Home /News /politics /

GANNAVARAM POLITICS ON HIGH HEAT AFTER VALLABHANENI VAMSHI MEETS CM JAGAN MS

వైసీపీలో 'వల్లభనేని' చిచ్చు.. అట్టుడుకుతున్న గన్నవరం రాజకీయం..

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వల్లభనేని వంశీ

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వల్లభనేని వంశీ

Gannavaram Politics : గత పదేళ్లుగా తాము ఎవరిపై పోరాటం చేశామో.. ఇప్పుడు వాళ్లనే పార్టీలో చేర్చుకుంటే తమ పరిస్థితేంటని యార్లగడ్డ ఆవేదన వ్యక్తం చేశారు.

    ఏపీలో గన్నవరం రాజకీయం సెగలు రేపుతోంది. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారన్న ఊహాగానాలతో గన్నవరం రాజకీయం వేడెక్కింది.గన్నవరం వైసీపీ ఇన్‌చార్జిగా ఉన్న యార్లగడ్డ వెంకట్రావు వర్గీయులు వంశీ ఎంట్రీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జగన్‌తో వంశీ భేటీ నేపథ్యంలో వారిలో అలజడి మొదలైంది.ఈ నేపథ్యంలో గన్నవరం వైసీపీ కార్యాలయానికి ఆదివారం యార్లగడ్డ వర్గీయులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఈ సందర్భంగా భవిష్యత్ కార్యాచరణపై యార్లగడ్డ వారితో చర్చించారు.అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. కార్యకర్తల అభిప్రాయాలను,మనోభావాలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. సోమవారం సీఎం జగన్‌తో భేటీ అవుతున్నట్టు చెప్పారు.

    గత పదేళ్లుగా తాము ఎవరిపై పోరాటం చేశామో.. ఇప్పుడు వాళ్లనే పార్టీలో చేర్చుకుంటే తమ పరిస్థితేంటని యార్లగడ్డ ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లుగా అక్రమ కేసులతో వైసీపీ కార్యకర్తలను వేధించినవారిని పార్టీలో చేర్చుకోవడం నష్టం చేస్తుందన్నారు. ఇప్పటికే గన్నవరంలోని మూడు మండలాలకు చెందిన వైసీపీ కన్వీనర్లు రాజీనామా చేస్తామన్నారని చెప్పారు. కానీ సీఎం జగన్‌పై ఉన్న నమ్మకంతో వారు రాజీనామా చేయకుండా తాను నచ్చజెప్పానని అన్నారు. అసలు వంశీ వైసీపీలోకి రావడానికి కారణం వేరే ఉందన్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఇళ్ల పట్టాలు పంచినందుకు.. ఆయనపై అనర్హత వేటు వేయాల్సిందిగా కోర్టులో పిటిషన్ దాఖలైందని గుర్తుచేశారు. కోర్టు కచ్చితంగా వంశీపై అనర్హత వేటు వేస్తుందని.. ఆ భయంతోనే వైసీపీలోకి రావాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వంశీ పార్టీలోకి వస్తే కార్యకర్తల్లో అభద్రతా భావం పెరుగుతుందని.. మళ్లీ ఇబ్బందులకు గురికావాల్సిన పరిస్థితి తలెత్తుతుందని వివరించారు.

    ఇదిలా ఉంటే, గన్నవరం వైసీపీ కార్యాలయానికి భారీగా చేరుకున్న కార్యకర్తలు.. 'వంశీ వద్దు.. యార్లగడ్డ ముద్దు..' అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. 'గన్నవరం గడ్డ.. యార్లగడ్డ అడ్డా..' అంటూ హోరెత్తించారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్నది ఆసక్తికరంగా మారింది. వంశీ నెలాఖరు లోపు పార్టీలో చేరడం ఖాయమని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. జగన్ అందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా.. లేక యార్లగడ్డకు ప్రాధాన్యతనిచ్చి వంశీ ఎంట్రీకి బ్రేకులు వేస్తారా అన్నది వేచి చూడాలి
    Published by:Srinivas Mittapalli
    First published:

    Tags: Gannavaram, Vallabhaneni Vamshi, Ys jagan, Ysrcp

    తదుపరి వార్తలు