Home /News /politics /

GANTA SRINIVASA RAO VUNDAVALLI JD KEY MEETING IN ANAKAPALLI ON VISAKHA STEEL PLANT AGITATION NGS

Vizag Steel Plant: ఏపీ రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలు: ఉండవల్లి-జేడీలతో గంటా శ్రీనివాస్ సమావేశం అజెండా అదేనా?

ఉండవల్లి, జేడీతో గంటా శ్రీనివాసరావు సమావేశం

ఉండవల్లి, జేడీతో గంటా శ్రీనివాసరావు సమావేశం

ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతోంది. పార్టీలకు దూరంగా ఉంటున్న ముగ్గురు కీలక నేతలు తాజాగా సమావేశమవ్వడం ఆసక్తి పెంచుతోంది. 100 శాతం రాజకీయాలు చేస్తారనే పేరు ఉన్న గంటాతో.. ఉండవల్లి అరుణ్ కుమార్, జేడీ లక్ష్మీనారాయణ భేటీ అవ్వడం వెనుక ఏదో ఉద్దేశం ఉండి ఉంటుందనే ప్రచారం మొదలైంది.

ఇంకా చదవండి ...
  ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి.. ఇంతకాలం రాజకీయంగా మౌనం వహిస్తున్నవారు ఇప్పుడు తెరపైకి వస్తున్నారు. ఏపీ రాజకీయాల్లో గంటా శ్రీనివాసరావు, ఉండవల్లి అరుణ్ కుమార్, జేడీ లక్ష్మి నారాయణలది ప్రత్యేక ప్రస్థానం. వీరు ముగ్గురూ ఇప్పుడు ప్రత్యేకంగా సమావేశం అవ్వడం రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది. జగన్ ను తీవ్రంగా వ్యతిరేకించే జేడీతో కలిసి ఉండవల్లి సమావేశంలో పాల్గొనడం తీవ్ర ఆసక్తి రేపుతోంది.

  గంటా శ్రీనివాసరావు ప్రతి సారి కొత్త నిజయోజకవర్గం నుంచి గెలుపొందుతూ తనకు మాత్రమే సొంతమైన స్టైల్లో వెళ్తున్నారు. ఏ పార్టీ తరపున గెలుపొందిన.. అధికార పార్టీ కండువా కప్పుకుంటారనే ముద్ర వేసుకున్నారు. కానీ 2019 ఎన్నికలు ముగిసినప్పటి నుంచి గంటా శ్రీనివాసరావు పార్టీ మారుతారని ప్రచారం ఉన్నా.. ఇప్పటి వరకు అది జరగలేదు. ముఖ్యంగా అధికార పార్టీ కండువా కప్పుకుంటున్నారన్న ప్రచారం ఇప్పటికీ జరుగుతోంది. తాజాగా మున్సిపల్ ఎన్నికల్లో విశాఖలో టీడీపీ ఓటమికి గంటా కారణమంటూ స్థానిక నేతలు అధిష్టానానికి ఫిర్యాదు కూడా చేశారు. అయితే గత కొంతకాలంగా టీడీపీకి దూరంగా ఉంటూ వస్తున్న ఆయన.. ఇటీవల స్టీల్ ప్లాంట్ ఉద్యమం కోసం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినా.. పార్టీలోనే కొనసాగుతున్నాను అన్నారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో కొందరి అభ్యలర్థుల తరపున ప్రచారం కూడా చేశారు. అయినా ఆయన పార్టీలో ఉన్నారా లేదో తెలియక తెలుగు తమ్ముళ్లే తలలు పట్టుకుంటున్నారు. ప్రస్తుతం అన్నిపార్టీలకు దూరంగా ఉన్న గంటా శ్రీనివాస రావు భవిష్యత్తు కోసం వ్యూహరచన మొదలెట్టారు. అందుకు స్టీల్ ప్రైవేటీకరణను అస్త్రంగా చేసుకుంటున్నారు. నాన్ పొలిటికల్ జేఏసీ పేరుతో.. గతంలో రాజకీయాల్లో ఉండి.. ఇప్పడు పార్టీలకు దూరంగా ఉన్న ప్రముఖులను ఏకం చేసే పనిలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. 

  ఇక ఉండవల్లి అరుణ్ కుమార్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.. ఏపీ రాజకీయాల్లో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగారు. తరువాత వైసీపీలో చేరకున్నా.. జగన్ కు సన్నిహితంగానే ఉంటూ వస్తున్నారు. అప్పుడప్పుడూ చిన్న విమర్శలు తప్పా.. జగన్ కు అనుకూలంగానే ఆయన వ్యాఖ్యలు ఉంటాయి. అయితే ఆయన చేసే విమర్శలు చాలా కచ్చితంగా ఉంటాయి.. ఆధారాలు లేకుండా ఏం మాట్లాడరని.. ఆయన చెప్పేరు అంటే అందులో ఆవేదన ఉందని రాజకీయ నాయకులు నమ్ముతారు. ఏపీకి కేంద్రం చేస్తున్న అన్యాయంపై గళమెత్తడంలో ఉండవల్లి ఎప్పుడూ ముందు ఉంటారు. కేంద్రంపై పోరాటంలో.. రాజకీయ విబేధాలు పక్కన పెట్టి వైసీపీ-టీడీపీలు కలిసి పోరాటం చేయాలని ఉండవల్లి డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన పొలిటికల్ పార్టీలకు దూరంగా ఉన్నా.. రాజకీయ విమ్శలతో ఎప్పుడూ వార్తల్లోనే నిలుస్తూ వస్తున్నారు..

  మూడో వ్యక్తి జేడీ లక్ష్మి నారాయణ.. జగన్ ఆస్తుల కేసులతో హైలైట్ అయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజకీయల్లోకి అడుగుపెట్టారు. జనసేనాని వెంట నడిచారు కూడా. అయితే పవన్ మళ్లీ సినిమాలు వైపు అడుగులు వేయడం నచ్చలేదని బహిరంగంగానే చెప్పిన ఆయన.. తరువాత అన్ని పార్టీలకు సమాన దూరం పాటిస్తూ ఉన్నారు. ఇలా ఈ ముగ్గురిది ఎవరి స్టైల్ వారిది.. ప్రస్తుతం ఏ పార్టీలకు చెందని ఈ కీలక నేతలు ముగ్గురు తాజాగా సమావేశమవ్వడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది.

  రహస్య అజెండా ఏదైనా ఉండొచ్చని.. రాజకీయంగా బలపడేందుకే అడుగులు వేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నా.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పోరాటం విషయంలో చర్చించేందుకే అంతా కలిశామంటున్నారు ఆ నేతలు ముగ్గురు. తాజాగా అనకాపల్లిలోని గంటా కార్యాలయంలో ఈ ముగ్గురు నేతలు సమావేశమయ్యారు. విశాఖ ఉక్కు ఉద్యమ కార్యాచరణపై నే తమ మద్య చర్చ జరిగింది అంటున్నారు గంటా శ్రీనివాసరావు. ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేసేందుకు గాను కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలతోనూ కలిసి చర్చించాలని నిర్ణయించారు.

  ఉక్కు కర్మాగారం పరిరక్షణ ఉద్యమంపై చర్చించామని, త్వరలోనే అన్ని వివరాలు వెల్లడిస్తామన్నారు ఉండవల్లి. గంటా శ్రీనివాసరావు స్పందిస్తూ, రాజకీయాలకు అతీతంగా స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్యమ నిర్మాణం చేపడతామని వెల్లడించారు. ఉండవల్లి తన మేధో సంపత్తితో ఉద్యమానికి సహకరిస్తారని తెలిపారు. అనేకమంది ప్రత్యక్షంగా ఉద్యమంలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారని, అందరినీ ఒకేతాటిపైకి తీసుకువచ్చి ప్రజల భాగస్వామ్యంతో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళతామని గంటా పేర్కొన్నారు. ఉండవల్లి, జేడీ లాంటి మేధావుల సలహాలు ఉక్కు ఉద్యమానికి చాలా అవసరమని గంటా అభిప్రాయపడ్డారు. అయితే తిరుపతి ఉప ఎన్నికలో స్టీల్ ప్లాంట్ జేఏసీ తరపున అభ్యర్థిని నిలబెట్టడంపైనే వీరి మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తోంది. మరి దీనిపై ఉండవల్లి, జేడీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.. ఈ ముగ్గురు కలిసి ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టడానికి ఒప్పుకుంటే.. ఏపీలో కొత్త రాజకీయ వేదికకు తెరలేచినట్టే అవుతుంది.
  Published by:Nagesh Paina
  First published:

  తదుపరి వార్తలు