news18-telugu
Updated: November 26, 2020, 7:20 PM IST
విక్రమ్ గౌడ్
గ్రేటర్ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. దుబ్బాక గెలుపుతో ఊపుమీదున్న బీజేపీ..హైదరాబాద్‌లోనూ అదే దూకుడును ప్రదర్శిస్తోంది. కేంద్రమంత్రులు, ఎంపీలు, స్టార్ క్యాంపెయినర్లతో ప్రచారంతో పాటు ఆపరేషన్ ఆకర్ష్‌ను ముమ్మరం చేసింది. ఇప్పటికే కాంగ్రెస్, టీఆర్ఎస్ల నుంచి అసంతృప్తులకు గాలం వేస్తూ కాషాయ కండువా కప్పుతోంది. ఈ క్రమంలో ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు మరో బిగ్ షాక్ తగిలనుంది. మాజీమంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ శుక్రవారం బీజేపీలో చేరనున్నారు. కొంతకాలంగా కాంగ్రెస్‌పై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన.. ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి, కాషాయ తీర్థం పుచ్చుకోనున్నారు.
గురువారం బీజేపీ సీనియర్ నేత, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విక్రమ్ ఇంటికి వెళ్లి తాజా రాజకీయాలపై చర్చించారు. బీజేపీలో చేరాల్సిందిగా ఆయన్ను ఆహ్వానించారు. డీకే అరుణతో భేటీ అనంతరం.. విక్రమ్‌గౌడ్ కూడా బీజేపీలోకి వెళ్లడానికి సుముఖత వ్యక్తం చేశారు. ఐతే ఆయన బుజ్జగించేందుకు కాంగ్రెస్ సీనియర్ నేతలు రంగంలోకి దిగారు. గురువారం మధ్యాహ్నం జాంబాగ్‌లోని విక్రమ్‌గౌడ్ కార్యాలయానికి వి. హనుమంతురావు వెళ్లి మాట్లాడారు. ఐతే తనకు పార్టీలో సరైన గౌరవం దక్కడం లేదని ఆయనతో అన్నారు విక్రమ్ గౌడ్. తన తండ్రి ఆస్పత్రిలో ఉన్న సమయంలోనూ ఎవరూ పట్టించుకోలేదని వాపోయారు. ఇక దామోదర రాజనర్సింహ, సీతక్క కూడా విక్రమ్‌గౌడ్‌కు ఫోన్ చేసి బుజ్జగించారు. కానీ తనకు గౌరవం లేని చోట ఉండలేనని విక్రమ్‌గౌడ్ తేల్చిచెప్పారు. రేపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆయన బీజేపీలో చేరనున్నారు.
నిన్న టీఆర్ఎస్ సీనియర్ నేత, శాసన మండలి మాజీ ఛైర్మన్ స్వామి గౌడ్ బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఢిల్లీకి వెళ్లిన ఆయన జేపీ నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి కూడా బీజేపీలో చేరారు.
మరోవైపు కాంగ్రెస్ నుంచి కూడా కొందరు నేతలు బీజేపీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీతో అంటీముట్టనట్టుగా ఉన్న విజయశాంతి కూడా కాషాయ గూటికి చేరుతారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. దుబ్బాక ఎన్నికల ఫలితం తర్వాత ఆమె బీజేపీకి అనుకూలంగా మాట్లాడుతున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ ఎంఐఎం, టీఆర్ఎస్పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక మరో నేత విశ్వేశ్వర్ రెడ్డి కూడా బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. త్వరలోనే కేంద్రహోంమంత్రి అమిత్ షా జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం కోసం హైదరాబాద్ రానున్నారు. ఆ సందర్భంగా అమిత్ షా సమక్షంలో వీరంతా బీజేపీలో చేరుతారని సమాచారం.
Published by:
Shiva Kumar Addula
First published:
November 26, 2020, 7:14 PM IST