news18-telugu
Updated: November 26, 2020, 7:41 PM IST
GHMC Elections: గ్రేటర్ ఎన్నికల్లో కేటీఆర్ ప్రచారం (Image;TRSpartyonilne)
హైదరాబాద్లో గ్రేటర్ ఎన్నికల ప్రచారం వేడెక్కింది. టీఆర్ఎస్ తరపున మంత్రి కేటీఆర్ వన్ మ్యాన్ షో చేస్తున్నారు. అభ్యర్థుల తరపున ఆయనే రోడ్ షో నిర్వహిస్తున్నారు. గురువారం సాయంత్రం మల్కాజ్గిరిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్.. బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వారికి అభివృద్ధి గురించి మాట్లాడడం చేతకాదని.. ఎంతసేపూ హిందూ-ముస్లిం, ఇండియా-పాకిస్తాన్ అంటూ యువతను రెచ్చగొడతారని విమర్శించారు. ప్రశాంతంగా ఉండే హైదరాబాద్లో మత కల్లోలాలు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి కేటీఆర్.
'' ఎన్నికల్లో గెలిస్తే వరద బాధితులకు రూ.25వేలు ఇస్తామని బీజేపీ నేతలు చెబుతున్నారు. రూ.10వేలు ఆపిన వాళ్లు రూ.25 ఇస్తారా? ఇది నమ్మే విషయమేనా? హైదరాబాద్కు బీజేపీ ఏమీ చేయలేదు. ప్రధాని మోదీ ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరి అకౌంట్లో రూ.15 లక్షలు వేస్తామని ప్రకటించారు. మరి ఎవరికైనా వచ్చాయా? ఆ రూ.15 లక్షలు వచ్చిన వారు బీజేపీకి ఓటు వేయండి. రాని వారు మాకు ఓట వేయండి. వరద సాయంపై ఎవరూ ఆందోళన చెందవద్దు. డిసెంబరు 4 తర్వాత మిగిలిన అందరికీ రూ.10వేల వరద సాయం అందుతుంది.'' అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం కోసం పక్క రాష్ట్రాల సీఎంలు, కేంద్రమంత్రులు, ఎంపీలు వస్తున్నారని కేటీఆర్ తెలిపారు. ఎల్లుండి ప్రధాని మోదీ కూడా వస్తున్నారని వెల్లడించారు. కానీ సింహం ఎప్పుడూ సింగిల్గానే వస్తుందని.. కేసీఆర్ ఎప్పుడూ ఒక్కడేనని స్పష్టం చేశారు. పందులే గుంపులుగా వస్తాయని పేర్కొన్నారు. ఢిల్లీ నుంచి వస్తున్న పొలిటికల్ టూరిస్టులకు స్వాగతమని..హైదరాబాద్కు వెల్కమ్ అని సెటైర్లు వేశారు మంత్రి కేటీఆర్. ఢిల్లీ నుంచి వచ్చే వారంతా ఒట్టి చేతులతో రాకుండా.. వరద బాధితుల కోసం కాస్తైనా డబ్బులు తీసుకురావాలని అన్నారు. గల్లీ బాయ్స్ కావాలో.. ఢిల్లీ బాయ్స్ కావాలో ప్రజలు తేల్చుకోవాలని సూచించారు.
కాగా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 150 డివిజన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. నవంబరు 17న జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్తో పాటు నోటిఫికేషన్ కూడా విడుదలైన విషయం తెలిసిందే. డిసెంబరు 1న పోలింగ్ జరుగుతుంది. 4న ఫలితాలను వెల్లిస్తారు. ఇక అవసరమైన ప్రాంతాల్లో డిసెంబరు 3న రిపోలింగ్ నిర్వహిస్తారు. కరోనా నేపథ్యంలో బ్యాలెట్ పద్దతిలోనే ఎన్నికలను నిర్వహించనున్నారు.
Published by:
Shiva Kumar Addula
First published:
November 26, 2020, 7:35 PM IST