news18-telugu
Updated: December 1, 2020, 7:32 PM IST
ఓటువేసిన సజ్జనార్ కుటుంబ సభ్యులు
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) ఎన్నికల్లో అతి తక్కువ పోలింగ్ నమోదవడం ఇప్పుడు చర్చనీయాంశమయింది. ప్రభుత్వం, అధికారులు, మీడియా ఎంత చెప్పినా.. నగరవాసులు ఓటు వేసేందుకు ఆసక్తి చూపించలేదు. ఈ క్రమంలో పోలింగ్ శాతంపై సైబరాబాస్ సీపీ సజ్జనార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓటు వేసిన వారికే ప్రభుత్వం పథకాలు వర్తింపజేసేలా నిర్ణయం తీసుకుంటే.. ఓటింగ్ శాతం పెరుగుతుందని అన్నారు. ఎన్నికల్లో ఓటు వేసిన వ్యక్తులకే విద్యా, ఉద్యోగ అవకాశాలను కల్పించాలని అభిప్రాయపడ్డారు.
'' గ్రేటర్ ఎన్నికల్లో ఓటింగ్ శాతం తగ్గడం బాధగా ఉంది. ఓటు హక్కు కాదు. ప్రతి ఒక్కరి బాధ్యత. ఈసారి గ్రేటర్ ఎన్నికల్లో అది ఎక్కడా కనిపించలేదు. ఏదైనా పథకానికి దరఖాస్తు చేయాలంటే లక్షల్లో జనాలు ముందుకు వస్తారు. అదే ఓటు వేయాలంటే మాత్రం కనిపించడం లేదు. పోలింగ్ విషయంలో ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ కొత్త ఆలోచన చేయాలి. విద్యార్థులకు సీట్లు పొందాలన్నా, సర్టిఫికెట్ తీసుకోవాలన్న కచ్చితంగా ఓటు వేసి ఉండాలన్న నిబంధన పెట్టాలి. ఓటు వేసిన వ్యక్తులకే విద్య, ఉద్యోగ అకాశాలు కల్పించాలి. చివరికి మంచి నీటి కనెక్షన్ పొందాలన్నా సరే ఓటు వేసి ఉండాలన్న నిబంధనను తేవాలి. ఓటువేసిన వారికే ప్రభుత్వ పథకాలు వర్తింపజేసేలా నిర్ణయం తీసుకుంటేనే ఓటింగ్ శాతం పెరుగుతుంది.'' అని సజ్జనార్ తెలిపారు.
సజ్జనార్ వ్యాఖ్యలను చాలా మంది సమర్థిస్తున్నారు. అవును .. ఓటు వేయని వారికి రేషన్, పెన్షన్, నల్లా కనెక్షన్‌తో పాటు ఇతర ప్రభుత్వ పథకాలు వర్తింపజేయకూడదని అభిప్రాయపడుతున్నారు. ఓటు హక్కు వినియోగించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఓటు వేయని వారికి కొన్ని దేశాల్లో జైలుశిక్ష విధిస్తున్నారని.. అలాంటి చట్టాలనే మనదేశంలోనూ అమలు చేయాలని కోరుతున్నారు.
కాగా, ఇవాళ జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అత్యల్ప పోలింగ్ నమోదయింది. 40శాతం కూడా దాటలేదు. ఉదయం నుంచీ సాయంత్రం వరకూ.. ఎక్కడా క్యూలైన్లు కనిపించలేదు. పోలింగ్ కేంద్రాలన్నీ నిర్మానుష్యంగా కనిపించాయి. ప్రజలు దయచేసి ఇళ్ల నుంచి వచ్చి ఓటేయాలని.. ప్రజా ప్రతినిధులు, అధికారులు, మీడియా విజ్ఞప్తి చేసినప్పటికీ.. ఎవరూ ముందుకు రాలేదు. ఓటు వేసేందుకు అనాసక్తి చూపించారు. గుర్తులు తారుమారవడంతో ఓల్డ్ మలక్‌పేట్ డివిజన్లో పోలింగ్ రద్దయింది. డిసెంబరు 3న అక్కడ రీపోలింగ్ జరగనుంది. రీపోలింగ్ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం విధించారు. డిసెంబరు 4న 150 డివిజన్లలో ఓట్లను లెక్కించి.. ఫలితాలను ప్రకటిస్తారు.
Published by:
Shiva Kumar Addula
First published:
December 1, 2020, 7:23 PM IST