news18-telugu
Updated: November 26, 2020, 3:49 PM IST
కేసీఆర్, కిషన్ రెడ్డి(ఫైల్ ఫోటో)
ఎన్నికల వేళ హైదరాబాద్‌లో రాజకీయ రచ్చ జరుగుతోంది. హామీలను పక్కనబెట్టి.. అన్ని పార్టీల నేతలు ఒకరిపై మరొకొరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. రెచ్చగొట్టే ప్రసంగాలు, వివాదాస్పద వ్యాఖ్యలతో సెగలు రేపుతున్నారు. పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్ చేస్తామని బండి సంజయ్ బాంబు పేల్చితే.. ఎన్టీఆర్, పీవీ సమాధులను కూల్చాలని అక్బరుద్దీన్ డిమాండ్ చేశారు. వాటి జోలికొస్తే దారుస్సలాంను బద్ధలు కొడతామని బీజేపీ వార్నింగ్ ఇస్తోంది. మరోవైపు నగరంలో అల్లర్లకు కుట్ర జరుగుతోందంటూ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలను వాయిదా వేసేందుకు అసాంఘిక శక్తులు ప్రయత్నిస్తున్నాయని అన్నారు. ఇలా నేతల పోటీ పోటీ మాటలతో నగర రాజకీయాల్లో రచ్చ జరుగుతోంది.
హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో అల్లర్లకు కుట్రలు జరుగుతున్నాని.. సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి.. ఓటు వేయకుండా ఉండేందుకు కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. గురువారం బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి.. ''శాంతి భద్రతల పేరుతో ప్రజలను భయపెట్టేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. బీజేపీపై అసత్య ప్రచారం చేస్తే ప్రజలకు భయపెడుతున్నారు. ప్రజలు స్వేచ్ఛంగా ఓటేయకుండా ఉండేందుకు కుట్రలు చేస్తున్నారు. అధికారం శాశ్వతం కాదు. ఇతర పార్టీలపై బురద జల్లడం ఎంత వరకు సమంజసం. ప్రజలెవరూ భయపడవద్దు. మీకు అండగా ఉంటాం.'' అని పేర్కొన్నారు.
ఎన్టీఆర్, పీవీ సమాధులను కూల్చుతామనడం ఎంఐఎం అహంకారం, తలపొగరులకు అద్దం పడుతోందని విమర్శించారు కిషన్ రెడ్డి. ఎన్టీఆర్, పీవీ తెలుగు జాతికి స్ఫూర్తిప్రదాతలని.. అక్బరుద్దీన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని స్పష్టం చేశారు. ఎంఐఎంతో స్నేహం చేస్తున్నందుకు దీనిపై సీఎం కేసీఆర్ ప్రజలకు సంజాయిషీ చెప్పుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక అన్ని చోట్ల శాంతి ఏర్పడిందన్న ఆయన.. శాంతి భద్రతల పేరుతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం సరికాదని విమర్శించారు.
కాగా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 150 డివిజన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. నవంబరు 17న జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్‌తో పాటు నోటిఫికేషన్ కూడా విడుదలైన విషయం తెలిసిందే. డిసెంబరు 1న పోలింగ్ జరుగుతుంది. 4న ఫలితాలను వెల్లిస్తారు. ఇక అవసరమైన ప్రాంతాల్లో డిసెంబరు 3న రిపోలింగ్ నిర్వహిస్తారు. కరోనా నేపథ్యంలో బ్యాలెట్ పద్దతిలోనే ఎన్నికలను నిర్వహించనున్నారు.
Published by:
Shiva Kumar Addula
First published:
November 26, 2020, 3:42 PM IST