news18-telugu
Updated: December 2, 2020, 8:46 AM IST
జీహెచ్ఎంసీలో పోలింగ్
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) ఎన్నికల్లో తుది పోలింగ్ వివరాలను ఎన్నికల సంఘం వెల్లడించింది. చివరి నిమిషంలో జనాలు భారీగానే ఓట్లు వేసినట్లు తెలిసింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 46.60 శాతం పోలింగ్ నమోదయిందని ఎస్ఈసీ పార్థసారధి వెల్లడించారు. 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 45.29 శాతం ఓట్లు పోలయ్యాయి. గతం కంటే ఈసారి కాస్త ఎక్కువ పోలింగ్ నమోదయింది. గత ఎన్నికలతో పోల్చితే ఈసారి 1.31 శాతం అధికంగా పోలింగ్ నమోదయింది. ఇక 2009లో 42.04 శాతం పోలింగ్ రికార్డయింది. అంటే పోలింగ్ శాతం క్రమంగా పెరుగుతోందన్న మాట. ఈసారి పోలింగ్ భారీగా తగ్గిందని మొదట వార్తలు వచ్చినప్పటికీ.. చివరకు 46.6శాతానికి చేరుకుంది.
మొత్తం 150 డివిజన్లలో కంచన్‌బాగ్‌లో అత్యధిక పోలింగ్ నమోదయింది. అక్కడ 70.39శాతం పోలింగ్ నమోదయినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఇక అత్యల్పంగా యూసఫ్‌గూడలో 32.99 శాతం పోలింగ్ నమోదయింది. కాగా, ఓల్డ్ మలక్ పేట్లో పోలింగ్ రద్దయిన విషయం తెలిసిందే. సీపీఐ అభ్యర్థికి సీపీఎం ఎన్నికల గుర్తుకేటాయించడంతో.. ఆ పార్టీ నేతల ఫిర్యాదు మేరకు అక్కడ పోలింగ్‌ను అధికారులు రద్దు చేశారు. డిసెంబరు 3న ఓల్డ్ మలక్‌పేట డివిజన్లో రీపోలింగ్ జరగనుంది. రీపోలింగ్ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం విధించారు. డిసెంబరు 4న 150 డివిజన్లలో ఓట్లను లెక్కించి.. ఫలితాలను ప్రకటిస్తారు
Published by:
Shiva Kumar Addula
First published:
December 2, 2020, 8:34 AM IST