GHMC Elections: గ్రేటర్ వార్.. టీఆర్ఎస్‌లో బీజేపీ గుబులు ?

BJP Vs TRS: గతంలో బీజేపీ విమర్శలను అంతగా పట్టించుకోని టీఆర్ఎస్ నాయకత్వం.. ఈసారి వారి ఆరోపణలను తిప్పికొట్టే విషయంలో దూకుడు ప్రదర్శిస్తోంది.

news18-telugu
Updated: November 24, 2020, 5:16 PM IST
GHMC Elections: గ్రేటర్ వార్.. టీఆర్ఎస్‌లో బీజేపీ గుబులు  ?
బండి సంజయ్, కేసీఆర్ (ఫైల్ ఫోటో)
  • Share this:
GHMC ఎన్నికలు తెలంగాణలో రాజకీయ వేడిని మరింతగా పెంచేశాయి. దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ అనూహ్య విజయం సాధించడంతో.. గ్రేటర్ ఎన్నికల్లోనూ మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోంది. టీఆర్ఎస్‌తో ఢీ అంటే ఢీ అనేలా వ్యవహరిస్తున్న బీజేపీ.. గతానికి మరింత భిన్నంగా ఆ పార్టీతో పోరాటానికి కాలు దువ్వుతోంది. గతంలో పలుసార్లు గ్రేటర్ పరిధిలో చెప్పుకోదగ్గ స్థాయిలో సీట్లు సాధించిన బీజేపీకి.. నగర పరిధిలో క్యాడర్ కూడా బాగానే ఉంది. తమకు ఒకప్పుడు బలమైన ప్రాంతాలుగా ఉన్న స్థానాల్లో ఈసారి మళ్లీ జెండా ఎగరేయాలని భావిస్తున్న బీజేపీ... ఇందుకోసం భిన్నమైన వ్యూహాలతో ముందుకు సాగుతోంది.

మరోవైపు బీజేపీ దూకుడుతో టీఆర్ఎస్‌తో గుబులు మొదలైందనే ఊహాగానాలు కూడా సాగుతున్నాయి. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తిరుగులేకుండా ముందుకు సాగిపోయింది. ప్రచారంలోనూ, ఫలితాల్లోనూ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. అయితే ఈసారి మాత్రం పరిస్థితులు అందుకు కాస్త భిన్నంగానే ఉన్నాయి. పలుచోట్ల టీఆర్ఎస్ నేతలు, అభ్యర్థులకు ఓటర్ల నుంచి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. మరోవైపు గతంలో బీజేపీ విమర్శలను అంతగా పట్టించుకోని టీఆర్ఎస్ నాయకత్వం.. ఈసారి వారి ఆరోపణలను తిప్పికొట్టే విషయంలో దూకుడు ప్రదర్శిస్తోంది.

టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీజేపీ నేతల వ్యాఖ్యలకు ఎప్పటికప్పుడు కౌంటర్ ఇస్తున్నారు. ఓ వైపు రోడ్ షోల్లో బీజేపీని టార్గెట్ చేస్తూనే.. ప్రెస్ మీట్ల ద్వారా ఆ పార్టీ తీరును తీవ్రంగా తప్పుబడుతున్నారు కేటీఆర్. కాంగ్రెస్ పార్టీని పెద్దగా విమర్శించని కేటీఆర్.. తన ప్రసంగాల్లో ఎక్కువగా బీజేపీని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. దీంతో గ్రేటర్‌లో తమ ప్రధాన ప్రత్యర్థి బీజేపీనే అనే విషయాన్ని టీఆర్ఎస్ పరోక్షంగా అంగీకరించిందనే వాదనలు వినిపిస్తున్నాయి.

అయితే ఈ విషయంలో టీఆర్ఎస్ వాదన మాత్రం భిన్నంగా ఉంది. దుబ్బాక ఉప ఎన్నికల్లో అసత్యాలు చెప్పడం ద్వారా బీజేపీ విజయం సాధించిందని ఆరోపిస్తోంది. గ్రేటర్ ఎన్నికల్లోనూ బీజేపీ అదే చేస్తోందని.. అందుకే వాళ్లు మాట్లాడుతున్న అంశాలను టీఆర్ఎస్ ఎప్పటికప్పుడు ప్రజల ముందుకు ఎండగడుతోందని చెబుతోంది. ఏదేమైనా... తెలంగాణ ఏర్పడిన తరువాత బీజేపీని ఎప్పుడూ ఇంత సీరియస్‌గా తీసుకోని టీఆర్ఎస్‌ను కమలనాథులు కలవరపెడుతున్నట్టు రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.
Published by: Kishore Akkaladevi
First published: November 24, 2020, 5:16 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading