని ఫోర్జరీ చేసి, ఫేక్ లెటర్ సృష్టించి తనపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.
కాగా, హైదరాబాద్‌లో ఇప్పుడు అంతటా వరద సాయంపైనే చర్చ జరుగుతోంది. అక్టోబరు రెండో వారంలో కురిసిన భారీ వర్షాలకు నగరంలోని చాలా ప్రాంతాలు నీట మునిగాయి. ఇళ్లలోకి నీళ్లు చేరి ప్రజలు ఎంతో నష్టపోయారు. ఆ వరద బాధితులను ఆదుకుంటామన్న సీఎం కేసీఆర్.. ఇళ్లు కూలిపోయిన వారికి రూ.లక్ష, దెబ్బతిన్న వారికి రూ. 50 సాయం అందజేస్తామని వెల్లడించారు. అంతేకాదు వరద వల్ల ఇబ్బందులు పడిన ప్రతి కుటుంబానికి రూ.10వేల సాయం ప్రకటించారు. చెప్పినట్లుగా గానే కొన్ని చోట్ల నేరుగా ఇళ్లకు వెళ్లి బాధితులకు డబ్బు పంపిణీ చేశారు. ఐతే వరద సాయం డబ్బులను కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నేతలను కాజేశారని.. చాలా మందికి డబ్బులు అందలేదని నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో.. వరద సాయం అందని వారు మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటే నేరుగా బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఆ మరుసటి రోజు నుంచే మీ సేవాలకు జనం క్యూకట్టారు. కిలో మీటర్ల మేర వరద బాధితులు బారులు తీరారు. ఐతే అంతలోనే ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో.. కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ క్రమంలోనే బుధవారం సాయంత్రం నుంచి వరద సాయం నిలిపివేశారు. ఎన్నికల తర్వాతే వరద సాయం డబ్బులను పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఐతే వరద సాయం నిలిపివేయడంపై నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి మీరేంటే.. మీరే.. కారణమని.. టీఆర్ఎస్, బీజేపీ నేతలు పరస్పరం విమర్శించుకుంటున్నారు. వరద సాయం అంశంపైనే అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని వేడెక్కిస్తున్నాయి.
Published by:
Shiva Kumar Addula
First published:
November 19, 2020, 8:54 AM IST