news18-telugu
Updated: November 25, 2020, 7:23 PM IST
కేటీఆర్, అక్బరుద్దీన్ ఓవైసీ
GHMC Elections: గ్రేటర్ ఎన్నికల్లో మాటల తూటాలు పేలుతున్నాయి. రెచ్చగొట్టే ప్రసంగాలు, వివాదాస్పద వ్యాఖ్యలతో.. హైదరాబాద్లో వాతావరణం వేడెక్కింది. పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్ చేస్తామన్న బండి సంజయ్ వ్యాఖ్యలను మరవకముందే.. తాజాగా ఎంఐఎం నేత అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్రమ కట్టడాల పేరుతో పేదలను ఇబ్బందులు పడుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి దుమ్ముంటే... హుస్సేన్ సాగర్ కట్టపై ఉన్న పీవీ నరసింహారావు, ఎన్టీఆర్ సమాధులను కూడా కూల్చేయాలని బాంబు పేల్చారు. ఇప్పుడీ వ్యాఖ్యలపై తెలంగాణలో రచ్చ జరుగుతోంది. అక్బరుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలను మంత్రి కేటీఆర్ తీవ్రంగా తప్పుబట్టారు.
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, మాజీ సీఎం ఎన్టీఆర్పై ఎంఐఎం నేత అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలు అనుచితమని మంత్రి కేటీఆర్ అన్నారు. అక్బరుద్దీన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని స్పష్టం చేశారు. పీవీ, ఎన్టీఆర్ తెలుగు ప్రజల గౌరవాన్ని నిలబెట్టిన మహనీయులని ఆయన కొనియాడారు. ఒకరు ప్రధానిగా, మరొకరు సీఎంగా సుదీర్ఘకాలం ప్రజాసేవలో ఉన్నారని.. ప్రజాస్వామ్యంలో ఇలాంటి వ్యాఖ్యలకు చోటు లేదని కేటీఆర్ అన్నారు
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా తనదైన స్టైల్లో అక్బురుద్దీన్పై విరుచుకుపడ్డారు. మీకు దుమ్ముంటే ఎన్టీఆర్, పీవీ ఘాట్లను కూల్చాలని.. వాటిని కూల్చిన మరుక్షణమే దారుస్సలాంని బీజేపీ కార్యకర్తలు కూల్చేస్తారని హెచ్చరించారు. అంతేకాదు గురువారం
ఉదయం ఎన్టీఆర్, పీపీ ఘాట్లలో నివాళులర్పిస్తానని ఆయన అన్నారు. ఈ మహా నాయకుల ఘాట్లకు రక్షణగా ఉంటానని ప్రమాణం చేయనున్నట్లు వెల్లడించారు.
కాగా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 150 డివిజన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. నవంబరు 17న జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్తో పాటు నోటిఫికేషన్ కూడా విడుదలైన విషయం తెలిసిందే. నవంబరు 18 నుంచి 20 వరకు నామినేషన్లు స్వీకరించారు. 21న నామినేషన్లు పరిశీలించారు. నేటితో నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది. డిసెంబరు 1న పోలింగ్ జరుగుతుంది. 4న ఫలితాలను వెల్లిస్తారు. ఇక అవసరమైన ప్రాంతాల్లో డిసెంబరు 3న రిపోలింగ్ నిర్వహిస్తారు. కరోనా నేపథ్యంలో బ్యాలెట్ పద్దతిలోనే ఎన్నికలను నిర్వహించనున్నారు.
Published by:
Shiva Kumar Addula
First published:
November 25, 2020, 7:23 PM IST