news18-telugu
Updated: November 19, 2020, 1:46 PM IST
GHMC Elections 2020: దుబ్బాక ఎన్నికల ఫలితం జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపదన్నారు మంత్రి కేటీఆర్. బీజేపీకి గతంలో వచ్చిన ఫలితాలే ఈసారి కూడా వస్తాయని జోస్యం చెప్పారు.
హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నామినేషన్ల దాఖలకు రేపే చివరి రోజు కావడంతో గెలుపు గుర్రాలను రంగంలోకి దింపుతున్నారు. ఇప్పటికే తొలి జాబితాను ప్రకటించిన కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు.. ఇవాళ తుది జాబితాను ప్రకటించే అవకాశముంది. ఐతే ఈ ఎన్నికల్లో పొత్తులపై మంత్రి కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఎవరితోనూ పొత్తు లేదని.. ఒంటరిగానే 150 స్థానాల్లో పోటీ చేస్తామని తెలిపారు. తమ మిత్రపక్షం ఎంఐఎంతోనూ పొత్తు ఉండబోదని స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్. గత ఎన్నికల్లో 5చోట్ల ఎంఐఎంను ఓడించామని, ఈసారి 10 చోట్లకుపైగా ఎంఐఎంను ఓడిస్తామన్నారు కేటీఆర్.
''జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 150 సీట్లలో టీఆర్ఎస్ అభ్యర్థులు పోటీచేస్తారు. ఎవరితో మాకు దోస్తీ లేదు. ఈ సారి పాత బస్తీ లో పది సీట్లు గెలుస్తాం. ఎంఐఎంను ఓడగొట్టి ఆ సీట్లు గెలుస్తాం. మా అభ్యర్థి యే మేయర్ అవుతారు. ఎంఐఎంకు ఎందుకిస్తాం ?మాకు పిచ్చా ? బల్దియా మీద గులాబీ జెండా ఖచ్చితంగా ఎగరేస్తాం. జీహెచ్ఎంసీలో రెండో స్థానం ఎవరిదో కాంగ్రెస్, బీజేపీలు తేల్చుకోవాలి.;; అని మంత్రి కేటీఆర్ అన్నారు.
హైదరాబాద్ మహానగరంలో కొందరు విద్వేషపు విత్తనాలు నాటేందుకు ప్రయత్నిస్తున్నారని బీజేపీపై విమర్శలు గుప్పించారు మంత్రి కేటీఆర్. శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని ఎవరైనా ప్రయత్నిస్తే ఉక్కుపాదంతో అణచివేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఆరాచకం కావాలా? అభివృద్ధి కావాలా..? విజ్ఞతతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ప్రజలకు సూచించారు. దుబ్బాక ఎన్నికల ఫలితం జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపదన్నారు మంత్రి కేటీఆర్. బీజేపీకి గతంలో వచ్చిన ఫలితాలే ఈసారి కూడా వస్తాయని జోస్యం చెప్పారు.
కాగా, నవంబరు 17న జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్తో పాటు నోటిఫికేషన్ కూడా విడుదలైన విషయం తెలిసిందే. డిసెంబరు 1న పోలింగ్ జరుగుతుంది. 4న ఫలితాలను వెల్లిస్తారు. నవంబరు 18 నుంచి 20 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 21న నామినేషన్లు పరిశీలిస్తారరు. నామినేషన్ల ఉపసంహరణకు నవంబరు 22 వరకు గడువు ఉంటుంది. ఇక అవసరమైన ప్రాంతాల్లో డిసెంబరు 3న రిపోలింగ్ నిర్వహిస్తారు. కరోనా నేపథ్యంలో బ్యాలెట్ పద్దతిలోనే ఎన్నికలను నిర్వహించనున్నారు.
Published by:
Shiva Kumar Addula
First published:
November 19, 2020, 1:46 PM IST