Home /News /politics /

GHMC ELECTIONS 2020 GREATER ELECTION CAMPAIGN ENDS IN HYDERABAD SK

GHMC Elections: మైకులు బంద్.. గ్రేటర్‌లో ముగిసిన ఎన్నికల ప్రచారం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

జీహెచ్ఎంసీ పరిధిలోని 150 డివిజన్లకు.. డిసెంబరు 1న పోలింగ్ జరగనుంది. ఇప్పటికే ఎన్నికల అధికారులు ఆయా ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. అవసరమైన చోట డిసెంబరు 3న రిపోలింగ్ నిర్వహిస్తారు. ఇక డిసెంబరు 4న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు.

ఇంకా చదవండి ...
    GHMC Elections 2020: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం ముగిసింది. హైదరాబాద్ (Hyderabad) పరిధిలో సాయంత్రం 6 గంటల తర్వాత మైకులు మూగబోయాయి. నాయకులు ఎవరు ఇళ్లకు వారు వెళ్లిపోయారు. గడువు ముగిసిన తర్వాత ఎవరైనా ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం ఇది వరకే హెచ్చరించింది. ఇక ఎప్పుడూ లేని విధంగా అన్ని పార్టీలు .. జీహెచ్ఎంసీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, కాంగ్రెస్ మధ్య చతుర్ముఖ పోరు నెలకొంది. పోటా పోటీగా ప్రచారాలు, రెచ్చగొట్టే ప్రసంగాలు, వివాదాస్పద వ్యాఖ్యలతో.. గ్రేటర్‌లో వాతావరణాన్ని నేతలు వేడెక్కించారు.

    టీఆర్ఎస్ తరపున మంత్రి కేటీఆర్ రోడ్ షోలు నిర్వహించారు. ఎమ్మెల్సీ కవిత గల్లీల్లో తిరుగుతూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మంత్రి హరీష్ రావు కూడా కొన్ని డివిజన్లలో ప్రచారం చేశారు. నిన్న సీఎం కేసీఆర్ ఎల్బీస్టేడియంలో బహిరంగ సభలో పాల్గొని ప్రసగించారు. ఇక బీజేపీ ఐతే ఢిల్లీ నేతలను రంగంలోకి దింపి సర్వ శక్తులూ ఒడ్డింది. తెలంగాణ నాయకులతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, కేంద్రమంత్రులు అమిత్ షా, ప్రకాశ్ జవదేకర్, స్మృతి ఇరానీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఎంపీ తేజస్వి సూర్య నగరంలో పర్యటించి.. బీజేపీ అభ్యర్థులకు మద్దుతుగా ప్రచారం చేశారు.

    మరోవైపు ఎంఐఎం నేతలు అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ పదునైన మాటలతో ప్రచారాన్ని హీటెక్కించారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూడా గల్లీల్లో తిరిగి ఓట్లను అభ్యర్థించారు. కాంగ్రెస్ మాత్రం మిగతా పార్టీలకు ధీటుగా ప్రచారం చేయలేకపోయినా.. తామూ రేస్‌లో ఉన్నామంటూ రోడ్‌షోలు, ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఐతే ఎవరెన్నీ చేసినా.. వందకు పైగా సీట్లు సాధించి.. గ్రేటర్ పీఠంపై మరోసారి గులాబీ జెండా ఎగురవేస్తామని టీఆర్ఎస్ ధీమా వ్యక్తం చేస్తోంది. దుబ్బాక తరహా ఫలితాలతో కేసీఆర్‌కు షాకిచ్చి.. బల్దియాను కైవసం చేసుకుంటామని కాషాయ దళం ఊపుమీదుంది.

    కాగా, జీహెచ్ఎంసీ పరిధిలోని 150 డివిజన్లకు.. డిసెంబరు 1న పోలింగ్ జరగనుంది. ఇప్పటికే ఎన్నికల అధికారులు ఆయా ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. అవసరమైన చోట డిసెంబరు 3న రిపోలింగ్ నిర్వహిస్తారు. ఇక డిసెంబరు 4న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు. కరోనా నేపథ్యంలో ఈసారి ఈవీఎంకు బదులు బ్యాలెట్ పద్దతిలోనే పోలింగ్ నిర్వహిస్తున్నారు. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో జీహెచ్ఎంసీ పరిధిలో... ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి డిసెంబరు 1 సాయంత్రం 6 వరకు మద్యం అమ్మకాలపై నిషేధం విధించారు. పోలింగ్ ముగిసిన తర్వాతే మళ్లీ తెరచుకుంటాయి.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: GHMC, Hyderabad, Hyderabad - GHMC Elections 2020, Telangana

    తదుపరి వార్తలు