GHMC ELECTION RESULTS 2020 UPDATES BJP CADRE STAGE PROTEST AS BALLOTS GOES MISSING IN JAMBAGH DIVISION BA
GHMC Elections Results 2020: జాంబాగ్‌లో పోల్ అయిన తర్వాత ఓట్లు గల్లంతు.. బీజేపీ అభ్యంతరం
GHMC Elections Results: జీహెచ్ఎంసీలో ఓట్ల కౌంటింగ్ (File)
Hyderabad Municipal Election 2020 Results Updates: గోషామహల్ నియోజకవర్గంలోని జాంబాగ్ డివిజన్ ఓట్ల లెక్కింపుపై బీజేపీ అభ్యంతరం తెలిపింది. బూత్ నెంబర్ 8లో 471 ఓట్లు పోల్ అయినట్టు ఎన్నికల అధికారులు చెప్పారని, అయితే, అందులో కేవలం 257 మాత్రమే ఉన్నాయని, మిగిలిన ఓట్లు ఏమయ్యాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో (Greater Hyderabad Municipal Election Results 2020) పోల్ అయిన తర్వాత ఓట్లు గల్లంతయ్యాయని బీజేపీ ఆందోళనకు దిగింది. గోషామహల్ నియోజకవర్గంలోని జాంబాగ్ డివిజన్ ఓట్ల లెక్కింపుపై బీజేపీ అభ్యంతరం తెలిపింది. బూత్ నెంబర్ 8లో 471 ఓట్లు పోల్ అయినట్టు ఎన్నికల అధికారులు చెప్పారని, అయితే, అందులో కేవలం 257 మాత్రమే ఉన్నాయని, మిగిలిన ఓట్లు ఏమయ్యాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, ఇది ఎన్నికల ఓట్ల లెక్కింపులో జరిగిన పొరపాటు అని, తక్కువ ఓట్లు పోల్ అయినా, పొరపాటున ఎక్కువ ఓట్లు పోల్ అయినట్టు లెక్కించామని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. ఓట్లు ఎక్కడా గల్లంతు కాలేదని చెప్పారు. బీజేపీ ఆరోపణలు అవాస్తవం అని తెలిపారు. దీనిపై బీజేపీ అనుమానం వ్యక్తం చేసింది. ఈ ఘటనలో బాధ్యులైన అధికారులపై చర్చలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకు పోలింగ్ శాతం తక్కువ నమోదైందని, తామే పొరపాటు చేశామని అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారంటూ బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
గ్రేటర్లో ఉన్న 150 డివిజన్లలో ఇప్పటి వరకు నాలుగు డివిజన్లకు సంబంధించిన ఫలితాలు వెలువడ్డాయి. మెహిదీపట్నం - ఎంఐఎం (మాజిద్ హుస్సేన్), యూసఫ్ గూడ - టీఆర్ఎస్ (బండారి రాజ్ కుమార్), మెట్టుగూట - టీఆర్ఎస్ (సునీత), ఏఎస్ రావు నగర్ - కాంగ్రెస్ (సింగిరెడ్డి శిరీషా రెడ్డి) అభ్యర్థులు గెలుపొందారు. పోస్టల్ బ్యాలెట్లో ఆధిక్యం కనబరిచిన బీజేపీ ఇంకా బోణీ కొట్టలేదు. ప్రస్తుతం ఇంకా కొన్నిచోట్ల మొదటి రౌండ్ కౌంటింగ్ జరుగుతోంది. ఫలితాలు వెలువడిన డివిజన్లలో రెండో రౌండ్ కౌంటింగ్ మొదలు పెట్టారు. ఒక్కో రౌండ్ కౌంటింగ్‌కు కనీసం 2 గంటల సమయం పడుతోంది. ఈ క్రమంలో రెండో రౌండ్ పూర్తి కావడానికి 2 గంటలు అయ్యే అవకాశం ఉంది. జీహెచ్ఎంసీలో నమోదైన పోలింగ్ ప్రకారం సుమారు 136 డివిజన్లలో రెండో రౌండ్‌కే ఫలితాలు వచ్చేస్తాయి. కేవలం 14 డివిజన్లలో మాత్రమే మూడో రౌండ్ కౌంటింగ్ ఉంటుంది.
జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు వెలుబడుతున్న వేళ మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి సంచలన ట్వీట్ చేశారు. పోస్టల్ బ్యాలెట్లో టీఆర్ఎస్ కన్నా బీజేపీకి అత్యధిక ఓట్లు రావడంపై ఆయన స్పందించారు. ఈ ఓట్లు ఉద్యోగులు, వృద్ధుల ఓట్లను అభిప్రాయాన్ని ప్రతిబింబించాయన్నారు. ఈ ఓట్లను రెండు పరిశీలిస్తే రెండు విషయాలు స్పష్టమయ్యాయన్నారు. సాధారణ ప్రజలు టీఆర్ఎస్ కు వ్యతిరేఖంగా ఉన్నారన్నారు. వారంతా జీహెచ్ఎంసీలో బీజేపీ మాత్రమే టీఆర్ఎస్ ను ఎదుర్కొంటుందని భావించారన్నారు. కాంగ్రెస్ టీఆర్ఎస్ ను ఎదుర్కోలేదని అక్కడి ప్రజలు భావించారన్నారు.
ఒక వైపు కాంగ్రెస్ ఐదు లోపు స్థానాలకే పరిమితమయ్యే దిశగా ఫలితాలు వస్తున్న వేళ ఆ పార్టీ సీనియర్ నేత ఇలా ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఆయన త్వరలోనే బీజేపీలో చేరుతారన్న ప్రచారం త్వరలో నిజం అవుతుందని ఈ ట్వీట్ ను బట్టి తెలుస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.