మంత్రులు సహా 18 మంది ఎమ్మెల్యేల ఫోన్లు స్విచాఫ్.. మధ్యప్రదేశ్‌లో రాజకీయాల్లో ప్రకంపనలు

తాజా బలబలాలతో కాంగ్రెస్,బీజేపీ చెరో రాజ్యసభ సీటు గెలిచే అవకాశముంది. ఐతే మూడో సీటులో ఎవరు గెలుస్తారన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.

news18-telugu
Updated: March 9, 2020, 8:04 PM IST
మంత్రులు సహా 18 మంది ఎమ్మెల్యేల ఫోన్లు స్విచాఫ్.. మధ్యప్రదేశ్‌లో రాజకీయాల్లో ప్రకంపనలు
కమల్ నాథ్, జ్యోతిరాదిత్య సింధియా
  • Share this:
మధ్యప్రదేశ్‌ రాజకీయ సంక్షోభం నెలకొంది. సీఎం కమల్‌నాథ్, జ్యోతిరాదిత్య సింధియా మధ్య నెలకొన్న రాజకీయ వైరం.. రాష్ట్ర కాంగ్రెస్‌ను రెండుగా చీల్చింది. ఇరువురి మధ్య చాలాకాలంగా ఆధిపత్య పోరు ఉన్నప్పటికీ.. ఇటీవల అది తారాస్థాయికి చేరింది. జ్యోతిరాదిత్య సింధియా వర్గానికి చెందిన ఆరుగురు మంత్రులు సహా 18 మంది ఎమ్మెల్యేలు అజ్ఞాతంలోకి వెళ్లడం.. ఇప్పుడు మధ్యప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. వారిని బెంగళూరులోని ఓ రిసార్ట్‌కు తరలించినట్లు తెలుస్తోంది.

న్యూస్ 18కి అందిన విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. ఆరుగురు మంత్రులు సహా మొత్తం 18 మంది ఎమ్మెల్యేలు బెంగళూరులో ఉన్నారు. ప్రస్తుతం వారి ఫోన్లు స్విచాఫ్ చేసి ఉన్నాయి. ఫోన్లు స్విచాఫ్ చేసిన వారిలో రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ మంత్రి తులసి సిలావత్, కార్మికశాఖ మంత్రి మహేంద్ర సింగ్ సిసోడియా, రవాణా మంత్రి గోవింద్ సింగ్ రాజ్‌పుత్, మహిళా-శిశు అభివృద్ధి మంత్రి ఇమార్తి దేవి, ఆహారం-పౌరసరఫరాల మంత్రి ప్రద్యుమ్న సింగ్ తమర్, పాఠశాల విద్యమంత్రి ప్రభుర చౌదరి ఉన్నారు.

ఇటీవల సీఎం కమల్‌నాథ్, జ్యోతిరాదిత్య సింధియా మధ్య బహిరంగంగానే విభేదాలు నెలకొన్నాయి. రాష్ట్రంలో గెస్ట్ టీచర్ల ఆందోళనకు సింధియా మద్దతిచ్చారు. వారి డిమాండ్లను నెరవేర్చకుంటే తాను కూడా రోడ్ల మీదకు వెళ్లి ఆందోళన చేస్తానని.. సొంత ప్రభుత్వానికే వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలో ఇరువరి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఐతే వీరి గొడవలను క్యాష్ చేసుకునేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. కమల్‌నాథ్ ప్రభుత్వానికి మెజార్టీ లేదని విమర్శలు గుప్పిస్తోంది.

కాగా, మార్చి 26న రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 9న మధ్యప్రదేశ్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న రాజ్యసభ్యులు దిగ్విజయ్ సింగ్ (కాంగ్రెస్), ప్రభాత్ ఝా (బీజేపీ), సత్యనారాయణ్ జతియా (బీజేపీ) పదవీ కాలం ముగియనుంది. ఎన్నికల వేళ మధ్యప్రదేశ్‌లో నెలకొన్న తాజా పరిణామాలు కాంగ్రెస్‌కు తలనొప్పిగా మారాయి. బెంగళూరులో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరికి ఓటేస్తారన్నది ఇరుపార్టీల్లోనూ చర్చనీయాంశమైంది.

230 సీట్లున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 114 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీకి 107 మంది సభ్యుల బలం ఉంది. ఇక నలుగురు ఇండిపెండెంట్లు, ఇద్దరు బీఎస్సీ సభ్యులు, ఒక సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే.. కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు మరణించడంతో.. రెండు సీట్లు ఖాళీగా ఉన్నాయి. తాజా బలబలాలతో కాంగ్రెస్,బీజేపీ చెరో రాజ్యసభ సీటు గెలిచే అవకాశముంది. ఐతే మూడో సీటులో ఎవరు గెలుస్తారన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. ఈ క్రమంలోనే క్యాంప్ రాజకీయాలు జరగడం రాష్ట్రంలో ప్రకంపనలు రేపుతోంది.
Published by: Shiva Kumar Addula
First published: March 9, 2020, 7:53 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading