కేసీఆరే టార్గెట్ : పాటతో విరుచుకుపడబోతున్న గద్దర్

"పొడుస్తున్న పొద్దు మీద అంటూ" తన పాటలతో తెలంగాణ యువతలో చైతన్య స్ఫూర్తిని రగిలించిన గద్దర్, మళ్లీ గొంతు సవరించుకుంటున్నారు. ఈసారి ఎన్నికల్లో తన పాటల పదును ఎలా ఉంటుందో చూపించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రజా కూటమితో ముందుకెళ్తున్న ఆయన, కేసీఆర్ లక్ష్యంగా ఓ పాటను రూపొందించారు. త్వరలోనే అది తెలంగాణ గడ్డపై ఎన్నికల పోరును ఉద్ధృతం చెయ్యబోతున్నట్లు తెలుస్తోంది.

news18-telugu
Updated: November 23, 2018, 3:02 PM IST
కేసీఆరే టార్గెట్ : పాటతో విరుచుకుపడబోతున్న గద్దర్
ప్రజా గాయకుడు గద్దర్(File)
  • Share this:
తెలంగాణ పోరాటంలో ప్రజా గాయకుడు గద్దర్ గళమెత్తగానే, ఉద్యమం ఉవ్వెత్తున సాగింది. లక్షల యువత కదిలివచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించేవరకూ ఆ వేడి చల్లారకుండా చెయ్యడంలో గద్దర్ పాటలు కూడా కీలక పాత్ర పోషించాయి. అలాంటి ఆయన చాలా కాలం తర్వాత మళ్లీ గళం విప్పబోతున్నారు. ఈసారి ఆయన టార్గెట్ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్. గులాబీ బాస్ పాలనలో రాష్ట్రం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో గద్దర్ తన పాట రూపంలో వినిపించబోతున్నారు. పాటలో ఆయన ఏం చెబుతారు? కేసీఆర్‌పై ఎలాంటి పంచ్‌లు వెయ్యబోతున్నారన్నది ఆసక్తి రేపుతోంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగాలని ప్రయత్నించిన గద్దర్, ఆ తర్వాత నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఐతే తన కొడుకు సూర్యంను... బెల్లంపల్లి నుంచీ బరిలో దింపాలనుకున్నా, ప్రజా కూటమి సర్దుబాట్లలో భాగంగా కాంగ్రెస్, ఆ స్థానాన్ని సీపీఐకి కేటాయించింది. తనకూ, తన కొడుకుకూ అన్యాయం జరిగిందనే ఆవేదనలో గద్దర్, గజ్వేల్ నుంచీ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగాలనుకుని, చివరకు ఆ నిర్ణయాన్ని కూడా వెనక్కి తీసుకున్నారు. పార్టీ తరపున ప్రచారం చేస్తానని, తన సేవల్ని పార్టీకి అంకితం చేస్తానని ప్రకటించారు. ఐతే కాంగ్రెస్ రిలీజ్ చేసిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో గద్దర్ పేరు లేదు. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. గద్దర్ లాంటి సంచలన గాయకుడికి కాంగ్రెస్ నేతలు సరైన గుర్తింపు ఇవ్వలేకపోతున్నారనే వాదన వినిపించింది.

మధుయాష్కీ, గద్దర్, ఆయన భార్య, కుమారుడు.. (ఫైల్ ఫొటో)
మధుయాష్కీ, గద్దర్, ఆయన భార్య, కుమారుడు. (ఫైల్ ఫొటో)


గద్దర్‌కు పార్టీలో తగిన ప్రధాన్యం ఇవ్వాలనుకున్న కాంగ్రెస్, ఆయన సేవల్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్ణయించింది. ఆ క్రమంలో, టార్గెట్ కేసీఆర్‌గా ఓ పాట రాయమని కోరింది. ఇప్పటికే ఎన్నో పాటలతో ఉద్యమానికి ఊపిరి ఊదిన గద్దర్ ఈసారి ప్రజా కూటమి విజయానికి పాటల బాటలు పరుస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.ప్రస్తుతం ప్రభుత్వ వ్యతిరేక వర్గాలన్నీ కేసీఆర్‌కి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. అవన్నీ రకరకాల పాటల్ని ప్రయోగిస్తున్నాయి. టీఆర్ఎస్ పాలనలో తమకు అన్యాయం జరిగిందని భావిస్తున్న ప్రజలు ఇలాంటి పాటల్ని ఆదరిస్తున్నారు. ఇప్పటికే "ఎవడి పాలయిందిరో తెలంగాణ" పాట ఈమధ్య కాలంలో దుమ్మురేపుతోంది. ఈ పాటపై స్వయంగా కేసీఆరే స్పందించారు. తెలంగాణ తెచ్చిన వాడే, ఏలుతున్నాడని కౌంటర్ ఇచ్చారు. ప్రజాకూటమిగా ఎన్నికల బరిలో దిగిన కాంగ్రెస్, ఇలాంటి పాటల్ని ప్రోత్సహిస్తోంది. తాజాగా గద్దర్ నుంచీ వినిపించబోయే గళం ఇంకెంత దుమారం రేపుతుందోనని ఆసక్తికర చర్చ మొదలైంది.
First published: November 23, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు