news18-telugu
Updated: November 25, 2020, 5:01 PM IST
కేటీఆర్, డొనాల్డ్ ట్రంప్
గ్రేటర్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. అసెంబ్లీ ఎన్నికలకు ఏ మాత్రం తగ్గకుండా సెగలు రేపుతున్నాయి. నేతల మాటల తూటాలతో హైదరాబాద్‌లో వాతావరణం వేడెక్కింది. టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, కాంగ్రెస్ నేతలు ప్రచారంలో దూసుకెళ్తూ.. ప్రత్యర్థులపై విమర్శలు సంధిస్తున్నారు. టీఆర్ఎస్ తరపున మంత్రి కేటీఆర్ వన్ మ్యాన్ షో చేస్తున్నారు. ఎంఐఎం తరపున అన్నాదమ్ముళ్లు అక్బరుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ కూడా స్టార్ క్యాంపెయినర్లను రంగంలోకి దించింది. ఐతే బీజేపీ మాత్రం స్థానిక నేతలతో పాటు ఢిల్లీ నుంచి కూడా లీడర్లను రప్పిస్తోంది. ఇప్పటికే కేంద్రమంత్రులు ప్రకాశ్ జవదేకర్, స్మృతి ఇరానీ, బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ తేజస్వి సూర్య నగరంలో పర్యటించారు. త్వరలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, బీజేపీ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, కేంద్రహోంమంత్రి అమిత్ షా కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు.
ఈ క్రమంలో బీజేపీ అగ్ర నేతల ప్రచారంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ANI వార్తా సంస్థతో మాట్లాడిన ఆయన.. గల్లీ ఎన్నికల్లోనూ మత సంబంధ విషయాలనే మాట్లాడుతున్నారని మండిపడ్డారు. స్థానిక అంశాల గురించి మాట్లాడే దమ్ములేదని విమర్శలు గుప్పించారు. ఢిల్లీ నుంచి నేతలను రప్పిస్తున్న బీజేపీ.. అవసరమైతే డొనాల్డ్ ట్రంప్‌ను కూడా తీసుకొస్తుందేమోనని ఎద్దేవా చేశారు మంత్రి కేటీఆర్.
''స్థానిక అంశాల గురించి బీజేపీ మాట్లాడదు. పాతం కాలం నాటి విషయాలు, మత సంబంధ అంశాలు, మత విద్వేషాలే వారు మాట్లాడుతారు. అక్బర్, బాబర్, బిన్ లాడెన్ గురించి చెబుతారు. వీరంతా హైదరాబాద్ ఔటర్లు కానప్పుడు.. ఎందుకు వీరి గురించి మాట్లాడుతున్నారు. ఇవి గల్లీ ఎన్నికలన్న విషయాన్ని మరిచిపోతున్నారు. ఢిల్లీ నుంచి లీడర్లు వస్తున్నారు. అంతర్జాతీయ నేతలు కూడా రావొచ్చు. డొనాల్డ్ ట్రంప్ బీజేపీకి మిత్రుడయినందున ఇక ఆయన కూడా వస్తాడేమో.. కానీ మేము మాత్రం హైదరాబాద్ ప్రజల ఆశీస్సులు మాత్రమే కోరుతున్నాం.'' అని మంత్రి కేటీఆర్ అన్నారు.
కాగా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 150 డివిజన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. నవంబరు 17న జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్‌తో పాటు నోటిఫికేషన్ కూడా విడుదలైన విషయం తెలిసిందే. నవంబరు 18 నుంచి 20 వరకు నామినేషన్లు స్వీకరించారు. 21న నామినేషన్లు పరిశీలించారు. నేటితో నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది. డిసెంబరు 1న పోలింగ్ జరుగుతుంది. 4న ఫలితాలను వెల్లిస్తారు. ఇక అవసరమైన ప్రాంతాల్లో డిసెంబరు 3న రిపోలింగ్ నిర్వహిస్తారు. కరోనా నేపథ్యంలో బ్యాలెట్ పద్దతిలోనే ఎన్నికలను నిర్వహించనున్నారు.
Published by:
Shiva Kumar Addula
First published:
November 25, 2020, 4:53 PM IST