Home /News /politics /

GHMC COLONIES RESIDENTS ANGRY ON TRS GOVT OVER FLOOD VICTIMS FINANCIAL ASSISTANCE SK

GHMC Elections: గ్రేటర్ ఎన్నికల్లో రూ.10 వేలదే కీలక పాత్ర.. ఏం జరగోబోతోంది?

కేసీఆర్‌తో కేటీఆర్(ఫైల్ ఫోటో)

కేసీఆర్‌తో కేటీఆర్(ఫైల్ ఫోటో)

ముఖ్యంగా వరద సాయం అంశాన్నే తెరమీదకు తెస్తోంది. నరేంద్ర మోదీ ప్రభుత్వం వరద బాధితుల కోసం డబ్బులు పంపిస్తే.. టీఆర్ఎస్ నాయకులు ఆ పార్టీ కార్యకర్తలకు పంచుతున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు

  హైదరాబాద్ అంతటా ఇప్పుడు రూ.10 వేల గురించే చర్చ జరుగుతోంది. ప్రభుత్వం ప్రకటించిన వరద సాయంపై అన్ని చోట్లా రచ్చ నెలకొంది. తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన నిధులు.. కొంత మందికి మాత్రమే చేరాయని నగరవాసులు వాపోతున్నారు. ఆ డబ్బులను టీఆర్ఎస్ కార్యకర్తలకే పంచారని.. అసలైన వరద బాధితులను గాలికొదిలేశారని విమర్శలు గుప్పిస్తున్నారు. వరద సాయం అందకపోవడంతో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ప్రజలు ఆందోళనకు దిగుతున్నారు. స్థానిక కార్పొరేటర్లు, జీహెచ్ఎంసీకి వ్యతిరేకంగా విమర్శలు గుప్పిస్తున్నారు.

  ప్రజల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో వరద సాయం అందని వారికి మరో అవకాశం కల్పించింది తెలంగాణ ప్రభుత్వం. మీ సేవా ద్వారా దరఖాస్తు చేసుకుంటే అర్హులందరికీ డబ్బులు అందుతాయని తెలిపింది. పేరు, కుటుంబ సభ్యుల వివరాలు, ఆధార్ కార్డు నెంబర్, కాలనీ, బ్యాంక్ ఖాతా వివరాలతో దరఖాస్తు సమర్పిస్తే.. అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తారు. అనంతరం అర్హులైన వారి బ్యాంకు ఖాతాల్లో రూ.10వేలు జమ చేస్తారు. మంత్రి కేటీఆర్ ఈ ప్రకటన చేసిన మరుసటి రోజు నుంచే.. మీ సేవ వద్ద క్యూలైన్లు కనిపిస్తున్నాయి. చేతిలో దరఖాస్తు పత్రాలను పట్టుకొని గంటల తరబడి ఎదురు చూస్తున్నారు కాలనీ వాసులు.

  మీసేవలో దరఖాస్తుకు రూ.20 మాత్రమే తీసుకుంటారని ప్రభుత్వం చెబుతోంది. కానీ మీ సేవా నిర్వాహకులు మాత్రం రూ.200 వరకు వసూలు చేస్తున్నారు. వందల సంఖ్యలో జనాలు ఉన్నప్పటికీ తక్కువ అప్లికేషన్లు మాత్రమే తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ తీరుపై మరోసారి భగ్గుమంటున్నారు నగరవాసులు. రేషన్ షాపుల ద్వారా డబ్బులు ఇవ్వాలని.. ఎన్ని రోజులు మీసేవల వెంట తిరగాలని మండిపడుతున్నారు. ఎన్నికల సమయంలో ఓట్లడిగేందుకు వచ్చే రాజకీయ నేతలు ఇప్పుడెందుకు రావడం లేదని.. ప్రజల కష్టాలు కనిపించడం లేదా? అని వాపోతున్నారు.

  హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. వరదల సమయంలో ఇళ్లు నీట మునిగి.. నిత్యావసరాలన్నీ పాడయ్యాయి. ఇళ్లు ధ్వంసమయ్యాయి. వరద ప్రభావానికి గురైన ప్రతి ఇంటికీ రూ.10వేల చొప్పున ఆర్థిక సాయం, ఇల్లు పూర్తిగా దెబ్బతింటే రూ.లక్ష, పాక్షికంగా దెబ్బతింటే రూ.50వేలు అందజేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇప్పటికే పలు కాలనీల్లో నేరుగా ప్రజా ప్రతినిధులే డబ్బులను పంచారు. కానీ చాలా వరకు ప్రజలకు మాత్రం ఈ వరద సాయం అందలేదు. వచ్చే నెలలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఈ వరద సాయం అంశమే కీలక పాత్ర పోషించనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వరద సాయం రాని వారంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసే అవకాశముందని విశ్లేషకులు అంచనావేస్తున్నారు.

  దుబ్బాక విజయంతో బీజేపీలో కొత్త జోష్ కనిపిస్తోంది. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ సత్తా చాటి సీఎం కేసీఆర్‌కు కోలుకోలేని షాక్ ఇవ్వాలని భావిస్తోంది. గెలుపే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతోంది. అందులో ముఖ్యంగా వరద సాయం అంశాన్నే తెరమీదకు తెస్తోంది. నరేంద్ర మోదీ ప్రభుత్వం వరద బాధితుల కోసం డబ్బులు పంపిస్తే.. టీఆర్ఎస్ నాయకులు ఆ పార్టీ కార్యకర్తలకు పంచుతున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. కాంగ్రెస్ కూడా దీన్నే హైలైట్ చేస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో హైదరాబాద్ వరదలు, వరద సాయం అక్రమాల చుట్టే జీహెచ్ఎంసీ రాజకీయాలు జరగనున్నాయి. టీఆర్ఎస్‌కు ఇది ఎంత వరకు మైనస్ అవుతుందన్నది ఎన్నికల తర్వాతే తేలనుంది.
  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Hyderabad, Hyderabad - GHMC Elections 2020, Hyderabad Floods, KTR, Telangana

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు