Hyderabad Municipal Election 2020 Results Updates: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ విధులకు హాజరైన ఉద్యోగులు ఆందోళనకు దిగారు. తమకు కౌంటింగ్ డ్యూటీ వేసిన అధికారులు తీరా ఇక్కడకు వచ్చిన తర్వాత డ్యూటీ ఇవ్వడం లేదని, అప్పటికే కౌంటింగ్ సిబ్బంది సరిపోయారని చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు ఆన్ డ్యూటీ వేయాలని డిమాండ్ చేస్తున్నారు.
సహజంగా ఎన్నికల కౌంటింగ్ అంటే పోలింగ్ ఏజెంట్లు, రాజకీయ పార్టీలకు సంబంధించిన వారు హడావిడి చేయడం కనిపిస్తుంది. అప్పుడప్పుడు ధర్నాలు చేస్తుంటారు. కానీ, ఇక్కడ ఉద్యోగులు ధర్నాకు దిగారు. తమకు ఎన్నికల విధులు కేటాయించి, ఇప్పుడు వచ్చిన తర్వాత తమకు డ్యూటీ వేయడం లేదంటూ నిరసనకు దిగారు. హైదరాబాద్ నగరంలోని సనత్ నగర్, ఓయూ డిస్టెన్స్ కాలేజీలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఖైరతాబాద్ జోన్ జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ సనత్ నగర్ కౌంటింగ్ కేంద్రంలో ఓట్ల లెక్కింపు కోసం పిలిచి బయటే ఉంచారంటూ ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ఉదయం 5 గంటలకు వచ్చి ఇక్కడ వేచి చూస్తున్నామని, దాదాపు 200 మంది ఉద్యోగులు ఆందోళనకు దిగారు. అప్పటి నుంచి తాము పోలింగ్ కేంద్రం బయటనే ఉన్నామని చెప్పారు. ఎలక్షన్ కౌంటింగ్ ట్రైనింగ్ ఇచ్చి, డ్యూటీ లు వేసి ఇప్పుడు ‘సరిపోయారు. మీరు ఇంటికి తిరిగి వెళ్లండి’ అని అధికారులు చెప్తున్నారని ఉద్యోగులు మండిపడుతున్నారు. తాము ఇక్కడకు విధులకు వచ్చినట్టు అటెండెన్స్ కూడా చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కావలసిన సిబ్బంది కంటే అధికంగా ఎందుకు పిలిచారంటూ ఉద్యోగులు ఆందోళనకు దిగారు.
ఇక ఉస్మానియా యూనివర్సిటీ డిస్టెన్స్ కాలేజ్ డీఆర్సీ సెంటర్ లో ఎన్నికల కౌంటింగ్ కోసం వచ్చిన ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కౌంటింగ్ కోసం వివిధ జిల్లాలకు చెందిన ఉద్యోగులకు ఆర్డర్ కాపీలు ఇచ్చారు. దీంతో వారు ఆ ఆర్డర్ కాపీ లు తీసుకుని కౌంటింగ్ కేంద్రాలకు వచ్చారు. తీరా అక్కడకు వచ్చిన తర్వాత డ్యూటీ లేదని వెళ్లిపొమ్మని చెప్పడంతో ఉద్యోగులు నిరాశ చెంది నిరసన వ్యక్తం చేస్తున్నారు. వివిధ జిల్లాల నుంచి ఉదయం నాలుగు గంటలకే ఇక్కడికి చేరుకొని మేము ఎదురుచూస్తుంటే తీరా సమయానికి మీకు డ్యూటీ లేదు అని చెప్పడంతో నిరాశ చెందామని ఉద్యోగులు తెలిపారు.
ఎస్ఈసీ సర్క్యులర్‌ను సస్పెండ్ చేసిన హైకోర్టు
మరోవైపు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన సర్క్యులర్‌ను హైకోర్టు సస్పెండ్ చేసింది. జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో బ్యాలెట్ పేపర్ మీద స్వస్తిక్ గుర్తుతో పాటు పెన్నుతో టిక్ పెట్టినా కూడా ఆ ఓటును పరిగణించాలంటూ నిన్న రాత్రి ఎస్ఈసీ సర్క్యులర్ జారీ చేసింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన బీజేపీ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జూమ్ ద్వారా విచారించారు. బీజేపీ వాదనను సమర్థిస్తూ ఎస్ఈసీ జారీ చేసిన సర్క్యులర్‌ను కోర్టు సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. గెలుపు ఓటముల దగ్గర మార్కింగ్ ఉంటే తుది ఉత్తర్వులకు లోబడి ఫలితాలు వెల్లడించాలని హైకోర్టు ఆదేశించింది. దీనిపై పూర్తివివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని సూచించింది.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.