GHMC Elections: ఓట్లెయ్యం.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు చుక్కలు చూపించిన జనం

GHMC Elections 2020: జీహెచ్ఎంసీ ఎన్నికలు ముగిసిన వెంటనే ప్రభుత్వ నిధులతో రోడ్డు నిర్మాణం చేపడతామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఒకవేళ నిధుల్లో జాప్యం ఏర్పడితే.. తన సొంత డబ్బులో రోడ్డును వేయిస్తానని మాటిచ్చారు. ఈ మేరకు తన లెటర్ హెడ్‌పై సంతకం చేసి స్థానికులకు అందజేశారు.

news18-telugu
Updated: November 22, 2020, 7:12 PM IST
GHMC Elections: ఓట్లెయ్యం.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు చుక్కలు చూపించిన జనం
ఎమ్మెల్యే మైనంపల్లిని అడ్డుకున్న స్థానికులు
  • Share this:
హైదరాబాద్‌లో GHMC ఎన్నికల ప్రచారం వేడెక్కింది. మంత్రి కేటీఆర్ అన్నీ తానై టీఆర్ఎస్ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం అభ్యర్థులు కూడా ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఐతే పలు చోట్ల వారికి జనం నుంచి నిరసనలు ఎదువుతున్నాయి. ఎన్నికలప్పుడే మీకు మేం గుర్తొస్తామని.. ఇన్నాళ్లు తమ సమస్యలను ఎవరూ పట్టించుకోలేదని ఓటర్లు విమర్శిస్తున్నారు. ఆదివారం టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కూడా ఇలాంటి అనుభవమే ఎదరయింది. ఎన్నికల ప్రచారం కోసం వెళ్లిన ఎమ్మెల్యేను స్థానికులు అడ్డుకున్నారు. తమ ప్రాంతానికి రోడ్డు వేస్తేనే ఓటువేస్తామని.. అప్పటి వరకు తమ ప్రాంతానికి రావొద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నేరేడ్‌మెట్‌ డివిజన్‌లోని యప్రాల్‌కు చెందిన స్థానికులు.. రోడ్డు సౌకర్యం కోసం మూడు రోజులుగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. నో రోడ్.. నో ఓట్ అంటూ కాలనీల్లో ర్యాలీ తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం ఎన్నికల ప్రచారానికి వచ్చారు ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు. టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని ఆయన అడగడంతో.. స్థానికులు ఒక్కసారిగా ఎగబడ్డారు. తమ ప్రాంతానికి రోడ్డును వేశాకే ఓట్లు అడగాలని చెప్పారు. అప్పటి వరకు తాము ఎవరికీ ఓట్లు వేయమని తెగేసి చెప్పారు. ఇన్ని రోజులుమేం గుర్తుకు రాలేదా...? మా సమస్యలు పట్టవా..? అని నిలదీశారు.

వారి డిమాండ్‌పై స్పందించిన ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు.. జీహెచ్ఎంసీ ఎన్నికలు ముగిసిన వెంటనే ప్రభుత్వ నిధులతో రోడ్డు నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. ఒకవేళ నిధుల్లో జాప్యం ఏర్పడితే.. తన సొంత డబ్బులో రోడ్డును వేయిస్తానని మాటిచ్చారు. ఈ మేరకు తన లెటర్ హెడ్‌పై సంతకం చేసి స్థానికులకు అందజేశారు. ఐతే సొంత డబ్బుతో మాకు అవసరం లేదని స్థానికులు చెప్పారు. ప్రభుత్వానికి మేం ట్యాక్స్‌ కడుతున్నామని.. ప్రభుత్వ సొమ్ముతోనే రోడ్డు వేయాలని ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు. అలాగేనంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు ఎమ్మెల్యే మైనంపల్లి.

కాగా, నవంబరు 17న జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్‌తో పాటు నోటిఫికేషన్ కూడా విడుదలైన విషయం తెలిసిందే. నవంబరు 18 నుంచి 20 వరకు నామినేషన్లు స్వీకరించారు. గ్రేటర్ పరిధిలోని 150 డివిజన్లకు గాను 2600 నామినేషన్లు దాఖలయ్యాయి. 21న నామినేషన్లు పరిశీలించారు. నేటితో నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది. డిసెంబరు 1న పోలింగ్ జరుగుతుంది. 4న ఫలితాలను వెల్లిస్తారు. ఇక అవసరమైన ప్రాంతాల్లో డిసెంబరు 3న రిపోలింగ్ నిర్వహిస్తారు. కరోనా నేపథ్యంలో బ్యాలెట్ పద్దతిలోనే ఎన్నికలను నిర్వహించనున్నారు.
Published by: Shiva Kumar Addula
First published: November 22, 2020, 7:12 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading